గోదావరి– కృష్ణా డెల్టా ప్రాంత ఉపగ్రహ ఛాయాచిత్రం
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా – గోదావరి బేసిన్... 23 లక్షల ఎకరాల్లో పచ్చని పంటలతో కళకళలాడే అన్నపూర్ణ... రాష్ట్ర ప్రజలకు అన్నం పెట్టే కంచం. ఇప్పుడా కంచం మెల్లమెల్లగా కుంగుతోంది. గోదావరి బేసిన్‌లో విచక్షణారహితంగా సహజవాయువు నిక్షేపాల తవ్వకాలతో డెల్టా అంతకంతకూ కిందకు జారుతోంది. 20 ఏళ్లలో ఏకంగా అడుగున్నర నుంచి 5అడుగుల వరకు భూమి కుంగిందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడికావడం ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణాన్ని నాశనం చేస్తూ... పంటలను దెబ్బతిస్తూ... భవిష్యత్‌లో ఆహార, తాగునీటి కొరత దుస్థితిని కలిగిస్తూ పెనుప్రమాదం ముంచుకొస్తోంది. అయినా సరే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
ఎందుకు కుంగుతోందంటే...
భూగర్భంలో భారీగా గడ్డకట్టి ఉండే రాతి పొరల కింద సహజవాయువు ద్రవరూపంలో నిక్షిప్తమై ఉంటుంది. సున్నపురాయి, ఇసుకరాయి అనే రెండు రకాల రాళ్లు భూగర్భంలో ఉంటాయి. సున్నపురాతి పొరల కింద ఉండే సహజవాయువును వెలికితీస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. సున్నపురాతి గుట్టలు తమంతటతాముగా సర్దుబాటు చేసుకుంటాయి. రాష్ట్రంలో గోదావరి బేసిన్ భూగర్భంలో 3కి.మీ. నుంచి 4కి.మీ. లోపల ఇసుకరాతి గుట్టల పొరల్లో సహజవాయు నిక్షేపాలు ఉన్నాయి. భూగర్భంలోని ఇసుకరాతిలో జియో స్టాటిక్ ప్రెషర్ అనే ఒత్తిడి ఉంటుంది. ఇసుకరాతి పొరల్లో ద్రవరూపంలో ఉండే సహజవాయువులో హైడ్రో స్టాటిక్ ప్రెషర్ అనే ఒత్తిడి ఉంటుంది. ఈ ప్రెషర్‌లు భూ ఉపరితలాన్ని మోస్తూ ఉంటాయి. సహజవాయువును వెలికితీసినప్పుడు హైడ్రో స్టాటిక్ ప్రెషర్ తొలగిపోయి ఖాళీ ఏర్పడుతుంది. ఫలితంగా భూఉపరితలం కిందకు కుంగుతుంది.
20 ఏళ్లలో అడుగున్నర నుంచి 5 అడుగులు కుంగింది...
20 ఏళ్లలో డెల్టాలో అడుగున్నర నుంచి 5 అడుగుల వరకు కుంగిందని ప్రొఫెసర్ కృష్ణారావు అధ్యయనంలో వెల్లడైంది. తీరం నుంచి 20కి.మీ. వరకు ఈ పరిస్థితి ఉన్నట్లు గుర్తించారు. శాస్త్రీయ అధ్యయనం ప్రకారం వెయ్యి మీటర్లు భూగర్భంలోకి తవ్వితే వంద కేజీ సెంటీమీటర్ల ఒత్తిడి ఉంటుంది. గోదావరి బేసిన్‌లో దాదాపు 4కి.మీ. వరకు తవ్వుతున్నారు. అంటే అక్కడ దాదాపు 400 కేజీ సెంటీమీటర్ల ఒత్తిడి ఉంటుంది. అక్కడ ఉన్న సహజవాయువును తీసివేయడంతో ఆమేరకు భూమి కుంగుతోంది. ఒక్కో చమురు బావిలో తవ్వకాల ప్రభావం ఆ పరిసరాల్లో కొన్ని చ.కి.మీ. వరకు ఉంటుంది.
ఇవిగో తార్కాణాలు...
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి గుంటూరు జిల్లా బాపట్ల వరకు భూమి కుంగుతున్న ప్రభావం కనిపిస్తోంది. కాకినాడ– భీమవరం ఇది మరింత ఎక్కువుగా ఉంది. ఆ ప్రాంతంలో భూ ఉపరితలం ఒకప్పుడు సముద్ర మట్టానికంటే 3అడుగుల నుంచి 7అడుగుల వరకు ఎత్తులో ఉండేది. ప్రస్తుతం దాదాపు సరిసమానం కావడంతో సముద్రం తరచూ భూమిపైకి చొచ్చుకు వచ్చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, ఉప్పాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని బొండాడ, సఖినేటిపల్లి, నరసాపురం, మొగల్తూరు, పి.గన్నవరం మొదలైన ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత ఎక్కువుగా ఉంది.
1986లో వరదల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 23.60 అడుగలకు నీటిమట్టం చేరితే పశ్చిమ గోదావరి జిల్లా పి.గన్నవరం వద్ద అక్విడెక్ట్‌పై నుంచి వరదనీరు పారింది. కానీ 2009 వరదల సమయంలో ధవళేవ్వరం బ్యారేజీ వద్ద 19అడుగులకు నీరు చేరగానే పి.గన్నవరం వద్ద అక్విడెక్ట్‌పైకి నీరు చేరింది. అంటే ఆ ప్రాంతంలో భూమి నాలుగు అడుగల వరకు కుంగిందనే విషయం నిర్ధారణ అవుతోందని ప్రొఫెసర్ కృష్ణారావు చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే పదేళ్లలో సముద్ర మట్టం కంటే భూ ఉపరితలం కిందకు దిగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అమెరికా విధానం ఆదర్శం కావాలి
అమెరికాలోని కాలిఫోర్నియాలో కూడా భూగర్భంలో ఇసుక రాతి పొరల్లో ఉన్న సహజవాయువును వెలికితీస్తున్నారు. అయితే అక్కడ సహజవాయువును వెలికితీయగానే... ఎక్కువ పీడనంతో నీటిని ఆ ఇసుకరాతి పొరల్లోకి పంపి హైడ్రో స్టాటిక్ ప్రెషర్ తగ్గకుండా చేస్తున్నారు. ఫలితంగా భూ ఉపరితలం కుంగడం లేదు. మన ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు.
ఇప్పటికైనా మేల్కోనకపోతే వినాశనమే: ప్రొఫెసర్ జి.కృష్ణారావు, శాస్త్రవేత్త
‘విచక్షణారహితంగా సహజవాయువు వెలికితీయడంతో డెల్టాలో భూమి అంతకంతకూ కుంగుతూ ముప్పు ముంచుకొస్తోంది. దీనిపై 1998లోనే అప్రమత్తం చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికైనా శాస్త్రీయంగా తగిన నివారణ చర్యలు చేపట్టకుపోతే భవిష్యత్ తరాలకు తీవ్రహాని చేసినవారమవుతాం.’
శాస్త్రవేత్తల సూచనను పట్టించుకోని చంద్రబాబు
విచక్షణారహితంగా సహజవాయు నిక్షేపాల వెలికితీతపై శాస్త్రవేత్తలు, కృష్ణా– గోదావరి డెల్టా పరిరక్షణ సమితి మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తునే ఉన్నాయి. 1998లోనే ఆంధ్రా విశ్వవిద్యాలయం(ఏయూ) భూవిజ్ఞాన విభాగం ప్రొఫెసర్ జి.కృష్ణారావు దీనిపై లేఖ రాసినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై డెల్టా పరిరక్షణ సమితి ఆందోళనలు నిర్వహించీ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. దాంతో ఓఎన్‌జీసీ ఏయూకు చెందిన డెల్టా స్టడీస్ విభాగంతో పరిశోధనలు నిర్వహించింది. మరోవైపు రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణారావు నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం కూడా అధ్యయనం కొనసాగించింది. ఆరు నెలల పాటు పరిశోధనలు నిర్వహించిన డెల్టా స్టడీస్ విభాగం 2017లో నివేదిక సమర్పించింది.
ఇవీ నష్టాలు
– 23లక్షల ఎకరాల ఆయకట్టుతో రాష్ట్రానికి ధాన్యాగారంగా ఉన్న గోదావరి–కృష్ణా డెల్టాకు పెనుముప్పు వాటిల్లుతోంది.
– సముద్రం తీరప్రాంతాన్ని దాటి భూమిపైకి చొచ్చుకు వస్తే వేలాది ఎకరాలు మునిగిపోతాయి. మరెన్నో భూములు ఉప్పునీటి కయ్యలుగా మారిపోతాయి. ఫలితంగా ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది.
– భూగర్భ జలాలు కలుషితమై తాగునీటి సమస్య ఏర్పడుతుంది. ఇప్పటికే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సముద్రతీరానికి 20కి.మీ.వరకు బావులు తవ్వుతుంటే ఉప్పునీరే వస్తోంది.
– నదులు, కాలువల్లో నీటి ప్రవాహ వేగం బాగా తగ్గిపోయి ఆయకట్టు శివారు ప్రాంతాలకు సాగునీరు సరిగా అందదు.
– తీరప్రాంతానికి సమీపంలో నిర్మించే రోడ్లు, పరిశ్రమలు, ఇతర నిర్మాణాలు దెబ్బతింటాయి.
Comments
Please login to add a commentAdd a comment