సాక్షి, ఒంగోలు: కరోనా భయాందోళనలు ఓవైపు.. అందరూ ఉన్నా అనాథల్లా జీవించాల్సిన దుస్థితి మరో వైపు ఆ ముగ్గురు చిన్నారుల పరిస్థితి అగమ్యగోచరమైంది. ఏదైనా ఆపద వస్తే గతంలో మేమున్నామంటూ బంధువులు, ఆత్మీయులు ముందుకు వచ్చేవారు. కానీ నేడు కరోన మహమ్మారి దెబ్బకు ఆ పాడు రోగం కబళిస్తుందేమోనన్న భయంతో వారిని చూసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ చొరవతో వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూసేందుకు కలెక్టర్ ముందుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలులో ఆదివారం నాటికి 31 పాజిటివ్ కేసులు నమోదైతే వాటిలో 23 కేసులు కేవలం ఇస్లాంపేటకు చెందిన వారివే. దీంతో ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా చేశారు. అక్కడికి ఎవరూ వెళ్లడానికి వీల్లేకుండా, అందులో ఉండేవారు బయటకు రానీయకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ప్రైమరీ కాంటాక్టు కాకుండా సెకండరీ కాంటాక్టులకు సంబంధించి ముందస్తుగా వ్యాధి వ్యాప్తి కాకుండా చాలామందిని క్వారంటైన్‌కు తరలించారు.
అందులో ఒకరు ఇస్లాంపేటకు చెందిన అల్లాభక్షు. ఈయన నెల్లూరు జిల్లాలో ఆర్‌అండ్‌బీలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈయనను ఈనెల 10న రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలోని క్వారంటైన్‌కు తరలించారు. మరుసటి రోజు ఆయన కుమారుడ్ని రిమ్స్ క్వారంటైన్‌కు తరలించారు. ఈనెల 26న వారి కోడల్ని కూడా రిమ్స్ క్వారంటైన్‌కు తీసుకువెళ్లారు. అల్లాభక్షు కుటుంబంలో మొత్తం ఏడుగురు ఉంటారు. అల్లాభక్షు భార్య రెండు నెలల క్రితం ఆమె స్వగ్రామం అయిన కాకినాడకు వెళ్లింది. గత నెల 22వ తేదీ నుంచి రాకపోకలు నిషిద్ధం కావడంతో ఆమె తిరిగి ఒంగోలుకు రాలేని పరిస్థితి నెలకొంది. అల్లాభక్షు కొడుకికి ముగ్గురు ఆడపిల్లలు. కుటుంబ సభ్యులంతా క్వారంటైన్‌లో ఉండటంతో పెద్ద కుమార్తె మదిహ తపస్సు (9), రెండో కుమార్తె ఇస్బా (6), మూడో కుమార్తె హలీనా సాదియా (4) లను పట్టించుకునే వారు కరువయ్యారు.
ఆ ఇంట్లో పైభాగంలో అద్దెకు ఉండే ఇల్లాలు ఆ పిల్లల్ని చేరదీసింది. చిన్నారుల పరిస్థితిని గుర్తించిన ‘సాక్షి’ కలెక్టర్ పోల భాస్కర్ దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన ఆయన మాట్లాడుతూ కాకినాడలో ఉన్న అధికారులతో మాట్లాడి వారి నాయనమ్మకు ట్రూనాట్ పరీక్ష చేసి జిల్లాకు రప్పించడం, అదే విధంగా అల్లాభక్షు శాంపిల్‌ను త్వరగా పరీక్ష చేయించి నెగిటివ్ నిర్థారణ అయితే పంపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా పిల్లల సంరక్షణ బాధ్యతను కూడా ప్రభుత్వం తరఫున తీసుకునేందుకు చర్యలు చేపట్టి వారికి అండగా ఉంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment