గరుగుబిల్లిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు
సాక్షిప్రతినిధి,విజయనగరం: కనిపించని శత్రువు నిశ్శబ్దంగా జిల్లాను కమ్మేస్తోంది. లాక్‌డౌన్ 3.0 ప్రకటించే నాటికి రాష్ట్రంలో గ్రీన్ జోన్‌లో ఉన్న ఏకైక జిల్లా విజయనగరం. కానీ వలస కూలీల రాకతో సేఫ్ జోన్లో ఉన్న జిల్లా రెడ్‌జోన్‌లోకి మారుతోంది. ఇప్పటికే నాలుగు కరోనా పాజిటివ్ కేసుల్లో ఒకరు మృతి చెందగా మరో మూడు కేసులు వెలుగు చూడటంతో జిల్లా ఉలిక్కిపడింది. ఒకే రోజు మరో మూడు కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవా రం విడుదల చేసిన బులిటెన్‌లో అధికారికంగా ప్రకటించడంతో జిల్లాలో ఆందోళన నెలకొంది. అప్రమత్తమైన అధికారు లు పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు.
కంటైన్‌మెంట్ జోన్లుగా ఓంపల్లి, గరుగుబిల్లి
బొండపల్లి మండలం ఓంపల్లి, మెంటాడ మండలం జక్కువ, గరుగుబిల్లి మండల కేంద్రంలో కరోనా కేసులు నిర్ధారణ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమమైంది. ఆ రెండు గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తిస్తూవిజయనగరం ఆర్డీవో, పార్వతీపురం సబ్ కలెక్టర్ శుక్రవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ గ్రామాలకు రాకపోకలను పూర్తిగా నియంత్రించడంతో పాటు, ఇక్కడ ప్రత్యేక పారిశుద్ధ్య కార్య క్రమాలు ప్రా రంభించారు. జక్కువ గ్రామానికి చెందిన వ్యక్తి క్వారంటైన్ సెంటర్‌లో ఉన్నప్పుడే వ్యాధి బయటపడటంతో, ఆతన్ని అక్కడినుంచే నేరుగా కోవిడ్ ఆస్పత్రికి తరలించారు.
ఇంటి వద్దకే నిత్యావసరాలు, కూరగాయలు
వ్యాధి నిర్ధారణ జరిగిన వ్యక్తి ఇంటి చుట్టుపక్కల ఒక కిలోమీటరు వరకూ ఎపిక్ కంటైన్మెంట్‌జోన్‌గా ప్రకటించారు. దీనిప్రకారం గరుగుబిల్లి ఎస్సీ కాలనీలోని 737 ఇళ్లు, ఓంపల్లిలోని 428 ఇళ్లు ఆ పరిధిలోకి చేరాయి. ఈ ప్రాంతాలకు ఇతర గ్రామాలనుంచి రాకపోకలను నిలిపివేశారు. వైద్యులు తదితర అత్యవసర సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ ప్రాంతంలో నివాసం ఉన్నవారంతా ఇళ్లకే పరిమితం కావాల్సిఉంది. వీరికి నిత్యావసరాలు, కూరగాయలను ఇంటికే సరఫరా అవుతాయి.
మరికొన్ని అనుమానిత కేసులు: జిల్లాకు రోజూ వలస కూలీలు, యాత్రికులు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వస్తూనే ఉన్నారు. కాశీ నుంచి దాదాపు 39 మందిరాగా వారిలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించడంతో వారందరికీ పరీక్షలు నిర్వహించారు. చెన్నై నుంచి వచ్చిన ఇద్దరిలో కరోనా లక్షణాలు ఉండటంతో వారికీ పరీక్షలు జరిపారు. పూర్తి రిజల్ట్ రావాల్సి ఉంది. వీరితో పాటు ఇప్పటి వరకూ జిల్లాకు వచ్చిన వలస కూలీలు, మత్స్యకారులు 3571 మంది 59 క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. శుక్రవారం ఒక్కరోజే 296 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
బఫర్ జోన్లలో బారికేడ్లు
కంటైన్మెంట్ జోన్‌కు చుట్టుపక్కల 3 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను బఫర్‌జోన్‌గా ప్రకటించారు. బొండపల్లి మండలం వేండ్రాం, కొండకిండాం, అయ్యమ్మ అగ్రహారం, కిండాం అగ్ర హారం, గంట్యాడ మండలం నీలావతి, జగ్గాపురం, గొర్లెపేట, పెనసాం, నందాం, విజయనగరం మండలం గుంకలాం గ్రామాలున్నాయి. గరుగుబిల్లి బఫర్‌జోన్‌లో పెద్దేరు, ఉద్దవోలు, గొట్టివలస ప్రాంతాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ని వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లడం గానీ, ఇతరులు అందులోకి పవేశించకుండా పోలీసు లు బారికేడ్లు ఏర్పాటు చేశారు. గరుగుబిల్లి ఎస్సీ కాలనీ, హిక్కంవలస, పెద్దేరు రోడ్డు, పెట్రోలు బంకులవద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఓంపల్లి–వేండ్రాం జంక్షన్, ఆంజనేయస్వామి విగ్రహం వద్ద, వేండ్రాం–గరుడుబిల్లి రోడ్డు, నీలావతి జంక్షన్, పెనసాం జంక్షన్, కొండకిండాం ఔటర్‌రోడ్లలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, రాకపోకలను నియంత్రిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment