పచ్చని సీమలో పచ్చి నెత్తురు | Three died in open firing near Pedda Outpally in krishan district | Sakshi
Sakshi News home page

పచ్చని సీమలో పచ్చి నెత్తురు

Published Thu, Sep 25 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

పచ్చని సీమలో  పచ్చి నెత్తురు

పచ్చని సీమలో పచ్చి నెత్తురు

 సాక్షి, ఏలూరు: పచ్చని పైరులతో ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో పచ్చి నెత్తురు పారింది. పగ.. ప్రతీకారాల నేపథ్యంలో ప్రాణా లు తీసే విష సంస్కృతి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ విస్తరిస్తోంది. పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని కుమారులు గుంజుడు మారయ్య, పగిడి మారయ్యలను బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణా జిల్లా పెదఅవుటపల్లి గ్రామంలో జాతీయ రహదారిపై తుపాకులతో కాల్చి హత్య చేసిన ఘటనతో జిల్లా మరోసారి ఉలిక్కిపడింది. ఆరు నెలల క్రితం జరిగిన జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు హత్యకు ప్రతీకారంగానే ఈ ముగ్గురిని హతమార్చారని తెలియడంతో పినకడిమి గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. దుర్గారావు, నాగేశ్వరరావు కుటుంబాలకు చెందిన వ్యక్తుల్లో ఒకరు హైదరాబాద్‌లో ఒకరిని, ఏలూరు విజ యలక్ష్మి థియేటర్ వద్ద మరొకరు గతంలో హత్యకు గురయ్యూరు. ఆ తరువాత జేకే ప్యాలెస్ అధినేత దుర్గారావు, తాజా ఘటనలో తండ్రి, ఇద్దరు కొడుకులు హత్యకు గురయ్యూరు. రెండు కుటుంబాల మధ్య కక్షల నేపథ్యంలో ఇప్పటివరకు ఆరు హత్యలు జరిగాయి.
 
 వివాదం ప్రారంభమైందిలా
 పెదవేగి మండలం పినకడిమి గ్రామంలో జ్యోతిష్యం వృత్తిగా జీవించే కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాటిలో రెండు కుటుంబాల మధ్య ఐదేళ్ల క్రితం తలెత్తిన కుటుంబ వివాదం ఆ తర్వాత రాజకీయ రంగు పులుముకుంది. జ్యోతిష్యుడు, ఏలూరులోని జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు పినకడిమి గ్రామంలో ఓ రాజకీయ పార్టీకి పెద్దగా ఉండేవారు. ఆయన సూచించిన వారికే పదవులు దక్కేవి. అతని అన్న గోవిందు కుమార్తెను అదే గ్రామానికి చెందిన కూరపాటి నాగరాజు కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. నాగరాజు సోదరిని గంధం నాగేశ్వరావు వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల క్రితం గోవిందు కుమార్తె నాగరాజు కొడుకుపై వరకట్న వేధింపుల కేసు పెట్టడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి. పంచాయతీ ఎన్నికల సమయంలో పామర్తి వెంకటేశ్వరరావు అనే మాజీ ఎంపీటీసీకి సర్పంచ్, ఎంపీటీసీ టిక్కెట్లు ఇచ్చేందుకు దుర్గారావు నిరాకరించడంతో గోవిందు, నాగరాజు కుటుంబాల మధ్య వివాదానికి ఆజ్యం పోసింది.
 
 దుర్గారావు హత్యతో పెరిగిన కక్షలు
 ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రాత్రి దుర్గారావు పినకడిమి గ్రామంలోనే హత్యకు గురయ్యారు. అప్పటికే గొడవలు పడుతున్న నాగరాజు, సీటు దక్కించుకోలేకపోయిన వెంకటేశ్వరావు కలిసి ఈ హత్య చేశారనే ఫిర్యాదుతో పోలీసులు వారితోపాటు నాగరాజు కుమారులు, అతని బావ గంధం నాగేశ్వరావు ఇద్దరు కుమారులతో కలిపి మొత్తం 10మందిపై కేసు నమోదు చేశారు. దుర్గారావు హత్య జరిగిన మరునాడు నిందితుల్లో ఒకరైన నాగరాజు ఇంటిపై దుర్గారావు బంధువులు దాడి చేశారు. దీంతో దుర్గారావు హత్య కేసులో నిందితులతోపాటు వారి కుటుంబ సభ్యులు ఊరి నుంచి పారి పోయారు. అనంతరం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశా రు. నాగరాజుతోపాటు అతని కుమారులు చిరంజీవి, శివకృష్ణ ముంబై వెళ్లి, అక్కడ అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారు. కండిషనల్ బెయిల్‌పై విడుదలైన నాగేశ్వరరావు కుమారులు సైతం ముంబై వెళ్లిపోయారు. అక్కడే జ్యోతి ష్యం చెప్పుకుంటూ జీవిస్తున్నారు. కేసు వాయిదాల నిమిత్తం ఏలూరులోని జిల్లా కోర్టుకు వచ్చి వెళుతున్నారు.
 
 కోర్టుకు వస్తుండగా హత్య
 బుధవారం కోర్టు వాయిదా ఉండటంతో పినకడిమిలో ఉంటున్న గంధం నాగేశ్వరరావు ఏలూరు న్యూ ఎస్వీఎస్ ట్రావెల్స్ నుంచి ఏపీ 20వై 0500 నంబర్ గల టవేరా కారును అద్దెకు తీసుకున్నారు. ఉదయం 7గంటలకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కారు ఎక్కి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తన కుమారులు గుంజుడు మారయ్య, పగిడి మారయ్యలను ఏలూరు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో పెదఅవుటపల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో ఆ ముగ్గురినీ కాల్చి చంపారు.
 
 జాతీయ రహదారిపై విస్త­ృత తనిఖీలు
 ఏలూరు (వన్ టౌన్) : పినకడిమికి చెందిన ముగ్గురు వ్యక్తులను నడిరోడ్డుపై దారుణంగా కాల్చిచంపిన దుండగులు విజయవాడ-ఏలూరు జాతీయ రహదారి మీదుగా ఉడాయిస్తున్నారన్న సమాచారం అందుకున్న జిల్లా పోలీసులు కలపర్రు టోల్‌గేటు వద్ద బలగాలతో మోహరించారు. విజయవాడ నుంచి ఏలూరు వచ్చే అన్ని వాహనాలను విసృ్తతంగా తనిఖీ చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ తనిఖీలు జరిగాయి. ద్విచక్ర వాహనం నుంచి ఆర్టీసీ బస్సుల వరకూ ఏ ఒక్కటీ వదలకుండా తనిఖీ చేసినా నిందితులు దొరకలేదు.
 
 లండన్‌లో ప్లాన్!
 జేకే ప్యాలెస్ అధినేత దుర్గారావు హత్యకు ప్రతీకారంగానే ఈ ముగ్గురిని హత్య చేయించి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. లండన్‌లో ఉంటున్న దుర్గారావు బంధువు ఇక్కడి అనుచరుల సహాయంతో ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచి, కిరారుు హంతకులతో పథకం రచించి అదును చూసి హత్య చేయించినట్టు అనుమానిస్తున్నారు. జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి పినకడిమి వెళ్లి దుర్గారావు సంబంధీకులను విచారించారు. దుర్గారావు తోడల్లుడు పస్తం మారియ్య, బావమరిది  కిన్నెర శివకృష్ణలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
 
 తప్పించుకున్న డ్రైవర్
 హత్యల అనంతరం టవేరా వాహనం డ్రైవర్ నరేష్ ఘటనా స్థలం నుంచి తప్పిం చుకుని బస్సులో ఏలూరు చేరుకుని వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రాణభయంతో ఉన్న అతను ఘటన జరిగిన తీరును వివరించాడు. ఏలూరు నుంచి గన్నవరం వెళ్లి కొందరిని తీసుకుని ఏలూరు కోర్టుకు తీసుకువచ్చి.. తిరిగి గన్నవరంలో దించి రావాలని తన యజమాని చెప్పడంతో ఇంటినుంచి వచ్చి వాహనాన్ని తీసుకువెళ్లానని వివరించాడు. నాగేశ్వరావు వన్‌టౌన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వాహనం ఎక్కారని, మధ్యలో ఫోన్‌రాగా హనుమాన్ జంక్షన్ దగ్గరకు వచ్చేశామని అతను ఫోన్లో ఎదుటి వారితో చెప్పినట్టు నరేష్ తెలిపాడు. గన్నవరం నుంచి బయలుదేరిన తమ వాహనాన్ని మరో వాహనం మూడుసార్లు ఢీ కొట్టేందుకు ప్రయత్నించిందని.. నాలుగోసారి ఢీకొట్టడంతో డివైడర్ వద్ద తమ వాహనం నిలిచిపోయిందని వివరించాడు. వాహనం ఆగగానే తమను వెంబ డించిన వాహనం నుంచి ముగ్గురు వ్యక్తులు కిందికి దిగి తుపాకులతో కాల్పులు ప్రారంభించారన్నారు. ప్రాణ భయంతో డోర్ తీసుకుని వేరే డివైడర్ దాటి పరిగెత్తి ఏలూరు వైపు వచ్చే బస్సు ఎక్కేశానని, బస్‌స్టాండ్‌లో కాసేపు కూర్చుని పోలీస్ స్టేషన్‌కు వచ్చానని వివరించాడు. హత్యకు పాల్పడిన వ్యక్తులు ఇన్‌షర్ట్ చేసుకుని నీట్‌గా ఉన్నారని, మొహాలకు ముసుగులు వంటివేమీ ధరించలేదని చెప్పాడు.
 
 పినకడిమిలో 144 సెక్షన్
 పెదవేగి రూరల్ : పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురైన నేపథ్యంలో గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గ్రామంలో శాంతియుత వాతావరణం కొనసాగే వరకూ 144 సెక్షన్ కొనసాగుతుందని తహసిల్దార్ బి.సోమశేఖరరావు తెలిపారు. ఇదిలా ఉండగా, ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామంలో పలుచోట్ల పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేశారు. డీఎస్పీ సత్తిబాబు, ఎస్సై కె.స్వామి గ్రామంలో మకాం వేశారు.
 
 ద్వారకాతిరుమలలో వాహనాల తనిఖీ
 ద్వారకాతిరుమల : కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద హత్యలకు పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రముఖ యాత్రా స్థలం కావడంతో ద్వారకాతిరుమల ఆలయానికి వచ్చే అన్ని వాహనాలను ఎస్సై కర్రి సతీష్‌కుమార్, సిబ్బంది లక్ష్మీపురం వద్ద బుధవారం తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, వివరాలు రాబట్టారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement