ముగ్గురు నకిలీ పోలీసులు అరెస్టు | Three fake police were arrested | Sakshi
Sakshi News home page

ముగ్గురు నకిలీ పోలీసులు అరెస్టు

Published Fri, May 1 2015 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

ముగ్గురు నకిలీ పోలీసులు అరెస్టు

ముగ్గురు నకిలీ పోలీసులు అరెస్టు

నకిలీ తుపాకి, నగదు, కారు స్వాధీనం
పరారీలో మరో నిందితుడు జానీ
వివరాలు వెల్లడించిన అర్బన్ అదనపు ఎస్పీ శ్రీనివాసులు

 
గుంటూరు క్రైం : వ్యసనాలకు బానిసలుగా మారిన నలుగురు యువకులు సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కి కటకటాల పాలయ్యారు. ఇందుకు సంబంధించి అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ బి.శ్రీనివాసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నేరాలకు పాల్పడింది ఇలా...
నరసరావుపేటకు చెందిన ఉయ్యాల గోపి, షేక్ నాగార్జున గత ఏడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు సత్తెనపల్లి, నరసరావుపేట, ప్రకాశం జిల్లా సంతమాగలూరు, గుంటూరు రూరల్ పోలీసు స్టేషన్‌ల పరిధిలో కారులో ప్రయాణికులను ఎక్కించుకుని ఊరు బయటకు తీసుకెళ్లి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. అదే ఏడాది డిసెంబర్‌లో వారిద్దరిని అరెస్టు చేసి  జైలుకు పంపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వారు బెయిల్‌పై విడుదల అయ్యారు.

అనంతరం ఉయ్యాల గోపి నేరాలకు పాల్పడడం మానేశాడు. నాగార్జున నరసరావుపేటకు చెందిన కొనికళ్ళ ప్రకాష్, రౌతు ప్రసంగి, షేక్ జానీలతో ఒక ముఠాగా ఏర్పడి ఏప్రిల్ 6న ప్రకాశం జిల్లా సంతమాగలూరు సమీపంలో ఇండికా కారులో ఇద్దరు ప్రయాణీకులను ఎక్కించుకుని ఊరి బయటకు రాగానే తాము పోలీసులమని చెప్పి నకిలీ తుపాకితో బెదిరించి వారి వద్ద ఉన్న రూ.28,500 దోచుకున్నారు.

ఏప్రిల్ 12న నకరికల్లు నుంచి ఇద్దరు ప్రయాణికులను ఎ క్కించుకుని అదేవిధంగా బంగారు ఉంగరం, రూ.2వేలు నగదు దోచుకున్నారు. అదే నెల 17న  నకరికల్లు నుంచి ద్విచక్రవాహనంపై ఒంటరిగా వెళుతున్న ఓ యువకుడిని ఊరి బయట అటకాయించి అతని వద్ద రూ.10 వేలు దోచుకున్నారు. ఏప్రిల్ 23 అర్ధరాత్రి సమయంలో గుంటూరు మార్కెట్ సెంటర్ వద్ద మాచర్లకు వెళ్లేందుకు వేచి ఉన్న దుర్గా భాస్కర్‌ను కారులో ఎక్కించుకుని నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ వద్ద తుపాకితో బెదిరించి అతని వద్ద ఉన్న రూ. 48,500 నగదు దోచుకొని పరారయ్యారు.

స్పెషల్ టీమ్ ఏర్పాటు

 తుపాకీతో బెదిరించి తమ వద్ద నగదు దోచుకున్నారని మాచర్లకు చెందిన భాస్కరరావు గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం తెలుసుకున్న అర్బన్  జిల్లా ఎస్సీ త్రిపాఠి నిందితులను గుర్తించేందుకు సీసీఎస్ డీఎస్పీ పి.శ్రీనివాస్, సౌత్ డీఎస్పీ బి.శ్రీనివాసులు పర్యవేక్షణలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు.  గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం జంక్షన్‌లో గురువారం చాకచక్యంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మరో నిందితుడు షేక్‌జానీ పరారయ్యాడు. నిందితుల వద్ద ఉన్న రూ.87,400 నగదు,  బంగారు ఉంగరం, నకిలీ తుపాకి, లాఠీ, ఇండికా కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు అదనపు ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా స్పెషల్ టీమ్‌లోని సీఐలు అజయ్‌కుమార్, శివప్రసాద్, సిబ్బందికి రివార్డుల కోసం  ఎస్పీకి సిఫార్స్ చేస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement