నీరు తాగటానికి బావిలోకి దిగి జారిపడ్డ భర్తను రక్షించబోయి భార్య కూడా పడిపోయింది. వారిని కాపాడేందుకు యత్నించిన మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదం కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం మాధవరం సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన కొరకుప్పల కోటయ్య(50), నాగేంద్రమ్మ(45) దంపతులు తమ గొర్రెలను తోలుకుని బుధవారం మాధవరం సమీపంలోని పొలాల్లోకి వెళ్లారు. సాయంత్రం సమయంలో కోటయ్య మంచినీరు తెచ్చేందుకని సమీపంలోని నేలబావిలోకి దిగాడు.
అయితే, కాలుజారి నీటిలో పడిపోయిన కోటయ్య కేకలు వేయటంతో నాగేంద్రమ్మ వచ్చి భర్తను రక్షించేందుకు చీర కొంగును అందించింది. కోటయ్యను పైకి లాగే క్రమంలో నాగేంద్రమ్మ కూడా పడిపోయింది. వారి కేకలు విని సమీపంలోనే ఉన్న మాధవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(60) పరుగున అక్కడికి చేరుకుని, రక్షించేక్రమంలో అతడు కూడా పట్టుతప్పి నీళ్లలో పడిపోయాడు. ముగ్గురూ నీట మునిగి చనిపోయారు. గురువారం ఉదయం వరకు వారి జాడ లేకపోవటంతో కుటుంబసభ్యులు వెతకగా.. బావిలో వారి శవాలు తేలియాడుతూ కనిపించాయి. సమాచారం అందుకున్న సీఐ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బావిలో పడి ముగ్గురు మృతి
Published Thu, Dec 31 2015 11:10 AM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM
Advertisement