కొత్త సంవత్సరం పూట..విషాదం
కొత్త సంవత్సరం పూట మూడు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. గురువారం జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. కిరాణా సరుకులు కొనేందుకు వెళుతూ ఒకరు.. మోటారు సైకిల్ ఢీకొని ఒకరు.. స్నేహితుడితో కలసి వెళుతూ ఇంకొకరు మృతి చెందగా వారి కుటుంబాలు రోదిస్తున్న తీరు చూసేవారిని కలచివేసింది.
మందస, పలాస: కొత్త సంవత్సరం పూట ఓ గిరిజన కుటుంబానికి విషాదం మిగిలింది. కిరాణా సరుకులు తీసుకువస్తానని చెప్పి వెళ్లిన ఆ ఇంటి యజమాని అనంతలోకాలకు వెళ్లిపోయాడు. మందసలోని సాబకోట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని గజపతి జిల్లా డింబిరిగాం గ్రామానికి చెందిన సవర అర్జున (35) తన ఇంటి వద్ద ఉన్న కిరాణా దుకాణంలోకి సరుకులు తీసుకురావడానికి మోటారు సైకిల్‌పై మందస బయలుదేరాడు. మార్గమధ్యలో చినరంగమటియా గ్రామానికి చెందిన సవర మంగొళ, చొంపాపురం గ్రామానికి చెందిన సవర రాజేశ్వరరావు ద్విచక్రవాహనం ఎక్కారు. ముగ్గురూ వస్తూ సాబకోట గ్రామానికి కూతవేటు దూరంలో మందస నుంచి సింగుపురం వైపు వస్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొన్నారు.
అక్కడ ఉన్న దుక్కను తప్పించబోయి మోటారు సైకిల్ మ్యాజిక్ వాహనాన్ని ఢీకొన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో సవర అర్జునకు తలపై తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మంగొళ , రాజేశ్వరరావులు తీవ్రంగా గాయపడ్డారు. అర్జున, మంగొళలను 108 వాహనంలో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో అర్జున మృతి చెందినట్టు వైద్య సిబ్బంది గుర్తించారు. మృతుడికి భార్య సంతోషి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజేశ్వరరావును బుడంబో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అతనికి నుదిటిపై ఏడు కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.రవివర్మ తెలిపారు.