మూడు రేషన్‌షాపులు సీజ్
Published Mon, Sep 9 2013 4:05 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : నిబంధనలు పాటించని మూడు రేషన్ దుకాణాలను సిరిసిల్లలో రెవెన్యూ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థను తహశీల్దార్ జయచంద్రారెడ్డి తనిఖీ చేశారు. పట్టణంలో రేషన్‌షాపులు, రైస్‌డిపోలపై దాడులు చేశారు. స్థానిక సుభాష్‌నగర్‌లో వి.కళకు చెందిన షాపు సమయానుసారంగా తెరవకపోవడంతో సీజ్ చేశారు. శాంతినగర్‌లోని బంధం వరలక్ష్మి, గూడెల్లి మధుసూదన్ షాపులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ అన్ని రేషన్ షాపుల్లో ఎలక్ట్రానిక్ కాంటాల ద్వారా సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా డీలర్లు పట్టించుకోవడం లేదన్నారు. గూడెల్లి మధుసూదన్ షాపులో 1.50 క్వింటాళ్ల బియ్యం శాంతినగర్ పాఠశాలకు పంపించకుండా అక్రమంగా నిల్వ ఉంచడంపై మధుసూదన్, హెచ్‌ఎంకు షోకాజు నోటీసులు జారీ చేశారు. రేషన్ బియ్యం షాపుల్లోకి తరలుతుందన్న సమాచారం మేరకు మార్కెట్‌లోని రెండు రైస్ డిపోలపై దాడులు చేశారు. ఎఫ్‌జీఎల్ అనుమతి లేకుండా దుకాణాలు నిర్వహిస్తుండడంతో నోటీసులు జారీ చేశారు. మూడురోజుల్లోగా అనుమతి పొందాలని హెచ్చరించారు. తహశీల్దార్ వెంట వీఆర్వోలు చంద్రమోహన్, వెంకటస్వామి ఉన్నారు.
Advertisement