తెలంగాణ అంతటా బస్సుల బంద్
హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా తెలంగాణ రాజకీయ జెఎసి, టిఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ అంతటా బంద్ జరుగుతోంది. బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా 94 డిపోల్లో 15 వేల బస్సులు నిలిచిపోయాయి. ఈ కారణంగా ఆర్టీసికి 12 కోట్ల రూపాయల ఆదాయానికి గండనుంది. 70 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 59 వేల మంది ఆర్టీసీ కార్మికులు బంద్‌లో పాల్గొంటున్నారు.
హైదరాబాద్లోని ముషీరాబాద్, కాచీగూడ బర్కత్‌పుర డిపోల్లో 350 బస్సులు నిలిచిపోయాయి. జీడిమెట్ల బస్ డిపో ఎదుట తెలంగాణవాదులు బైఠాయించారు. 300 బస్సులు నిలిచిపోయాయి. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఆ పార్టీ నేతలు ఈటెల రాజేందర్, ఏనుగు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. బండ్లగూడ, హయత్‌నగర్ ఆర్టీసీ డిపోల్లో 245 బస్సులు నిలిచిపోయాయి. ఈ రెండు డిపోల ఎదుట టిఎంయు నేతలు బైఠాయించారు. కూకట్‌పల్లి డిపో నుంచి 131 బస్సులు బయటకు రాలేదు. రంగారెడ్డి జిల్లా తాండూరు డిపో ఎదుట తెలంగాణవాదుల బైఠాయించారు. టీఆర్ఎస్ నేతలు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిగి డిపో ఎదుట తెలంగావాదులు బైఠాయించారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా 7 డిపోలలో బస్సులు కదలలేదు. సిద్ధిపేట బస్సు డిపో, దుబ్బాక బస్‌డిపో ఎదుట టిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పాల్గొన్నారు. మెదక్ ఆర్టీసీ డిపో ఎదుట తెలంగాణ వాదుల బైఠాయించారు. టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట తెలంగాణవాదులు బైఠాయించారు. 8 డిపోల్లో 800 బస్సులు నిలిచిపోయాయి. నాగర్‌కర్నూలు బస్‌డిపో ఎదుట టిఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బస్సు డిపో ఎదుట తెలంగాణవాదులు బైఠాయించారు. జిల్లాలోని 11 డిపోల్లో 989 బస్సులు నిలిచిపోయాయి.
ఆదిలాబాద్ జిల్లాలో 6 డిపోల్లో 596 బస్సులు నిలిచిపోయాయి. వ్యాపార, విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొంటున్నాయి. బంద్‌కు బొగ్గు కార్మికులు మద్దతు తెలిపారు. శ్రీరామ్‌పూర్, బెల్లంపల్లి, మందమర్రిలోని 14 బొగ్గుగనుల్లో కార్మికులు విధుల బహిష్కరించారు. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
వరంగల్ జిల్లా భూపాలపల్లి సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికులు విధులకు హాజరుకాలేదు. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట తెలంగాణవాదులు బైఠాయించారు. 7 డిపోల్లో 720 బస్సులు నిల్చిపోయాయి.