buses stop
-
బాబొస్తే.. బస్సులాపేస్తారా?
- సీఎం పర్యటన పేరుతో పల్లె సర్వీసుల రద్దు - తీవ్ర అగచాట్లు పడ్డ కుగ్రామాల ప్రజలు - చెప్పాపెట్టకుండా ఆపేయడం ఏంటని డీఎంపై మండిపాటు కళ్యాణదుర్గం : సీఎం చంద్రబాబునాయుడు గురువారం పామిడికి వస్తున్న సందర్భంగా బుధవారం ఉదయం నుంచే కళ్యాణదుర్గం డిపోకు చెందిన 23 బస్సు సర్వీసులను రద్దు చేశారు. అయితే ఈ విషయం ప్రకటించకపోవడంతో వివిధ కుగ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్టాండులోనూ, మార్గమధ్యంలోనూ పడిగాపులు కాయాల్సి వచ్చింది. నైట్ సర్వీసులు ఎంతసేపటికీ రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన మహిళలు ఆర్టీసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. 22 బస్సు సర్వీసులను రద్దు చేయడం వల్ల డిపో రూ.4.50 లక్షల ఆదాయం కోల్పోయిందని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నాయకులు ముత్యాలన్న, గణపతి, పవన్ తదితరులు నిరసన తెలిపారు. ప్రయాణికులు, ఈయూ నాయకులు కలిసి డిపో మేనేజర్ పెంచలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని 9 ఆర్టీసీ డిపోల నుంచి సుమారు 200 బస్సు సర్వీసులను సీఎం పర్యటనకు కేటాయించడంతో ఆయా ప్రాంతాల్లో కూడా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సీఎం సభకు బస్సులు తరలించాలని పైనుంచి ఆదేశాలు రాగానే సంబంధిత డిపో మేనేజర్లు కనీసం నోటీసు బోర్డు ద్వారా కూడా సమాచారం బహిర్గతం చేయకపోవడంపై మండిపడ్డారు. ఎంత సీఎం వస్తే మాత్రం చెప్పాపెట్టకుండా బస్సులు రద్దు చేస్తారా అని ప్రయాణికులు నిలదీశారు. దీనిపై డిపో మేనేజర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ బుధవారం సాయంత్రానికే బస్సులు పామిడికి వెళ్లాల్సి ఉండటంతో సర్వీసులను రద్దు చేశామన్నారు. అయితే సిబ్బంది సహకరించకపోవడంతో పంపలేకపోయామని, గురువారం తెల్లవారుజాముకల్లా అక్కడికి చేరుస్తామని చెప్పారు. రద్దయిన సర్వీసులు బెంగళూరు(3 బస్సులు), అనంతపురం(1ఎక్స్‌ప్రెస్), వేపులపర్తి(1నైట్‌హాల్ట్), ముద్దినాయనపల్లి(1) ధర్మవరం(1), కుందుర్పి(3 అందులో 1 నైట్‌హాల్ట్), శెట్టూరు(1), గుంతకల్లు(1), రాయదుర్గం(1), ములకనూరు(1), ఓబిగానిపల్లి(1), పాళ్లూరు(1 నైట్‌హాల్ట్), జంబుగుంపల(1 నైట్‌హాల్ట్), చెళ్లికెర(1నైట్‌హాల్ట్), ఎరడికెర(1 నైట్‌హాల్ట్), శ్రీమజ్జనపల్లి(1 నైట్‌హాల్ట్), అమరాపురం(1), చెళ్లికెర (వయా) వేపులపర్తి(1). -
నెల్లూరులో నిలిచిపోయిన బస్సులు
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్ కారణంగా జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. శనివారం తెల్లవారుజామున 4గంటలకే వైఎస్సార్ సీపీ జిల్లాలోని పలు డిపోలకు వద్దకు చేరుకొని బస్సులను నిలిపి వేశారు. ఈ సందర్భంగా డిపోల ఎదట బైఠాయించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. -
ఫలితమివ్వని తనిఖీలు
సాక్షి,సిటీబ్యూరో: వందల సంఖ్యలో బస్సుల పట్టివేత. పదులసంఖ్యలో ట్రావెల్ ఏజెన్సీల మూసివేత. కానీ పట్టుకున్న బస్సులు పట్టుకున్నట్లే రోడ్డెక్కుతున్నాయి. మూసివేసిన ట్రావెల్ ఏజెన్సీ కార్యాలయాలు యథేచ్ఛగా తెరుచుకుంటున్నాయి. ఏ క్షణంలోనైనా ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల్లో ఆన్లైన్ టికెట్ బుకింగ్ చేసుకొనే సదుపాయం నిక్షేపంగా కొనసాగుతూనే ఉంది. రవాణాశాఖ దాడులు మాత్రమే ప్రహసంగా మారుతున్నాయి. ‘పాలెం’ బస్సు దహనం అనంతరం వరుసదాడులతో హడలెత్తిస్తున్న ఆర్టీఏ కాగితపు బొమ్మను తలపిస్తోంది. అధికారుల స్వాధీనంలో ఉన్న బస్సులపై కోర్టుల్లో జరిమానాలు చెల్లించి తిరిగి రోడ్డెక్కిస్తూనే ఉన్నారు. అలా రోడ్డుపైకి వచ్చినవి తిరిగి పట్టుబడితే మరోసారి జరిమానా చెల్లించి దర్జాగా తిప్పుతూనే ఉన్నారు. కాంట్రాక్ట్ క్యారేజీలుగా పర్మిట్లు తీసుకొని స్టేజీ క్యారేజీలుగా నడుస్తున్న ప్రైవేట్ బస్సులపై రవాణాశాఖ నిర్వహిస్తున్న దాడులు ఉత్తుత్తి తనిఖీలనే తలపిస్తున్నాయి. ‘పాలెం’ దహనం అనంతరం ప్రతిరోజు నగరశివార్లలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. విజయవాడ,బెంగళూరు,ముంబయి, తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే బస్సులను జఫ్తు చేసి కోర్టుల్లో ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లో 500కు పైగాప్రైవేట్ బస్సులను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆపరేటర్లు ఎప్పటికప్పుడు జరిమానాలు చెల్లించి తిరిగి రోడ్డెక్కిస్తున్నారు. జరిమానాల కంటే ఆదాయం మిన్న: హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు వంటి నగరాలకు ఒక ట్రిప్పు వెళ్లివస్తే రూ.20 వేల నుంచి రూ.30వేల వరకు ఆదాయం వస్తుంది. ఆర్టీఏ అధికారులు పట్టుకోవడం వల్ల కోర్టుల్లో చెల్లించే జరిమానా రూ.2500 నుంచి రూ.3000 వరకు ఉంటుంది. ఇలా ప్రతి నెలా లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్న ఆపరేటర్లు కొద్దిమొత్తంలో చెల్లించే జరిమానాలకు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా యథేచ్ఛగా బస్సులు తిప్పుతున్నారు. అయితే ఆర్టీఏ దాడుల దృష్ట్యా పెద్దఎత్తున సరుకు రవాణా చేయడం వంటి ఉల్లంఘనలు మాత్రం నిలిచాయని చెప్పొచ్చు.మిగతా కార్యకలాపాలన్నీ యదావిధిగా కొనసాగుతున్నాయి. మరోవైపు రవాణా అధికారులు సైతం స్టేజీక్యారేజీలుగా కేసులు నమోదు చేసి మిగతా ఉల్లంఘనలు వదిలేస్తున్నారు. ఎమర్జెన్సీ డోర్లు లేకపోయినా, ప్రయాణికుల వివరాలు లేకపోయినా పట్టించుకునే వారు కరువయ్యారు. 20 ప్రైవేటు బస్సులు స్వాధీనం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆర్టీఏ అధికారులు మంగళవారం మరో 20 బస్సులను స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం,హయత్‌నగర్, ఉప్పల్, తదితర ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 20 బస్సులను స్వాధీనం చేసుకున్నట్లు రంగారెడ్డి ఉపరవాణా కమిషనర్ సి.రమేష్ తెలిపారు. కాంట్రాక్టు క్యారేజీలుగా పర్మిట్లు తీసుకొని స్టేజీ క్యారేజీలుగా తిరుగుతుండగా పట్టుకున్నట్లు చెప్పారు. -
తిరగని ఆర్టీసీ చక్రం
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ గురువారం నిర్వహించిన బంద్‌తో జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. జిల్లాలోని 7 డిపోల్లో ఉన్న 739 బస్సులు గేటు దాటి బయటకు రాలేదు. తెలంగాణవాద కార్మిక సంఘాలు కూడా బంద్‌కు మద్దతు ఇవ్వడంతో ఆర్టీసీ బస్సు చక్రం తిరగలేదు. రీజియన్‌లో రోజూవారీగా వచ్చే *60 లక్షల ఆదాయంపై ప్రభావం దీని పడింది. విద్యాసంస్థల మూసివేత ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా విద్యాసంస్థలను మూసివేశాయి. ప్రధాన పట్టణాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలను కూడా మూసివేశారు. విద్యార్థులెవరూ హాజరుకాలేదు, అధ్యాపకులు, సిబ్బంది బంద్‌కు మద్దతుగా ర్యాలీలు తీశారు. తెలంగాణకు ప్రత్యామ్నాయంగా జీఓఎం ఎలాంటి ప్రతిపాదన చేసినా అంగీకరించేది లేదని ఉద్యోగులు నిరసన ర్యాలీల్లో స్పష్టం చేశారు. జెడ్పీ కాంప్లెక్స్‌లో కార్యాలయాల బంద్ జిల్లా పరిషత్తు కార్యాలయ కాంప్లెక్స్‌లోని కార్యాలయాల సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వెంటనే 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రకటించి అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.మోహన్‌రావు, ఏపాల సత్యనారాయణరెడ్డి, జలందేర్‌రెడ్డి, ఎ.చంద్రమౌళి, శరీఫ్, శివ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ రాయల తెలంగాణను ఇక్కడి ప్రజలు ఆమోదించబోరని ఇంటర్ విద్య జేఏసీ జిల్లా చైర్మన్ గార్లపాటి అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. బంద్‌లో భాగంగా నల్లగొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం.నర్సిరెడ్డి, ఎర్ర అంజయ్య, టి.సుధారాణి, శిల్ప, డాక్టర్ అన్సారి, కె.కృష్ణయ్య, పద్మావతి, టీఎల్.నారాయణ, శివకోటి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ అంతటా బస్సుల బంద్
హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా తెలంగాణ రాజకీయ జెఎసి, టిఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ అంతటా బంద్ జరుగుతోంది. బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా 94 డిపోల్లో 15 వేల బస్సులు నిలిచిపోయాయి. ఈ కారణంగా ఆర్టీసికి 12 కోట్ల రూపాయల ఆదాయానికి గండనుంది. 70 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 59 వేల మంది ఆర్టీసీ కార్మికులు బంద్‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్, కాచీగూడ బర్కత్‌పుర డిపోల్లో 350 బస్సులు నిలిచిపోయాయి. జీడిమెట్ల బస్ డిపో ఎదుట తెలంగాణవాదులు బైఠాయించారు. 300 బస్సులు నిలిచిపోయాయి. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఆ పార్టీ నేతలు ఈటెల రాజేందర్, ఏనుగు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. బండ్లగూడ, హయత్‌నగర్ ఆర్టీసీ డిపోల్లో 245 బస్సులు నిలిచిపోయాయి. ఈ రెండు డిపోల ఎదుట టిఎంయు నేతలు బైఠాయించారు. కూకట్పల్లి డిపో నుంచి 131 బస్సులు బయటకు రాలేదు. రంగారెడ్డి జిల్లా తాండూరు డిపో ఎదుట తెలంగాణవాదుల బైఠాయించారు. టీఆర్ఎస్ నేతలు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిగి డిపో ఎదుట తెలంగావాదులు బైఠాయించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 7 డిపోలలో బస్సులు కదలలేదు. సిద్ధిపేట బస్సు డిపో, దుబ్బాక బస్‌డిపో ఎదుట టిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పాల్గొన్నారు. మెదక్ ఆర్టీసీ డిపో ఎదుట తెలంగాణ వాదుల బైఠాయించారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట తెలంగాణవాదులు బైఠాయించారు. 8 డిపోల్లో 800 బస్సులు నిలిచిపోయాయి. నాగర్‌కర్నూలు బస్‌డిపో ఎదుట టిఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బస్సు డిపో ఎదుట తెలంగాణవాదులు బైఠాయించారు. జిల్లాలోని 11 డిపోల్లో 989 బస్సులు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో 6 డిపోల్లో 596 బస్సులు నిలిచిపోయాయి. వ్యాపార, విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొంటున్నాయి. బంద్‌కు బొగ్గు కార్మికులు మద్దతు తెలిపారు. శ్రీరామ్‌పూర్, బెల్లంపల్లి, మందమర్రిలోని 14 బొగ్గుగనుల్లో కార్మికులు విధుల బహిష్కరించారు. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వరంగల్ జిల్లా భూపాలపల్లి సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికులు విధులకు హాజరుకాలేదు. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట తెలంగాణవాదులు బైఠాయించారు. 7 డిపోల్లో 720 బస్సులు నిల్చిపోయాయి.