తిరగని ఆర్టీసీ చక్రం | apsrtc services are stopped due to bandh | Sakshi
Sakshi News home page

తిరగని ఆర్టీసీ చక్రం

Published Fri, Dec 6 2013 2:07 AM | Last Updated on Thu, Jul 11 2019 5:07 PM

apsrtc services are stopped due to bandh

 నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్
 రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ గురువారం నిర్వహించిన బంద్‌తో జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. జిల్లాలోని 7 డిపోల్లో ఉన్న 739 బస్సులు గేటు దాటి బయటకు రాలేదు. తెలంగాణవాద కార్మిక సంఘాలు కూడా బంద్‌కు మద్దతు ఇవ్వడంతో ఆర్టీసీ బస్సు చక్రం తిరగలేదు. రీజియన్‌లో రోజూవారీగా వచ్చే *60 లక్షల ఆదాయంపై ప్రభావం దీని పడింది.
 
 విద్యాసంస్థల మూసివేత
 ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా విద్యాసంస్థలను మూసివేశాయి. ప్రధాన పట్టణాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలను కూడా మూసివేశారు. విద్యార్థులెవరూ హాజరుకాలేదు, అధ్యాపకులు, సిబ్బంది బంద్‌కు మద్దతుగా ర్యాలీలు తీశారు. తెలంగాణకు ప్రత్యామ్నాయంగా జీఓఎం ఎలాంటి ప్రతిపాదన చేసినా అంగీకరించేది లేదని ఉద్యోగులు నిరసన ర్యాలీల్లో స్పష్టం చేశారు.
 
 జెడ్పీ కాంప్లెక్స్‌లో కార్యాలయాల బంద్
 జిల్లా పరిషత్తు కార్యాలయ కాంప్లెక్స్‌లోని కార్యాలయాల సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వెంటనే 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రకటించి అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.మోహన్‌రావు, ఏపాల సత్యనారాయణరెడ్డి, జలందేర్‌రెడ్డి, ఎ.చంద్రమౌళి, శరీఫ్, శివ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 ఇంటర్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
 రాయల తెలంగాణను ఇక్కడి ప్రజలు ఆమోదించబోరని ఇంటర్ విద్య జేఏసీ జిల్లా చైర్మన్ గార్లపాటి అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. బంద్‌లో భాగంగా నల్లగొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం.నర్సిరెడ్డి, ఎర్ర అంజయ్య, టి.సుధారాణి, శిల్ప, డాక్టర్ అన్సారి, కె.కృష్ణయ్య, పద్మావతి, టీఎల్.నారాయణ, శివకోటి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement