ఫలితమివ్వని తనిఖీలు | no use police checkking at check post | Sakshi
Sakshi News home page

ఫలితమివ్వని తనిఖీలు

Published Wed, Jan 8 2014 3:09 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఫలితమివ్వని తనిఖీలు - Sakshi

ఫలితమివ్వని తనిఖీలు

 సాక్షి,సిటీబ్యూరో:
 వందల సంఖ్యలో బస్సుల పట్టివేత. పదులసంఖ్యలో ట్రావెల్ ఏజెన్సీల మూసివేత. కానీ పట్టుకున్న బస్సులు పట్టుకున్నట్లే రోడ్డెక్కుతున్నాయి. మూసివేసిన ట్రావెల్ ఏజెన్సీ కార్యాలయాలు యథేచ్ఛగా తెరుచుకుంటున్నాయి. ఏ క్షణంలోనైనా ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల్లో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చేసుకొనే సదుపాయం నిక్షేపంగా కొనసాగుతూనే ఉంది. రవాణాశాఖ దాడులు మాత్రమే ప్రహసంగా మారుతున్నాయి. ‘పాలెం’ బస్సు దహనం అనంతరం వరుసదాడులతో హడలెత్తిస్తున్న ఆర్టీఏ కాగితపు బొమ్మను తలపిస్తోంది. అధికారుల  స్వాధీనంలో ఉన్న  బస్సులపై కోర్టుల్లో జరిమానాలు  చెల్లించి  తిరిగి రోడ్డెక్కిస్తూనే ఉన్నారు. అలా రోడ్డుపైకి వచ్చినవి  తిరిగి పట్టుబడితే మరోసారి జరిమానా చెల్లించి దర్జాగా తిప్పుతూనే ఉన్నారు. కాంట్రాక్ట్ క్యారేజీలుగా  పర్మిట్లు తీసుకొని స్టేజీ క్యారేజీలుగా నడుస్తున్న  ప్రైవేట్  బస్సులపై రవాణాశాఖ నిర్వహిస్తున్న దాడులు ఉత్తుత్తి తనిఖీలనే తలపిస్తున్నాయి. ‘పాలెం’ దహనం అనంతరం ప్రతిరోజు  నగరశివార్లలో  దాడులు జరుగుతూనే ఉన్నాయి. విజయవాడ,బెంగళూరు,ముంబయి, తదితర  ప్రాంతాల నుంచి రాకపోకలు  సాగించే  బస్సులను  జఫ్తు చేసి  కోర్టుల్లో  ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లో 500కు పైగాప్రైవేట్  బస్సులను స్వాధీనం చేసుకున్నారు. కానీ  ఆపరేటర్లు ఎప్పటికప్పుడు జరిమానాలు చెల్లించి  తిరిగి రోడ్డెక్కిస్తున్నారు.
 
 జరిమానాల కంటే  ఆదాయం మిన్న: హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు వంటి నగరాలకు ఒక ట్రిప్పు  వెళ్లివస్తే రూ.20 వేల నుంచి రూ.30వేల వరకు ఆదాయం వస్తుంది. ఆర్టీఏ  అధికారులు  పట్టుకోవడం  వల్ల  కోర్టుల్లో  చెల్లించే  జరిమానా  రూ.2500 నుంచి  రూ.3000  వరకు ఉంటుంది. ఇలా ప్రతి నెలా  లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్న ఆపరేటర్లు కొద్దిమొత్తంలో చెల్లించే  జరిమానాలకు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా యథేచ్ఛగా బస్సులు తిప్పుతున్నారు. అయితే ఆర్టీఏ  దాడుల  దృష్ట్యా  పెద్దఎత్తున సరుకు రవాణా చేయడం వంటి ఉల్లంఘనలు మాత్రం నిలిచాయని చెప్పొచ్చు.మిగతా కార్యకలాపాలన్నీ యదావిధిగా కొనసాగుతున్నాయి. మరోవైపు రవాణా అధికారులు సైతం  స్టేజీక్యారేజీలుగా  కేసులు నమోదు చేసి మిగతా ఉల్లంఘనలు వదిలేస్తున్నారు. ఎమర్జెన్సీ డోర్లు లేకపోయినా, ప్రయాణికుల వివరాలు లేకపోయినా పట్టించుకునే వారు కరువయ్యారు.
 
 20 ప్రైవేటు బస్సులు స్వాధీనం
 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో  ఆర్టీఏ  అధికారులు  మంగళవారం  మరో 20 బస్సులను  స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం,హయత్‌నగర్,  ఉప్పల్, తదితర ప్రాంతాల్లో  నిర్వహించిన తనిఖీల్లో  20  బస్సులను స్వాధీనం చేసుకున్నట్లు  రంగారెడ్డి ఉపరవాణా కమిషనర్ సి.రమేష్  తెలిపారు.  కాంట్రాక్టు క్యారేజీలుగా పర్మిట్లు   తీసుకొని స్టేజీ క్యారేజీలుగా తిరుగుతుండగా పట్టుకున్నట్లు  చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement