
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని తాడేపల్లిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంటి గోడలు కూల్చివేసిన దుండగులు.. బంగారం, నగదు, విలువైన పత్రాలను దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెం పాత ప్రభుత్వ ఆస్పత్రి సందులోని ఓ ఇంట్లో విజయలక్ష్మి అనే మహిళ అద్దెకు ఉంటున్నారు. శుక్రవారం ఆ ఇంటిపై దుండగులు జేసీబీతో దాడి చేశారు. బిల్డింగ్ ప్రహరీ, ఇంటి లోపలి గోడలు కూల్చివేసిన దుండగలు.. విజయలక్ష్మిని చీరతో కట్టి నిర్బంధించారు. ఇంట్లోని మోటార్, విద్యుత్ మీటర్లను ధ్వంసం చేశారు. ఇంట్లోని బంగారం, నగదుతోపాటు విలువైన పత్రాలు తీసుకుని వెళ్లిపోయారు.
ఈ ఘటనపై విజయలక్ష్మి తన కూతురు సురేఖతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘మేము 25 ఏళ్లకు పైగా ఈ ఇంట్లో అద్దెకు ఉంటున్నాం. ప్రకాశ్, అవినాశ్‌ల అనుచరులు గురువారం తమ ఇంటిని కూల్చేందుకు యత్నించారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు ప్రకాశ్, అవినాశ్‌లు మళ్లీ వారి అనుచరులను మా ఇంటిపై దాడికి పంపారు. సుమారు నలభై మంది జేసీబీ, కత్తులు, గునపాలు, రాడ్లతో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డార’ని తెలిపారు. అలాగే తాము నివాసం ఉంటున్న ఇంటిని బలవంతంగా అక్రమించుకునే ఉద్దేశంతోనే వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment