టికెట్లు..ఇక్కట్లు | Tickets .. looked | Sakshi
Sakshi News home page

టికెట్లు..ఇక్కట్లు

Published Tue, Apr 1 2014 12:08 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

టికెట్లు..ఇక్కట్లు - Sakshi

టికెట్లు..ఇక్కట్లు

  •       టీడీపీలో గందరగోళం
  •      టికెట్ల కేటాయింపులో కొరవడిన స్పష్టత
  •      పెరిగిపోతున్న గ్రూపుల గోల
  •      కత్తులు దూసుకుంటున్న పాత, కొత్త నేతలు
  •      టికెట్లపై తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు
  •      పార్టీ కేడర్‌లో అయోమయం
  •  టీడీపీలో టికెట్ల గోల కొంపముంచుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తున్నా టికెట్లపై వివాదం తేలలేదు. చేరికలతో పాత, కొత్త అంటూ సీట్ల పోటీ పెరిగిపోతోంది. దీంతో ఎవరికి సీటు ఇవ్వాలో తెలియక చంద్రబాబు తలపట్టుకుంటున్నారు.
     
    సాక్షి, విశాఖపట్నం: టీడీపీలో ప్రస్తుతం నియోజక వర్గ ఇన్‌చార్జుల్లో ఒకరిద్దరు మినహా సమర్థులైన నేతలు లేకపోవడంతో టికెట్ల కేటాయింపులో గందరగోళం నెలకొంది. బీజేపీతో పొత్తు ఖరారైతే కనీసం రెండు సీట్లయినా నగరంలో ఆ పార్టీకి ఇవ్వాల్సి ఉండడం, కుల సమీకరణలు తోడవడంతో అభ్యర్థులను ప్రకటించే విషయంలో తేల్చుకోలేకపోతున్నారు. విశాఖ తూర్పులో వెలగపూడికి టికెట్ ఖాయమనే  ప్రచారం జరుగుతున్నా బీజేపీతో పొత్తుపెట్టుకుంటే ఈ సీటు ఆ పార్టీకి వదలుకోవాల్సి ఉంటుందనే అంచనాలున్నాయి. ఉత్తరంలో భరణికానతో పంచకర్ల రమేష్ పోటీపడుతున్నారు.

    యాదవ సామాజిక వర్గం కింద తనకే కేటాయించాలని భరణికాన పోరాటం చేస్తున్నారు. పొత్తుతో బీజేపీకి పోతుందేమోనని ఇక్కడివారు కలవరపడుతున్నారు. పశ్చిమంలో గణబాబుకు దాదాపుగా టికెట్ ఖరారయింది. ఇక దక్షిణంలో తాజాగా వాసుపల్లికి రెహమాన్ పోటీ తగిలారు. మరోపక్క లొడగల కృష్ణ కూడా యనమల ఆశీస్సులతో టికెట్ ఆశిస్తున్నారు. భీమిలిపై అవంతి శ్రీనివాస్‌కు చంద్రబాబు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.  సకురు రఘువీర్, అప్పలనరసింహరాజులతో పాటు మరికొందరు రేసులో ఉన్నారు.

    పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ ఖాయమైందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీలో కొత్తగా చేరిన చింతలపూడి ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. కొన్నేళు ్లగా పనిచేస్తున్న కోన తాతారావుకు అయ్యన్న, యనమల ఆశీస్సులున్నాయి. టికెటివ్వకపోతే రెబల్‌గా రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. పల్లా శ్రీనివాస్ కూడా చేరడంతో టికెట్ ముడి మరింత బిగుసుకుంది.
     
    జిల్లా స్థానాలూ జఠిలమే
     
    అనకాపల్లిపై గంటా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడుకే ఇక్కడ సీటు ఇవ్వనున్నారు. ఈయన తన కుమారుడికి అనకాపల్లి పార్లమెంట్ స్థానం అడుగుతున్నారు. ఈ సీటు ఇవ్వకపోతే అయ్యన్న నర్సీపట్నం నుంచి పోటీచేస్తారా?.. లేదా?.. ఆయన తనయుడిని బరిలోకి దించుతారా? అనేది తేలాల్సి ఉంది. యలమంచిలిలో కన్నబాబురాజు టీడీపీలోకి చేరినా టికెట్ హామీ లభించలేదు. ప్రస్తుత నియోజక వర్గ ఇన్‌చార్జి సుందరపు విజయ్‌కుమార్, మాజీ ఎంపీ పప్పుల చలపతిరావు కూడా టికెట్ రేసులో ఉన్నారు.

    ఒకరికి టికెట్ ఇస్తే రెండో వ్యక్తి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. చోడవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు ఉన్నారు. గూనూరు మల్లునాయుడు, బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్ బి.సత్యపాపారావు ప్రయత్నిస్తున్నారు. కేఎస్‌ఎన్‌కు కాకుండా స్థానికంగా ఎక్కువ ఓటర్లు ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన మల్లునాయుడుకు ఇవ్వాలని పార్టీ ఆలోచన. దీనిపై పార్టీ ఒక అవగాహనకు రాలేదని తెలిసింది. మాడుగులలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు.

    వైద్యుడైన ముర్రు జయచంద్రనాయుడు, పీఆర్పీ నుంచి పోటీచేసి ఓడిపోయిన సాఫ్ట్‌వేర్ కంపెనీల అధినేత, ఎన్‌ఆర్‌ఐ పైలా ప్రసాద్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడా తేల్చలేదు. పాడేరులో నాయకత్వ సమస్య ఉంది.  మణికుమారి, కొత్తగుల్లి సుబ్బారావు, వంజంగి కాంతమ్మ, మాజీ ఎమ్మెల్యే ఎం.వి.ఎస్.సత్యనారాయణ తనయుడు ఎం.వి.ఎస్.ప్రసాద్ బరిలో ఉన్నారు.

    కానీ వీరి మధ్య తీవ్రంగా గ్రూపులుండడంతో టికెట్ ఎవరికి ఇవ్వాలో పార్టీ తేల్చుకోలేకపోతోంది. అరకులో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే సిరివేము సోమ. బీఎస్పీ పార్టీ నుంచి గతంలో అసెంబ్లీ అభ్యర్థిగా ఓడిపోయిన పాంగి రాజారావు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. పాయకరావుపేటలో వంగలపూడి అనితకు టికెట్ ఖరారయిందని ప్రచారం జరిగినా గ్రూపు తగాదాల నేపథ్యంలో మళ్లీ నిర్ణయం వాయిదా పడింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement