సాక్షి, ఆత్మకూరు రూరల్: కర్నూలు జిల్లా వెలుగోడు పట్టణ పరిసరాల్లో నాలుగు రోజులుగా కలకలం రేపుతున్న పెద్దపులి, దాని రెండు పిల్లల్లో ఒకటి చనిపోయింది. మరొక పులిపిల్లను అటవీ శాఖ అధికారులు బంధించారు. పెద్దపులి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. మామిడితోటలో తిష్ట వేసిన పులులను బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది శనివారం తీవ్రంగా శ్రమించారు. ఇదే క్రమంలో అక్కడి పొదల్లో చనిపోయిన పులిపిల్ల కనిపించింది. సుమారు ఏడాదిన్నర వయసున్న పులి పిల్ల ఆహారం లేకపోవడం వల్లే చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. పెద్దపులితో పాటు మరొక పులి పిల్ల కోసం అటవీశాఖ అధికారులు నాలుగు జేసీబీలను తెప్పించి.. వాటిపై నిపుణులైన సిబ్బందిని ఉంచి గాలింపు చేపట్టారు. డ్రోన్ కెమెరాలతోనూ అన్వేషించారు. మామిడి తోట చుట్టుపక్కల పొదల్లో గాలిస్తుండగా రెండవ పులిపిల్ల కనిపించింది. దీనికి తుపాకీ సాయంతో మత్తు ఇంజక‌్షన్ ఇచ్చి బోనులో బంధించారు. తర్వాత తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూకు తరలించారు. ఇక తల్లి పులి ఏమైందన్నది ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా పులి పిల్లలు తల్లితోపాటు సుమారు రెండున్నరేళ్ల వరకు అంటిపెట్టుకొని ఉంటాయి. అక్కడే ఆహారం కోసం జంతువులను వేటాడటం నేర్చుకుంటాయి. అయితే.. ఈ పులి పిల్లలు వేటలో నిపుణత సా«ధించకముందే తల్లి నుంచి దూరమవ్వడం వల్ల ఆహారం లభించక ఇబ్బంది పడి ఉంటాయని, ఈ కారణంగానే ఒక పులి పిల్ల మరణించిందని భావిస్తున్నారు. ఆ పులి పిల్ల కళేబరానికి పంచనామా నిర్వహించి అక్కడే పూడ్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment