సాక్షి,విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడి జైలులో ఉన్న జనుపల్లి శ్రీనివాసరావును చూడటానికి ఎవరూ రాకపోవడంపై పలు అనుమానాలు తలెత్తున్నాయి. నిందితుడ్ని పలకరించడానికి అటు తల్లిదండ్రులుగాని ఇటు తోబుట్టువులు, బంధువులుగానీ రాకపోవడాన్ని చూసి జైలు సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. అతన్ని ఎవరైనా కలిస్తే నిజాలు బయటకొస్తాయనే భయంతో టీడీపీ నేతలే ఎవరినీ అటువైపు కన్నెత్తి చూడకుండా కట్టడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా ఠానేలంక నుంచి విశాఖ వరకు ప్రత్యేక దృష్టిపెట్టిన కొందరు టీడీపీ నేతలు జైలువైపు ఎవరూ వెళ్లకుండా కంచెలా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.
హైఅలర్ట్ బ్లాకులో నిందితుడు
రిమాండ్ ఖైదీగా శ్రీనివాస్‌ను విశాఖ సమీపంలోని ఆరిలోవ సెంట్రల్ జైలులో నక్సలైట్లను ఉంచే చిత్రావతి (హై అలర్ట్) బ్లాకులో ఒంటరిగా ఉంచారు. నిందితుడిని సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నలుగురు హెడ్‌వార్డర్లు నిరంతరాయంగా కాపలా ఉంటున్నారు. సాధారణంగా రిమాండు ఖైదీని వారానికి రెండుసార్లు కలిసేందుకు అవకాశం ఉంటుంది. కానీ, శ్రీనివాసరావును కలిసేందుకు ఇప్పటివరకూ ఎవరూ రాకపోవడంపై జైలు సిబ్బంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎంత కరడుగట్టిన నేరస్తుడినైనా చూసేందుకు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వస్తారని.. కానీ, ఇతని విషయంలో ఎవరూ రావడంలేదని వారు చెబుతున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో విచారణలో భాగంగా తల్లిదండ్రులు శ్రీనివాసరావుతో మాట్లాడారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ ఎవరూ నిందితుడి వైపు కన్నెత్తి చూడలేదు.
ఠానేలంకలో టీడీపీ నేతలు,పోలీసుల హుకుం
శ్రీనివాసరావు స్వగ్రామమైన ఠానేలంకలో వీరిపై టీడీపీ నేతలు డేగకన్ను వేయడంవల్లే ఎవరూ బయటకు రావడానికి సాహసించడంలేదని సమాచారం. అలాగే, శ్రీనివాసరావు రక్తసంబం«ధీకులు ఎవరూ బయటకు వెళ్లవద్దని, కొత్తవారితో మాట్లాడవద్దని హుకుం జారీచేసినట్లు తెలిసింది. ఇదేరీతిలో పోలీసుల నుంచి కూడా హెచ్చరికలు జారీ చేయించినట్లు తెలుస్తోంది. అందువల్లే శ్రీనివాసరావుతో మాట్లాడేందుకు ఎవరు రావడంలేదని సమాచారం. ఎవరైనా మాట్లాడితే కుట్ర కోణం ఎక్కడ బయటకు పొక్కుతుందో అనే అనుమానాం ప్రభుత్వ పెద్దల్లో ఉందని, అందువల్లే అన్ని రకాలుగా కట్టడి చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment