కొందరు అక్రమార్కులు వందేళ్ల చరిత్ర ఉన్న కలపను నిమిషాల్లో నేల కూలుస్తున్నారు. సామిల్ ముసుగులో అక్రమ వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు.
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ :
కొందరు అక్రమార్కులు వందేళ్ల చరిత్ర ఉన్న కలపను నిమిషాల్లో నేల కూలుస్తున్నారు. సామిల్ ముసుగులో అక్రమ వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. బుధవారం రాత్రి అటవీ శాఖ అధికారు ల దాడులతో అక్రమార్కుల బండారం బయటపడిం ది. జిల్లా కేంద్రంలోని దుబ్బ రోడ్డులో గల గ్యాస్ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన దుంగలను చూసిన అధికారులకు దిమ్మతిరిగినంత పనైంది. ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఒ వేణుబాబు శనివారం ‘న్యూస్‌లైన్’ తో మాట్లాడారు. పట్టుబడ్డ టేకు దుంగలు 10.46 క్యూబిక్ మీటర్లు ఉన్నాయని, వాటి విలువ రూ 3 లక్షల కుపైగా ఉంటుందని పేర్కొన్నారు. దుంగలను వాహనంలో నింపుతున్న నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిం చగా ఆసక్తికర విషయాలు తెలిశాయన్నారు. వీటిని కంఠేశ్వర్ నుంచి అర్సపల్లి వెళ్లే బైపాస్ రెడ్డులో గల శివశక్తి సామిల్‌కు తరలిస్తున్నట్లు వారు తెలిపారన్నారు. పట్టుబడ్డ నలుగురిపై అటవీచట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు వేణుబాబు తెలిపారు. 30 ఏళ్లలో ఇదే అతిపెద్ద కలప రాకెట్ అని, నిందితులను ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు.
రాజకీయ, ఇంటిదొంగల అండదండలతో..
శివశక్తి సామిల్ యజమానుల్లో ఒకరైన ముత్యంరెడ్డి అధికార పార్టీ నాయకుల అండదండలతో చాలా ఏళ్లుగా ఈ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పక్క జిల్లాల నుంచి అక్రమంగా కలప తీసుకు వచ్చి నగరంలో విక్రయిస్తుంటాడని సమాచారం. ప్రస్తుతం పట్టుబడ్డ కలపను చత్తీస్‌గడ్ నుంచి తెచ్చినట్లు అధికారుల విచారణలో తేలింది. ఫ్లయింగ్ స్క్వాడ్ విభాగంలోని క్షేత్రస్థాయి సిబ్బంది ఒకరు కలప స్మగ్లర్లకు కొరియర్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి దాడుల గురించి అతడు ముందే సమాచారం అందించడంతో స్మగ్లర్లు 30 టేకు దుంగలను వేరే స్థావరానికి తరలించినట్లు తెలుస్తోంది. మిగిలిన 50 దుంగలను వాహనంలో నింపుతుండగా అధికారులు పట్టుకున్నారు.