చిలమత్తూరు, న్యూస్‌లైన్ : చిలమత్తూరు మండలం పలగలపల్లి పంచాయతీ పరిధిలోని బండ్లపల్లి గ్రామంలో టైం బాంబు కలకలం రేపింది. ఆరుబయట భార్యతో కలిసి నిద్రిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త వెంకటశివప్పను హతమార్చేందుకు అతని ఇంటి ముందు ప్రత్యర్థులు మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బాంబు పేలేలా టైం సెట్ చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కరెంటు రావడంతో వ్యవసాయబోరు మోటరును ఆన్ చేసేందుకు భార్య,భర్తలు లేవడంతో పాలిథిన్ కవర్‌లో ఉంచిన బాంబును గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఐదు నిమిషాలు ముందుగానే అంటే 2:55 గంటలకు బాంబును నిర్వీర్యం చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ .. వైఎస్సార్‌సీపీ కార్యకర్త వెంకటశివప్ప ఇంటి వద్ద టైం బాంబు అమర్చిన స్థలాన్ని హిందూపురం రూరల్ సీఐ శివనారాయణస్వామి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఊర్లో ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ఆరా తీయగా.. తనకెవరూ వ్యక్తిగతంగా శత్రువులు లేరని బాధితుడు తెలిపారు. తాను వైఎస్సార్‌సీపీలో చురుగ్గా పాల్గొంటున్నానన్న కారణంగానే ప్రత్యర్థులు ఈ పనికి ఒడిగట్టి ఉంటారని చెప్పారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం సంఘటన స్థలాన్ని డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ చేయించారు. త్వరలోనే నిందితులను గుర్తిస్తామని సీఐ చెప్పారు.
టైం బాంబు కలకలం
Published Wed, May 28 2014 1:16 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement