సాక్షి, తిరుమల : తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయ గోపురాలకు మహర్దశ రానుంది. ఏడు శతాబ్దాలకు ముందు నిర్మించిన రాజ గోపురాలు ఇకపై స్వర్ణకాంతులతో దర్శనమివ్వనున్నాయి. శిలాశాసనాలు, చారిత్రక ఆధారాల ప్రకారం మహద్వార గోపురం 13వ శతాబ్దంలో నిర్మించారు. మహద్వారానికి రెండువైపులా బలిష్టమైన శిలల ‘చౌకట్టు’పై ఐదంతస్తుల్లో, నేలమట్టం నుంచి యాభై అడుగుల ఎత్తుతో దశలవారీగా నిర్మించారు. ఇక మూడంతస్తుల్లో వెండివాకిలిపై నిర్మించిన గోపురం 12వ శతాబ్దంలో ప్రారంభించి 13వ శతాబ్దంలో పూర్తి చేశారు. ఏడు శతాబ్దాలుగా కేవలం వెల్ల(తెల్లసున్నం)తో మాత్రమే కనిపించిన తిరుమల ఆలయ గోపురాలు ఇకపై స్వర్ణకాంతుల్లో దర్శనమివ్వనున్నాయి. సంప్రదాయ ఆలయ శిల్పకళారీతిలో మహద్వార గోపురానికి రంగులు అద్దనున్నారు. ఇందులో బంగారు వర్ణం, గ్రానైట్ శిల్పం రంగుతోపాటు ఇతర సంప్రదాయ రంగులు మాత్రమే వినియోగించనున్నారు.
గోపురాలపై ఉన్న వివిధ దేవతా మూర్తులను జీవం ఉట్టిపడేలా రకరకాల రంగులతో తీర్చిదిద్దనున్నారు. మొదట ఐదంతస్తులతో నిర్మించిన మహద్వార గోపురానికి రంగులు అద్ది పరిశీలించనున్నారు. ఆ తర్వాత మూడంతస్తుల వెండివాకిలి గోపురానికి రంగులు వేయనున్నారు. ఈ పనులు నేడో రేపో ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఆరుగంటల్లోనే శ్రీవారి దర్శనం
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆరుగంటల్లోనే శ్రీవారి దర్శనం లభిస్తోంది. వేకువజాము నుంచి సాయంత్రం 6 గంటల వరకు 20,252 మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్న భక్తులకు 6 గంటల్లో, నాలుగు కంపార్ట్‌మెంట్లలో ఉన్న కాలినడక భక్తులకు రెండు గంటల్లో స్వామి దర్శనం లభించింది. భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో రాత్రి వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగించారు. వీరికి గంటలోనే స్వామి దర్శనం లభించింది. భక్తులు తలనీలాలు సమర్పించటానికి, గదులు తీసుకోవటానికి కేవలం గంట సమయం మాత్రమే పట్టింది. కాగా, మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.35 కోట్లు లభించింది.