
తిరుమలలో భక్తుల ఆందోళన
రోడ్డుపై బైఠాయించి ధర్నా
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చిన భక్తులు శుక్రవారం తిరుమలలో ఆందోళనకు పూనుకున్నారు. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో ఉదయం 7 గంటలకు తమ లగేజీ డిపాజిట్ చేసినా సాయంత్రం వరకు తిరుమలకు చేరలేదని ఆరోపిస్తూ భక్తులు ఇక్కడి జీఎన్‌సీ టోల్‌గేట్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని భక్తులను పక్కకు లాగేశారు.
దీంతో భక్తులకు, భద్రతా సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. తమ లగేజీ ఇవ్వకపోగా భద్రతా సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని భక్తులు ఆరోపించారు. భక్తుల ఆందోళనతో అరగంటపాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది.