తిరుమలలో నరకం చూసిన భక్తులు
సాక్షి, తిరుమల: వేంకటేశుని దర్శనం కోసం వచ్చిన భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ మరోసారి ఘోరంగా విఫలమైంది. అసలే సంక్రాంతి సెలవులు. ఆపై శని, ఆదివారాల్లో ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు. ఈ సందర్భంగా భక్తులు పోటెత్తుతారని తెలిసి కూడా టికెట్లు మొదలుకుని బస దాకా ఏ ఏర్పాట్లూ సజావుగా చేయలేక పూర్తిగా చేతులెత్తేసింది. షరామామూలుగా వీఐపీల సేవలో తరించి సామాన్యులను గాలికొదిలింది. దాంతో భక్తులు శుక్రవారం అక్షరాలా నరకం చవిచూశారు. గోవింద నామస్మరణతో మారు మోగాల్సిన తిరుమల కొండలు రోజంతా వారి ఆర్తనాదాలు, నినాదాలు, ధర్నాలతో హోరెత్తిపోయాయి. సీఆర్‌వో కార్యాలయం వద్ద వందలాది మంది గదుల కోసం ఆందోళన చేశారు. గదులన్నిటినీ వీఐపీలకే కేటాయిస్తున్నారంటూ టీటీడీపై దుమ్మెత్తి పోశారు. వీఐపీ పాసుల పేరుతో దర్శనాల వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రి పార్థసారథిని అడ్డుకుని నిరసన తెలిపారు. టీటీడీతో పాటు విజిలెన్స్, పోలీసు తదితర విభాగాలన్నీ విధి నిర్వహణలో విఫలమయ్యాయి.
సర్వం అస్తవ్యస్తం: వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులకు టీటీడీ నరకం చూపించింది. కాలిబాట భక్తులు టికెట్ల కోసం పడరాని పాట్లు పడ్డారు. ఏకాదశి, ద్వాదశి దర్శనం కోసం అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో 40 వేల మందికే దివ్యదర్శనం టికెట్లు కేటాయించారు. ఇందులో ఏకాదశికి 20 వేలు, ద్వాదశికి 20 వేలు కేటాయించారు. ఉదయం 10 గంటలకే అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో టికెట్ల మంజూరు ఆరంభించారు. అంతకుముందు నుంచే రెండుచోట్లా తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది.
కాలిబాట దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎలాగైనా టికెట్లు పొందేందుకు భక్తులు ప్రధాన రహదారులను వదిలి అడవుల్లోని ముళ్ల పొదల గుండా క్యూలైన్ల వద్దకు చేరుకున్నారు. కొందరు కాలిబాట పైకప్పుల మీదుగా నడిచివచ్చి, మరికొందరు చెట్లెక్కి లైన్లలోకి చొరబడటంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. భద్రతా సిబ్బంది చేతులెత్తేశారు. పైగా ఏకాదశి టికెట్లు మధ్యాహ్నం 2, ద్వాదశి టికెట్లు 4 గంటల్లోపే అయిపోవడంతో సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. క్యూ లైన్లను, గేట్లను విరిచేశారు. ఆ తర్వాత వచ్చిన భక్తులు తిరుమలకు చేరుకుని అడుగడుగునా ఆందోళనలు, బైఠాయింపులతో నిరసన వ్యక్తం చేశారు.
100 ఎంపీలు,ఎమ్మెల్యేలు.. జడ్జిలు
వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం కోసం వీఐపీలు వందలాదిగా తిరుమలకు క్యూ కట్టారు. వారికి టీటీడీ ఎర్రతివాచీ పరచింది. బస, దర్శనాల్లో ఎక్కడా లోటు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికే పార్థసారథి, పొన్నాల లక్ష్మయ్య, ఏరాసు ప్రతాపరెడ్డి, డీకే అరుణ సహా పది మంది మంత్రులు, 100 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సుప్రీంకోర్టు, దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల న్యాయమూర్తులు, 200 మంది దాకా కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, సినీ నటులు దర్శనం చేసుకున్నారు. వీఐపీల కోసం టీటీడీ ఏకంగా 10 వేలకు పైగా పాసులను, 6,000 పైచిలుకు గదులను ముందుగానే బ్లాక్ చేసి పెట్టింది.