సాక్షి, తిరుమల : భక్తులతో శుక్రవారం తిరుమల కిటకిటలాడింది. వేకువజామున 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 32,326 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయూయి. వీరి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరగడంతో సాయంత్రం 5 గంటలకు రూ. 300 టికెట్ల దర్శనాన్ని నిలిపివేశారు. కాలిబాట భక్తులకు ఏడు గంటల సమయం పడుతోంది. కాగా, బ్లాక్ డే సందర్భంగా శుక్రవారం తిరుమలలో తనిఖీలు ముమ్మరంగా జరిగాయి.
వైభోగం.. అమ్మవారి రథోత్సవం
తిరుచానూరు, న్యూస్‌లైన్: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేకువజామున 4.15గం.కు అమ్మవారిని రథంపై కొలువుదీర్చి దివ్యమంగళ స్వరూపిణిగా అలంకరిం చారు. అమ్మవారు ప్రసన్నమూర్తిగా కొలువుదీరి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. రాత్రి అశ్వవాహనంపై పురవీధు ల్లో అమ్మవారు విహరించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన చివరి ఘట్టం పంచమీతీర్థం (చక్రస్నానం) శనివారం మధ్యాహ్నం 12.10గం.కు అత్యంత వేడుకగా జరగనుంది. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.