
తిరుమల: సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి రథసప్తమి మహోత్సవం వైభవంగా జరిగింది. ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన రథసప్తమిలో సప్తవాహనాలపై ఊరేగుతూ మలయప్ప దివ్యమంగళ రూపంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 5.30 నుంచి రాత్రి 10 గంటల వరకు ఏడు వాహన సేవలు అంగరంగ వైభవంగా సాగాయి.
సప్తవాహనాలపై సర్వాంతర్యామి వైభోగం
మాఘమాసం శుద్ధ సప్తమి రోజు సూర్యజయంతి పర్వదినం పురస్కరించుకుని తిరుమలలో ప్రతిఏటా రథసప్తమి ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా మంగళవారం వేకువజామున ఆలయంలో సుప్రభాతం, అభిషేకం, ఇతర వైదిక సేవలు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ఆలయం నుంచి మలయప్పను వాహన మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. మంగళ ధ్వనులు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉదయం 5.30 గంటలకు సూర్య ప్రభ వాహనం ప్రారంభించి ఉదయం 7.50 గంటలకు పూర్తిచేశారు.
తర్వాత వరుసగా చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలపై ఊరేగారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.15 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోకంగా నిర్వహించారు. తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కల్పవృక్ష , సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. కాగా, శ్రీవారి రథ సప్తమి వాహన సేవలు అంగరంగ వైభవంగా సాగాయని, రెండు లక్షల మందికి పైగా భక్తులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment