rathasaptami
-
సప్త వాహనాలపై శ్రీనివాసుని వైభవం
తిరుమల: రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో సప్త వాహనాలపై కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. లక్షా 50 వేల మందికి పైగా తరలివచ్చిన భక్తజనులు..వాహన సేవలను దర్శించుకుని పునీతులయ్యారు. రథసప్తమి పర్వదినం..ఒకరోజు బ్రహ్మోత్సవాలను తలపించింది. సూర్యోదయాన సూర్య ప్రభ వాహనంతో ప్రారంభమైన సప్త వాహన సేవోత్సవం..రాత్రి చంద్రప్రభ వాహనంతో పరిసమాప్తమైంది. శ్రీమలయప్పస్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీసుదర్శన చక్రత్తాళ్వారులకు అభ్యంగనం ఆచరించారు. చక్రస్నానాన్ని శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు నిర్వహించారు. వాహన సేవల ముందు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. చిన్న శేష వాహనంలో అపశ్రుతి రథసప్తమి వేడుకల్లో శ్రీవారి గొడుగు గాలికి ఒరిగింది. సూర్యప్రభ వాహనం అనంతరం చిన్నశేష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు. ఈ ఊరేగింపు సమయంలో వాహనంపై స్వామివారికి ఇరువైపులా ఛత్రాలు ఉంచుతారు. అర్చకులు వీటిని పట్టుకొని వస్తారు. వాహనం ముందుకు కదులుతుండగా..ఒక్కసారిగా వాహనం ఎక్కువగా అదిరిపోవడంతో గొడుగు కిందకు వాలిపోయింది.వాహన సేవల్లో న్యాయమూర్తులు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్పతి రాజేంద్రన్ శ్రీరామ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ శ్రీవారి దర్శనం అనంతరం మాడ వీధుల్లో నిర్వహించిన వాహన సేవల్లో పాల్గొన్నారు. -
రథసప్తమి వేడుకలకు ముస్తాబైన అరసవల్లి ఆలయం
-
రథయాత్రలో కరెంట్ షాక్: ఇద్దరు దుర్మరణం
దామరగిద్ద (నారాయణపేట): రథసప్తమి ఉమ్మడి పాలమూరు జిల్లాలో విషాదం నింపింది. రథయాత్రలో విద్యుదాఘాతం సంభవించి ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రథసప్తమి సందర్భంగా గ్రామ శివారులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం రథాన్ని ఊరేగిస్తుండగా విద్యుదాఘాతం సంభవించింది. జాతర కోసం నూతనంగా తయారు చేయించిన ఇనుప రథాన్ని తరలిస్తుండగా పైనున్న విద్యుత్ తీగలు తగలి చంద్రప్ప, హనుమంతు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని వెంటనే నారాయణపేటలోని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఉత్సాహంగా సాగుతున్న రథయాత్రలో ఒక్కసారిగా అల్లకల్లోలం ఏర్పడింది. భక్తులందరూ భయాందోళన చెందారు. అయితే ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. -
లభించని ఆచూకీ..
శ్రీకాకుళం, వజ్రపుకొత్తూరు: మండలంలోని కంబారాయుడుపేట సముద్ర తీరంలో రథసప్తమి పుణ్య స్నానాలకు వెల్లి గళ్లంతైన యువకుడు చిన్న కిషోర్(17) ఆచూకి నేటి వరకు లభించలేదు. మంగళవారం ఉదయం జరిగిన ఘటనలో తీరం వెంబడి కుటుంబ సభ్యులు, యువకులు, మెరైన్ పోలీసులు గాలిస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. దీంతో బాధిత కుటుంబంలో విషాదచాయలు అలముకున్నాయి. బుధవారం ఉదయం అబుదాబి(దుబాయ్) నుంచి ఇంటికి చేరుకున్న కిషోర్ తండ్రి నరిసింహమూర్తి భోరున విలపించారు. ఇదిలా ఉండగా గ్రామంలోని యువకులు, కుటుంబ సభ్యులు భావనపాడు నుంచి బారువ వరకు సముద్ర తీరంలో రేయింబవళ్లు టార్చ్‌లైట్ వెలుగుల్లో వెతుకుతూనే ఉన్నారు. మరోవైపు తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో మెరైన్ పోలీసులు అక్కడి వారిని అప్రమత్తం చేశారు. భావనపాడు తీరంలో ఎటువంటి మెకనైజ్డ్ బోట్ లేకపోవడం, సిబ్బంది కొరత వేధించడం, ఈతగాళ్లను ఏర్పాటు చేయక పోవడంతో చాలామంది ఆచూకి లభించకపోవడం నిరాశ కలిగిస్తోంది. యంత్రాంగం పూర్తిస్థాయి దృష్టిసారిస్తే.. యువకుడి ఆచూకీ లభించేందుకు అవకాశాలు ఉన్నాయని స్థానిక మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
సప్త వాహనాలపై సప్తగిరీశుడు
తిరుమల: సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి రథసప్తమి మహోత్సవం వైభవంగా జరిగింది. ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన రథసప్తమిలో సప్తవాహనాలపై ఊరేగుతూ మలయప్ప దివ్యమంగళ రూపంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 5.30 నుంచి రాత్రి 10 గంటల వరకు ఏడు వాహన సేవలు అంగరంగ వైభవంగా సాగాయి. సప్తవాహనాలపై సర్వాంతర్యామి వైభోగం మాఘమాసం శుద్ధ సప్తమి రోజు సూర్యజయంతి పర్వదినం పురస్కరించుకుని తిరుమలలో ప్రతిఏటా రథసప్తమి ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా మంగళవారం వేకువజామున ఆలయంలో సుప్రభాతం, అభిషేకం, ఇతర వైదిక సేవలు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ఆలయం నుంచి మలయప్పను వాహన మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. మంగళ ధ్వనులు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉదయం 5.30 గంటలకు సూర్య ప్రభ వాహనం ప్రారంభించి ఉదయం 7.50 గంటలకు పూర్తిచేశారు. తర్వాత వరుసగా చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలపై ఊరేగారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.15 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోకంగా నిర్వహించారు. తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కల్పవృక్ష , సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. కాగా, శ్రీవారి రథ సప్తమి వాహన సేవలు అంగరంగ వైభవంగా సాగాయని, రెండు లక్షల మందికి పైగా భక్తులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. -
ఇది తగునా!
అరసవల్లి: ప్రతిష్ఠాత్మకమైన రథ సప్తమి వేడుకల్లో కొంతమంది పోలీసులు వీవీఐపీల అవతారమెత్తారు. దాతలను అనుమతించే ప్రత్యేక మార్గంలో కొందరు సిఫారసులతోనూ మరికొందరు నేరుగానే ఆలయంలోకి వెళ్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. వీరిని గమనించి అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఈవో శ్యామలాదేవితో వాగ్వాదానికి దిగారు. అంతేగాక పాసులు ఇచ్చిన దాతలకు కూడా సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. మేం పోలీసులం.. వెళ్లనివ్వండి బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆలయ ప్రధాన ఆలయ ద్వారం వద్ద వీవీఐపీ, దాతల పాసుల ప్రత్యేక దర్శన మార్గంలో వందలాది మంది భక్తులు వస్తూనే ఉన్నారు. దీంతో అంతరాలయంలో భక్తుల రద్దీ పెరిగి గందరగోళంగా మారింది. అనివెట్టి మండపం వరకు వీవీఐపీల లైను నిలిచిపోయింది. ఎంతకీ తరగకపోవడంతో ఈవో శ్యామలాదేవి ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి వీవీఐపీ మార్గంలో వస్తున్న వారందరూ పోలీసులæ కుటుంబాలు, అధికారుల కుటుంబాల సభ్యులేæ. మరికొందరు సిఫారసు లెటర్లతో ఆలయంలోకి వచ్చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఈవో.. మారు మాట లేకుండా వెనక్కి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ‘మేము పోలీసులం..’ అంటూ ఒక అధికారి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ‘వెళ్తారా..మీ ఎస్పీకి ఫోన్ చెయ్యాలా!’ అంటూ ఈవో మండిపడ్డారు. ‘మాకో నీతి.. మీకో నీతా! ఇంత జరుగుతున్నా పట్టించుకోరా? అంటూ అక్కడున్న డీఎస్పీ సుబ్రమణ్యంను ఈవో ప్రశ్నించారు. వీవీఐపీ మార్గాల్లో కేవలం దాతలే వచ్చేలా చేసేందుకు ఈవో అక్కడే కుర్చీలో కూర్చుండిపోయారు. ఈవోతో తహసీల్దార్ వాగ్వాదం స్థానిక తహసీల్దార్ మురళి ప్రోటోకాల్‌లో భాగంగా కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ కుటుంబాన్ని వీవీఐపీ మార్గంలో అనుమతించాలని ఈవో శ్యామలాదేవిని కోరారు. దీనిని ఆమె తిరస్కరించారు. ఎవ్వరైనా వదలబోమని, వేరే మార్గాల్లో వెళ్లాలని సూచించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి చల్లారకపోవడంతో.. ఈవో శ్యామలాదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. ఉత్సవాన్ని మీరే నడిపించుకోండని, అక్కడి నుంచి వెనుదిరిగారు. వెంటనే పలువురు పోలీసు అధికారులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఈవో వెళ్లేందుకు నిర్ణయించుకుని ఆ అధికారికి ‘నమస్కారం’ పెట్టి ‘మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండం’టూ వెళ్లిపోయారు. ఈవో వెళ్లిపోయినప్పటికీ.. పోలీసుల కుటుంబాలు మాత్రం తమ తీరు కొనసాగించాయి. పలు ప్రభుత్వ శాఖలు తమ డఫేదారులను అస్త్రాలుగా వాడుకుని యథేచ్ఛగా అడ్డదారిలో అనధికారిక వీవీఐపీల అవతారమెత్తారు. ఈ వివాదంపై కలెక్టర్ ధనంజయరెడ్డి, ఎస్పీ త్రివిక్రమ్‌వర్మకు ఈవో ఫిర్యాదు చేశారు. రూ.500 దర్శనానికీ ఇదే వ్యథ! రూ.500 చెల్లించి టికెటు తీసుకున్న భక్తులకు కూడా చేదు అనుభవమే ఎదురైంది. మంగళవారం అర్ధరాత్రి 12.30 నుంచి బుధవారం ఉదయం 6 గం టల వరకు క్షీరాభిషేక టిక్కెటు తీసుకుని దర్శనం చేసుకునే భక్తులకు అంతరాలయం ముందు లైన్ నుంచి ఆదిత్యున్ని దర్శించుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ టిక్కెటుపై ఇద్దరికి అనుమతి ఉండటంతో పాటు ప్రసాదం కూడా పొందారు. రూ.500 చొప్పున ఒక్కొక్కరు దర్శన టిక్కెటు తీసుకున్న భక్తులకు మాత్రం దూరం నుంచి దర్శనంతో పాటు ఎటువంటి తీర్థప్రసాదాలు ఇవ్వలేదు. దర్శన సమయంలో అక్కడ బందోబస్తు పోలీసుల వైఖరితోనే రూ.500 దర్శన మార్గాలు ఇష్టానుసారంగా మారిపోయాయని, దాతల పాసుదారులకు కూడా దగ్గర దర్శనం కరువైంది. దాతలకు తీవ్ర అవస్థలు ఆలయ అభివృద్ధికి రూ.లక్షకు పైగా విరాళాలిచ్చిన వారి సంబంధించిన కుటుంబాలకు దేవాదాయ శాఖ అధికారులు మొత్తం 328 డోనర్ పాసులను ఇచ్చారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు దాతల పాసుల ద్వారా వెళ్లిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. ఆలయ ముఖద్వారం వరకు రావడానికి 80 ఫీట్ రోడ్డు నుంచి నడిచి రావడంతో పాటు ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత కూడా వీవీఐపీల లైనులో దాతల కంటే అనధికారిక వ్యక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అంతరాలయంలో డోనర్ పాసుల భక్తులకు కనీసం అంతరాలయ దర్శనం కూడా దక్కలేదు. ప్రసాదాలకు కూడా నోచుకోలేదు. దీంతో వీరు నిరాశకు గురయ్యారు. కనీసం దాతల పాసులకు వాహన అనుమతి పాసు కూడా ఇవ్వకపోవడంతో అవస్థలు వర్ణనాతీతం! -
రథసప్తమి రోజు తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు
-
వైభవంగా రథసప్తమి వేడుకలు
మహానంది: మహానంది క్షేత్రంలో రథసప్తమిని పురస్కరించుకొని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, జ్వాలాచక్రవర్తి, తదితరులు విశేష పూజలు నిర్వహించారు. గణపతిపూజ, పుణ్యాహవాచనము, సూర్యయంత్రారాధన, ద్వాదశాదిత్యపూజ, రథాంగపూజ, రథాధిదేవతావాహనము పూజలు నిర్వహించారు. అనంతరం రథమును శివరాత్రిన జరిగే గంగా, కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారి కల్యాణోత్సవ ఉత్సవాలకు బయటకు తీశారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు బాలరాజుయాదవ్, చింతకుంట్ల శివారెడ్డి, చంద్రమౌళీశ్వరరెడ్డి, బండి శ్రీనివాసులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు నిచ్చెనమెట్ల శేషఫణి, గంగిశెట్టి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
ఆదిత్యుని పండగకు తిరుమలలో ఏర్పాట్లు
తిరుమల: రథసప్తమి పర్వదినం సందర్బంగా శుక్రవారం సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు శ్రీవారు తిరుమల తిరువీధుల్లో సప్త వాహనాలలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. వేకువ జామున 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో మహోత్సవం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వరుసగా ప్రతి రెండు గంటలకు ఒకటి చొప్పున చిన్న శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలు జరుగుతాయి. మధ్యాహ్నం 2 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం ఘట్టం నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నందున సౌకర్యాల కల్పనకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. తిరువీధుల వెంట గ్యాలరీలను నిర్మించి అక్కడి నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేసింది. అక్కడక్కడ చలువ పందిళ్లను నిర్మించింది. గ్యాలరీల్లోని భక్తులకు ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంది. వాహన సేవలను వీక్షించడానికి భారీ పరిమాణంలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నది. ఆలయ ఈవో సాంబశివరావు ఆదేశాల మేరకు దేవస్థానం ఉద్యానవనశాఖ కూడళ్లతోపాటు రహదారి డివైడర్లు, వైకుంఠం-1 ఎదుట రంగురంగుల పూల మొక్కలను నాటి అందంగా తీర్చిదిద్దింది. ఏర్పాట్లపై తిరుమల జేఈవో శ్రీనివాసరాజు పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించి మార్పులు చేర్పులు సూచించారు. -
మృత్యు శకటం
యలమంచిలి జాతీయ రహదారిపై ఆదివారం మృత్యు ఘంటికలు మోగాయి. రహదారి నెత్తురోడటంతో రథసప్తమి శోక సప్తమిగా మారిపోయింది. హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని ఒరిస్సా రాష్ట్రానికి అంబులెన్స్‌లో తీసుకెళుతున్న ఓ కుటుంబాన్ని మృత్యువు వెంబడించి పొట్టనపెట్టుకుంది. ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు డ్రైవర్ దుర్మణం పాలయ్యారు. హృదయ విదారకమైన ఈ సంఘటన చూసినవారు నిశ్చేష్టులయ్యారు. యలమంచిలి: ఒరిస్సా రాష్ట్రం బాలేశ్వర్‌కు చెందిన నిరంజన్‌గిరి హైదరాబాద్‌లో మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. అంత్యక్రియలు జరిపించేందుకు మృతదేహాన్ని తీసుకొని కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో స్వస్థలానికి బయలుదేరారు. మార్గమధ్యంలో వీరు ప్రయాణిస్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. యలమంచిలి సమీపంలో ఎర్రవరం కల్వర్టు వద్ద అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోయి బలంగా తాటిచెట్టును ఢీకొట్టింది. అంబులెన్స్‌లో మృతదేహంతో పాటు మృతుని భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె, కోడలు, మనుమడు, మనుమరాళ్లు, ఇద్దరు డ్రైవర్లు మొత్త పది మంది ఉన్నారు. వీరిలో నిరంజన్‌గిరి భార్య పవిత్రాగిరి, కుమారుడు రవికుమార్, కుమార్తె మణితి, ఏడాదిన్నర మనుమడు జాగా, అంబులెన్స్ డ్రైవర్ వెంకటరమణ దుర్మరణ చెందారు. నిరంజన్‌గిరి కోడలు స్వర్ణలత, మరో కుమారుడు సీతారాం, మనుమరాళ్లు మమత, నమత, రెండో డ్రైవర్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఈ కుటుంబాన్ని మృత్యువు వెంబడించి కబళించింది. అభంశుభం తెలియని పసిబాలుడిని కూడా పొట్టన పెట్టుకోవడం చూపరులను కంటతడిపెట్టించింది. రహదారి నెత్తురోడటంతో రథసప్తమి శోక సప్తమిగా మారిపోయింది. హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని ఒరిస్సా రాష్ట్రానికి అంబులెన్స్‌లో తీసుకెళుతున్న ఓ కుటుంబాన్ని మృత్యువు వెంబడించి పొట్టనపెట్టుకుంది. ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు డ్రైవర్ దుర్మణం పాలయ్యారు. హృదయ విదారకమైన ఈ సంఘటన చూసినవారు నిశ్చేష్టులయ్యారు. యలమంచిలి: ఒరిస్సా రాష్ట్రం బాలేశ్వర్‌కు చెందిన నిరంజన్‌గిరి హైదరాబాద్‌లో మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. అంత్యక్రియలు జరిపించేందుకు మృతదేహాన్ని తీసుకొని కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో స్వస్థలానికి బయలుదేరారు. మార్గమధ్యంలో వీరు ప్రయాణిస్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. యలమంచిలి సమీపంలో ఎర్రవరం కల్వర్టు వద్ద అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోయి బలంగా తాటిచెట్టును ఢీకొట్టింది. అంబులెన్స్‌లో మృతదేహంతో పాటు మృతుని భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె, కోడలు, మనుమడు, మనుమరాళ్లు, ఇద్దరు డ్రైవర్లు మొత్త పది మంది ఉన్నారు. వీరిలో నిరంజన్‌గిరి భార్య పవిత్రాగిరి, కుమారుడు రవికుమార్, కుమార్తె మణితి, ఏడాదిన్నర మనుమడు జాగా, అంబులెన్స్ డ్రైవర్ వెంకటరమణ దుర్మరణ చెందారు. నిరంజన్‌గిరి కోడలు స్వర్ణలత, మరో కుమారుడు సీతారాం, మనుమరాళ్లు మమత, నమత, రెండో డ్రైవర్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఈ కుటుంబాన్ని మృత్యువు వెంబడించి కబళించింది. అభంశుభం తెలియని పసిబాలుడిని కూడా పొట్టన పెట్టుకోవడం చూపరులను కంటతడిపెట్టించింది. -
‘రథం’పై రామయ్య
భక్తులతో కిటకిటలాడిన భద్రాద్రి నిత్య కల్యాణంలో 125 జంటలు భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆలయ అర్చకులు రథసప్తమి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రథసప్తమిని పురస్కరించుకొని సోమవారం తెల్లవారుజామున అంతరాలయంలో మూలవరులు, ఉత్సవమూర్తులకు ఏకాంత అభిషేకం జరిపారు. స్వామివారికి నూతన పట్టు వస్త్రాలతో అర్చకులు అలంకరించా రు. సాయంత్రం సూర్యప్రభ వాహనంపై స్వామివారిని కొలువు తీర్చారు. మేలతాళాలు, వేద మంత్రాలు, భక్తుల కోలాటాల నడుమ తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు. వెండిరథోత్సవం, ఆలయ చుట్టు సేవలు నిర్వహించి ప్రత్యేక పూజ లు చేశారు. రథసప్తమి, వారంతపు సెలవులకు తోడు రిపబ్లిక్ డే సెలవు కూడా కలిసిరావడంతో భద్రాచలంలో సోమవారం భక్తుల తాకిడి పెరిగిం ది. రాష్ట్ర, ఏపీ నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించా రు. క్యూలైన్లలో స్వామివారిని దర్శించుకున్నారు. బేడామండపంలో స్వామివారికి నిర్వహించిన నిత్యకల్యాణంలో 125జంటలు పాల్గొన్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో నిత్యకల్యాణాన్ని కమనీయం గా జరిపారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తు లు పెద్దసంఖ్యలో రావడంతో లడ్డూ కౌంటర్ల వద్ద భక్తుల సందడి నెలకొంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. -
జన్మకిది చాలు
వేడుకగా రథ సప్తమి మహోత్సవం ఏడు వాహనాలపై ఊరేగిన మలయప్ప సుమారు రెండు లక్షల మందికిపైగా హాజరు 16 గంటల్లో ఏడు వాహనాలఊరేగింపు వీఐపీలు, కూడలి ప్రాంతాల్లో తోపులాట అశేష భక్త జనం మధ్య చక్రస్నానం రథసప్తమి సందర్భంగా ఏడు వాహనాలపై ఊరేగిన శ్రీహరిని చూసేందుకు రెండు కళ్లూ చాల్లేదు. దివ్య తేజోమూర్తిని ద ర్శించుకున్న భక్తులు ఈ జన్మకిది చాలంటూ ఆనంద పరవశులయ్యూరు. శ్రీవారి పుష్కరిణి జన సంద్రంగా మారింది. భక్త జనకోటి హరినామ స్మరణతో సప్తగిరులూ పులకించారుు. మలయప్ప వాహన సేవలతో తిరుమల వైకుంఠాన్ని తలపించింది. తిరుమల: ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన శ్రీవారి రథసప్తమి మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా సాగింది. పదహారు గంటల్లో మొత్తం ఏడు వాహనాలపై మలయప్ప తిరు వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. సూర్య, చంద్రప్రభ, గరుడ, హనుమంత, చిన్న శేషవాహనాల్లో మలయప్ప మాత్రమే ఊరేగారు. కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవల్లో శ్రీదేవి, భూదేవి సమేతంగా దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభం.. ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైన సూర్యప్రభ వాహన సేవ 40 నిమిషాల్లోపే ఉత్తర మాడవీధి ప్రారంభానికి చేరుకుంది. గంటా ఇరవై నిమిషాల పాటు స్వామివారు సూర్యప్రభ వాహన సేవపై నిరీక్షించిన సూర్య కిరణాలు స్వామివారి పాదాలు తాకారుు. దివ్య తేజోమూర్తి మంగళ రూపాన్ని తొలి కిరణాల్లో దర్శించుకుని భక్తకోటి ఆనంద పరవశులైంది. ఉదయం 7:45 గంటలకు సూర్యప్రభ వాహనం ముగిసింది. ఉదయం తొమ్మిది గంటలకు చిన్న శేషవాహనం ప్రారంభించారు. మార్గంమధ్యలో సర్కారు హారతులు మాత్రమే అనుమతించి కేవలం 50 నిమిషాల్లోనే ముగించారు. తర్వాత 11 గంటలకు ప్రారంభమైన గరుడ వాహన సేవ కోలాహాలంగా సాగింది. వాహన సేవను 50 నిమిషాల్లోనే ముగించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన హనుమంత వాహనం 1:50 ముగిసింది. మధ్యాహ్నం 2:10 గంటలకు సుదర్శన చక్రతాళ్వారు శ్రీవారి సన్నిధి నుంచి ఊరేగింపుగా వరాహ స్వామి వారి సన్నిధికి చేరుకున్నారు. పుష్కరిణి గట్టుపై వైదికంగా స్నపన తిరుమంజనం ( అభిషేకం) కార్యక్రమాలు పూర్తి చేశారు. అశేష భక్తుల మధ్య శాస్త్రోక్తంగా స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ ఈవో సాంబశివరావు, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు దంపతులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు కల్పవృక్ష వాహనంపై శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా పుర వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. ఆరు గంటలకు సర్వభూపాల వాహనంపై ఊరేగారు. చివరగా రాత్రి ఎనిమిది గంటలకు చంద్ర ప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. రథసప్తమి సందర్భంగా ఆలయంతోపాటు ఆలయం వెలుపల పూల అలంకరణలు, విద్యుత్ దీపకాంతులు భక్తులను ఆకట్టుకున్నాయి. పోటెత్తిన భక్తజనం.. రథసప్తమికి భక్తులు పోటెత్తారు. సూర్యప్రభ, గరుడ వాహనం, కల్పవృక్ష వాహనం, చంద్రప్రభ వాహన సేవల్లో స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైన సూర్యప్రభ వాహన సేవకు ముందుగానే భక్తులు ఎక్కువ సంఖ్యలో ఆలయ ప్రాంతానికి చేరుకున్నారు. అన్ని గ్యాలరీలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర మాడవీధి నుంచి తూర్పు మాడ వీధి వరకు భక్తుల మధ్య తోపులాట జరిగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తతో వ్యహరించి క్రమబద్ధీరించారు. శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించిన చక్రస్నానం సందర్భంగా వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. వాహన సేవల్లో మొత్తం రెండు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నట్టు ఈవో, జేఈవో ప్రకటించారు. వాహన సేవల ముందు వీఐపీలు, ఇతర భక్తులు వేచి ఉండకుండా నియంత్రించేందుకు వేద విజ్ఞానపీఠం విద్యార్థులతో ప్రత్యేకంగా వైదిక హారాన్ని ఏర్పాటు చేశారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కళా బృందాలు రథసప్తమి సందర్భంగా నిర్వహించిన సంగీత , సాంస్కృతిక కళా బృందాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కర్ణాటక ఉడిపి డప్పు వాయిద్య కళాకారుల విన్యాసం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. కోలాటాలు, చెక్క భజనలు, వివిధ దేవతామూర్తులు వేషధారణలు చూసి భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఆలయ నాలుగు మాడ వీధులు, దర్శనం కోసం వేచి ఉన్న క్యూలైన్లలో మొత్తం లక్షన్నర మందికి పైగా ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. అధికారుల సమన్వయం . . టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు స్వీయ పర్యవేక్షణలో అన్ని విభాగాల అధికారులు రథసప్తమి వేడుకలో సమష్టిగా పనిచేశారు. ఆలయ పేష్కార్ సెల్వం, ఏఈవో శివారెడ్డి, ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి, బొక్కసం ఇన్చార్జి గురురాజాతో కలసి వాహన సేవలను ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇన్చార్జి సీవీఎస్వో శ్రీనివాస్, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, తిరుమల ఏఎస్పీ ఎంవీఎస్ స్వామి, డీఎస్పీలు నరసింహారెడ్డి, రవిమనోహరాచారితో కలసి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఆలయానికి విద్యుత్ కాంతులు రథసప్తమి పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. డీఈ రవిశంకర్‌రెడ్డి పర్యవేక్షించారు. గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మహాద్వారం నుంచి గర్భాలయం వరకు పుష్పాలతో అలంకరించారు. ఫెక్సీలు, పుష్పాలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఆలయానికి ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.