
దామరగిద్ద (నారాయణపేట): రథసప్తమి ఉమ్మడి పాలమూరు జిల్లాలో విషాదం నింపింది. రథయాత్రలో విద్యుదాఘాతం సంభవించి ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రథసప్తమి సందర్భంగా గ్రామ శివారులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం రథాన్ని ఊరేగిస్తుండగా విద్యుదాఘాతం సంభవించింది.
జాతర కోసం నూతనంగా తయారు చేయించిన ఇనుప రథాన్ని తరలిస్తుండగా పైనున్న విద్యుత్ తీగలు తగలి చంద్రప్ప, హనుమంతు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని వెంటనే నారాయణపేటలోని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఉత్సాహంగా సాగుతున్న రథయాత్రలో ఒక్కసారిగా అల్లకల్లోలం ఏర్పడింది. భక్తులందరూ భయాందోళన చెందారు. అయితే ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.