ఇది తగునా! | police department and eo fight in arasavalli temple | Sakshi
Sakshi News home page

ఇది తగునా!

Published Thu, Jan 25 2018 12:38 PM | Last Updated on Tue, Aug 21 2018 6:02 PM

police department and eo fight in arasavalli temple - Sakshi

అరసవల్లి: ప్రతిష్ఠాత్మకమైన రథ సప్తమి వేడుకల్లో కొంతమంది పోలీసులు వీవీఐపీల అవతారమెత్తారు. దాతలను అనుమతించే ప్రత్యేక మార్గంలో కొందరు సిఫారసులతోనూ మరికొందరు నేరుగానే ఆలయంలోకి వెళ్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. వీరిని గమనించి అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఈవో శ్యామలాదేవితో వాగ్వాదానికి దిగారు. అంతేగాక పాసులు ఇచ్చిన దాతలకు కూడా సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.

మేం పోలీసులం.. వెళ్లనివ్వండి
బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆలయ ప్రధాన ఆలయ ద్వారం వద్ద వీవీఐపీ, దాతల పాసుల ప్రత్యేక దర్శన మార్గంలో వందలాది మంది భక్తులు వస్తూనే ఉన్నారు. దీంతో అంతరాలయంలో భక్తుల రద్దీ పెరిగి గందరగోళంగా మారింది. అనివెట్టి మండపం వరకు వీవీఐపీల లైను నిలిచిపోయింది. ఎంతకీ తరగకపోవడంతో ఈవో శ్యామలాదేవి ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి వీవీఐపీ మార్గంలో వస్తున్న వారందరూ పోలీసులæ కుటుంబాలు, అధికారుల కుటుంబాల సభ్యులేæ. మరికొందరు సిఫారసు లెటర్లతో ఆలయంలోకి వచ్చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఈవో.. మారు మాట లేకుండా వెనక్కి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ‘మేము పోలీసులం..’ అంటూ ఒక అధికారి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ‘వెళ్తారా..మీ ఎస్పీకి ఫోన్‌ చెయ్యాలా!’ అంటూ ఈవో మండిపడ్డారు. ‘మాకో నీతి.. మీకో నీతా! ఇంత జరుగుతున్నా పట్టించుకోరా? అంటూ అక్కడున్న డీఎస్పీ సుబ్రమణ్యంను ఈవో ప్రశ్నించారు. వీవీఐపీ మార్గాల్లో కేవలం దాతలే వచ్చేలా చేసేందుకు ఈవో అక్కడే కుర్చీలో

కూర్చుండిపోయారు. ఈవోతో తహసీల్దార్‌ వాగ్వాదం
స్థానిక తహసీల్దార్‌ మురళి ప్రోటోకాల్‌లో భాగంగా కలెక్టరేట్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ కుటుంబాన్ని వీవీఐపీ మార్గంలో అనుమతించాలని ఈవో శ్యామలాదేవిని కోరారు. దీనిని ఆమె తిరస్కరించారు. ఎవ్వరైనా వదలబోమని, వేరే మార్గాల్లో వెళ్లాలని సూచించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి చల్లారకపోవడంతో.. ఈవో శ్యామలాదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. ఉత్సవాన్ని మీరే నడిపించుకోండని, అక్కడి నుంచి వెనుదిరిగారు. వెంటనే పలువురు పోలీసు అధికారులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఈవో వెళ్లేందుకు నిర్ణయించుకుని ఆ అధికారికి ‘నమస్కారం’ పెట్టి ‘మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండం’టూ వెళ్లిపోయారు. ఈవో వెళ్లిపోయినప్పటికీ.. పోలీసుల కుటుంబాలు మాత్రం తమ తీరు కొనసాగించాయి. పలు ప్రభుత్వ శాఖలు తమ డఫేదారులను అస్త్రాలుగా వాడుకుని యథేచ్ఛగా అడ్డదారిలో అనధికారిక వీవీఐపీల అవతారమెత్తారు. ఈ వివాదంపై కలెక్టర్‌ ధనంజయరెడ్డి, ఎస్పీ త్రివిక్రమ్‌వర్మకు ఈవో ఫిర్యాదు చేశారు.

రూ.500 దర్శనానికీ ఇదే వ్యథ!
రూ.500 చెల్లించి టికెటు తీసుకున్న భక్తులకు కూడా చేదు అనుభవమే ఎదురైంది. మంగళవారం అర్ధరాత్రి 12.30 నుంచి బుధవారం ఉదయం 6 గం టల వరకు క్షీరాభిషేక టిక్కెటు తీసుకుని దర్శనం చేసుకునే భక్తులకు అంతరాలయం ముందు లైన్‌ నుంచి ఆదిత్యున్ని దర్శించుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ టిక్కెటుపై ఇద్దరికి అనుమతి ఉండటంతో పాటు ప్రసాదం కూడా పొందారు. రూ.500 చొప్పున ఒక్కొక్కరు దర్శన టిక్కెటు తీసుకున్న భక్తులకు మాత్రం దూరం నుంచి దర్శనంతో పాటు ఎటువంటి తీర్థప్రసాదాలు ఇవ్వలేదు. దర్శన సమయంలో అక్కడ బందోబస్తు పోలీసుల వైఖరితోనే రూ.500 దర్శన మార్గాలు ఇష్టానుసారంగా మారిపోయాయని, దాతల పాసుదారులకు కూడా దగ్గర దర్శనం కరువైంది.  

దాతలకు తీవ్ర అవస్థలు
ఆలయ అభివృద్ధికి రూ.లక్షకు పైగా విరాళాలిచ్చిన వారి సంబంధించిన కుటుంబాలకు దేవాదాయ శాఖ అధికారులు మొత్తం 328 డోనర్‌ పాసులను ఇచ్చారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు దాతల పాసుల ద్వారా వెళ్లిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. ఆలయ ముఖద్వారం వరకు రావడానికి 80 ఫీట్‌ రోడ్డు నుంచి నడిచి రావడంతో పాటు ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత కూడా వీవీఐపీల లైనులో దాతల కంటే అనధికారిక వ్యక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అంతరాలయంలో డోనర్‌ పాసుల భక్తులకు కనీసం అంతరాలయ దర్శనం కూడా దక్కలేదు. ప్రసాదాలకు కూడా నోచుకోలేదు. దీంతో వీరు నిరాశకు గురయ్యారు. కనీసం దాతల పాసులకు వాహన అనుమతి పాసు కూడా ఇవ్వకపోవడంతో అవస్థలు వర్ణనాతీతం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement