ఆదిత్యుని పండగకు తిరుమలలో ఏర్పాట్లు
Published Wed, Feb 1 2017 11:48 AM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM
తిరుమల: రథసప్తమి పర్వదినం సందర్బంగా శుక్రవారం సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు శ్రీవారు తిరుమల తిరువీధుల్లో సప్త వాహనాలలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. వేకువ జామున 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో మహోత్సవం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వరుసగా ప్రతి రెండు గంటలకు ఒకటి చొప్పున చిన్న శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలు జరుగుతాయి. మధ్యాహ్నం 2 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం ఘట్టం నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నందున సౌకర్యాల కల్పనకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేపట్టింది.
తిరువీధుల వెంట గ్యాలరీలను నిర్మించి అక్కడి నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేసింది. అక్కడక్కడ చలువ పందిళ్లను నిర్మించింది. గ్యాలరీల్లోని భక్తులకు ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంది. వాహన సేవలను వీక్షించడానికి భారీ పరిమాణంలో ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నది. ఆలయ ఈవో సాంబశివరావు ఆదేశాల మేరకు దేవస్థానం ఉద్యానవనశాఖ కూడళ్లతోపాటు రహదారి డివైడర్లు, వైకుంఠం-1 ఎదుట రంగురంగుల పూల మొక్కలను నాటి అందంగా తీర్చిదిద్దింది. ఏర్పాట్లపై తిరుమల జేఈవో శ్రీనివాసరాజు పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించి మార్పులు చేర్పులు సూచించారు.
Advertisement
Advertisement