
రోధిస్తున్న కిషోర్ తల్లి, కుటుంబ సభ్యులు
శ్రీకాకుళం, వజ్రపుకొత్తూరు: మండలంలోని కంబారాయుడుపేట సముద్ర తీరంలో రథసప్తమి పుణ్య స్నానాలకు వెల్లి గళ్లంతైన యువకుడు చిన్న కిషోర్(17) ఆచూకి నేటి వరకు లభించలేదు. మంగళవారం ఉదయం జరిగిన ఘటనలో తీరం వెంబడి కుటుంబ సభ్యులు, యువకులు, మెరైన్ పోలీసులు గాలిస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. దీంతో బాధిత కుటుంబంలో విషాదచాయలు అలముకున్నాయి. బుధవారం ఉదయం అబుదాబి(దుబాయ్) నుంచి ఇంటికి చేరుకున్న కిషోర్ తండ్రి నరిసింహమూర్తి భోరున విలపించారు.
ఇదిలా ఉండగా గ్రామంలోని యువకులు, కుటుంబ సభ్యులు భావనపాడు నుంచి బారువ వరకు సముద్ర తీరంలో రేయింబవళ్లు టార్చ్‌లైట్ వెలుగుల్లో వెతుకుతూనే ఉన్నారు. మరోవైపు తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో మెరైన్ పోలీసులు అక్కడి వారిని అప్రమత్తం చేశారు. భావనపాడు తీరంలో ఎటువంటి మెకనైజ్‌డ్ బోట్ లేకపోవడం, సిబ్బంది కొరత వేధించడం, ఈతగాళ్లను ఏర్పాటు చేయక పోవడంతో చాలామంది ఆచూకి లభించకపోవడం నిరాశ కలిగిస్తోంది. యంత్రాంగం పూర్తిస్థాయి దృష్టిసారిస్తే.. యువకుడి ఆచూకీ లభించేందుకు అవకాశాలు ఉన్నాయని స్థానిక మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.