పుష్పపల్లకిలో పురుషోత్తముడు
ఆణివార ఆస్థానం సందర్భంగా వేడుకగా పుష్పపల్లకీ సేవ
తిరువీధుల్లో సుగంధ పరిమళం
ప్రత్యేక ఆకర్షణగా పుష్కరిణి హారతి
తిరుమల : ఆణివార ఆస్థానం సందర్భంగా తిరుమలలో శుక్రవారం పుష్పపల్లకీ సేవ వేడుకగా సాగింది. దంతపల్లకీపై ఐదు వందల కేజీల సంప్రదాయ, విదేశీ కట్ పుష్పాలతో చెన్నై, బెంగళూరుకు చెందిన నిపుణులు పల్లకిని విశేషంగా అలంకరించారు. ఆలయంలో సాయంత్రం వైదిక కార్యక్రమాలు ముగించుకున్న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారిని పల్లకిలో వేంచేపుచేశారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య సాయంత్రం 6 గంటలకు పల్లకీ ఉత్సవ ఊరేగింపు ప్రారంభించా రు. సాయం సంధ్యాసమయంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో పల్లకీపై ఊరేగిన ఉత్సవమూర్తులను భక్తులు కనులారా దర్శించుకుని తన్మయం పొందారు. తిరువీధులు పుష్పపరిమళం వెదజల్లాయి. రెండేళ్లకు ముందు అధిక బరువు వల్ల జరిగిన అపశ్రుతులు పునరావృతం కాకుండా పల్లకీ మొత్తం బరువును మూడు టన్నుల నుంచి రెండు టన్నులకు కుదించారు. ఉత్సవమూర్తులు, తండ్లు, అర్చకులు, ఇతర సామగ్రి కలిపి మరో టన్ను బరువు ఉండేలా అధికారులు జాగ్రత్తపడ్డారు. పల్లకీ ఎత్తు 15 అడుగులు, పొడవు 22 అడుగులు, 10 అడుగులతో సిద్ధం చేశారు. పుష్పాలంకరణలో ఆరు రకాల కట్‌పుష్పాలు, మరో ఆరు రకాల సంప్రదాయ పుష్పాలు వినియోగించారు.
ఆకర్షణగా పుష్కరిణి హారతి
శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపులో భాగంగా శుక్రవారం నిర్వహించిన పుష్కరిణి హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు పుష్కరిణికి హారతి సమర్పించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి గోదారిగట్టున రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన పుష్కరిణి హారతిలో వేలాది మంది భక్తులు పాల్గొంటున్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, అదనపు సీవీ ఎస్‌వో శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, ఈఈ కృష్ణారెడ్డి, గార్డెన్ సూపరింటెం డెంట్ శ్రీనివాసులు పాల్గొన్నారు.