- మూడు రోజులపాటు హోటళ్లు, దుకాణాలన్నీ మూత
- సీటీవో వేధింపులపై భగ్గుమంటోన్న వ్యాపారులు
- శ్రీనివాసులు నాయుడుని బదిలీ చేయాల్సిందేనని స్పష్టీకరణ
- మంగళవారం నగరంలో పెద్ద ఎత్తున మోటార్ బైక్‌ల ర్యాలీ
తిరుపతి : తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులంతా ట్రేడ్ బంద్‌కు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు దుకాణాలన్నీ మూసి నిరసన తెలిపేందుకు సమాయత్తమవుతున్నారు. తిరుపతి, తిరుచానూరు, రేణిగుంట, చంద్రగిరి పట్టణాలకు చెందిన సుమారు 10 వేల మంది వ్యాపారులు బంద్‌లో పాల్గొంటున్నారు. తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సభ్యత్వం ఉన్న 27 వ్యాపార సంఘాలు మూకుమ్మడిగా బంద్‌కు పిలుపునిచ్చాయి. తిరుపతి సీటీవో-2 గా విధులు నిర్వర్తిస్తోన్న శ్రీనివాసులు నాయుడు వేధింపులకు నిరసనగా బంద్ పిలుపు ఇచ్చినట్లు తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మంజునాథ్ పేర్కొన్నారు.
ఇదీ వ్యాపార వర్గాల వాదన...
తిరుపతి సీటీవో శ్రీనివాసులు నాయుడు వ్యవహార శైలి బొత్తిగా బాగోలేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. తన మాట వినని వ్యాపారులపై ఉద్దేశపూర్వకంగా పెనాల్టీలు విధించడం, చిన్నచిన్న తప్పిదాలను ఎత్తిచూపి భారీ మొత్తంలో జరిమానాలు వసూలు చేయడం చేస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌లతో తనకున్న పరిచయాలను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా తమను వేధింపులకు గురిచేస్తున్నారని వ్యాపార వర్గాలు మండిపడుతున్నాయి. వ్యాపారులంతా పలుమార్లు సీటీవోను కలిసి గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో వీరు మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, యనమల రామకృష్ణులను కలిశారు.
సీటీవో శ్రీనివాసులు నాయుడును బదిలీ చేయకపోతే వ్యాపారాలు చేయడం కష్టమని చెప్పారు. అయినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా సీటీవో శ్రీనివాసులునాయుడు నగరంలో టైల్స్, ఇటుక వ్యాపారులను పట్టుకుని భారీగా పెనాల్టీలు విధించారు. దీంతో వ్యాపారులంతా ఒక్కసారిగా భగ్గుమన్నారు. అన్ని వ్యాపార సంఘాల అధ్యక్షులూ ప్రత్యేకంగా సమావేశమై మూడు రోజుల బంద్‌కు నిర్ణయం తీసుకున్నారు. బంద్ పోస్టర్లను కూడా విడుదల చేశారు. మంగళవారం తిరుపతి ఆర్ట్స్ కాలేజీ నుంచి పెద్ద ఎత్తున మోటార్‌బైక్‌ల ర్యాలీ ప్రారంభించి నగరంలోని ప్రధాన రోడ్లపై నిరసన నిర్వహించారు. సీటీవో శ్రీనివాసులు నాయుడును బదిలీ చేసే వరకూ ఆందోళనలను వీడబోమని వ్యాపార సంఘాలు స్పష్టం చేశాయి. పన్నులు చెల్లించేందుకు తాము వ్యతిరేకం కాదనీ, సీటీవో వ్యవహార శైలినే ఇబ్బందికరంగా ఉందన్నది వీరి వాదన.
బంద్ జరిగితే...
ఈ నెల 27 నుంచి తిరుపతిలో మహానాడు జరుగనుంది. 25 నుంచి ట్రేడ్ బంద్ జరిగితే హోటళ్లు, ట్రావెల్స్, ఫ్యాన్సీ, రెడీమేడ్, క్లాత్, ఐరన్, హార్డ్‌వేర్, కిరాణా, జ్యుయెల్లరీ షాపులన్నీ మూత పడతాయి. ప్రధానంగా హోటళ్లు మూతపడితే మహానాడుకు వచ్చే అతిథులకు గదులు దొరకడం కష్టమవుతుంది. నగరంలో వాటర్ సప్లయి, కొండ మీదకు పప్పులు, నూనెలు తీసుకెళ్లే లారీలు కూడా నిలిచిపోతాయి. ఇదే జరిగితే తిరుమల నిత్యాన్న పథకానికీ ఇబ్బందులు తలెత్తే వీలుంది. మెడికల్ షాపులు కూడా మూతపడనున్నాయి.
సీటీవో ఏమంటున్నారంటే...
వ్యాపార వర్గాల ఆరోపణలను సీటీవో శ్రీనివాసులు నాయుడు ఖండిస్తున్నారు. వారి ఆరోపణలన్నీ అవాస్తవమంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తానేమీ మాట్లాడలేనని 'సాక్షి' తో పేర్కొన్నారు.
25 నుంచి తిరుపతిలో ట్రేడ్ బంద్
Published Tue, May 24 2016 6:59 PM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM
Advertisement