తిరుపతి దాహార్తి తీరుస్తా
- ఆత్మీయ సభలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: ‘వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తిరుపతిలో నీటి సమస్యే లేకుండా చేస్తా’నని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. మూడేళ్లుగా సొంత ఖర్చుతో వాటర్ ట్యాంకర్ల ద్వారా నగర ప్రజల దాహార్తిని తీర్చుతున్న దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డికి శనివారం పెద్దకాపులేఔట్‌లో అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి సేవలను కొనియాడారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే తిరుపతితో సహా రాష్ట్రంలోని లక్షలాది మంది పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. రుయా ఆస్పత్రిలో రూ.20ల ఫీజు విధించిన ఘనత చంద్రబాబుదని నిప్పులు చెరిగారు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించారన్నారు. 11 సార్లు కరెంట్ చార్జీలు, 7 సార్లు బస్సు చార్జీలు పెంచారని గుర్తుచేశారు. అంగన్‌వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియాతో కలిసి రాష్ట్రాన్ని విడగొట్టిన బాబుకు ఓట్లు అడిగే హక్కులేదన్నారు.
మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డి మరణంతో రాష్ట్రంలో 672 మంది ప్రాణాలొదిలారంటే జనంలో ఆయన స్థానం ఏ పాటిదో అర్థమవుతుందన్నారు. రాజన్న రాజ్యం జగనన్నకే సాధ్యమన్నారు. ఫ్యాను గుర్తుకు ఓట్లేసి వైఎస్సార్‌సీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డిని పలువురు శాలువలు, పూలమాలలతో సత్కరించారు. వైఎస్సార్‌సీపీ నేతలు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, దొడ్డారెడ్డి శంకర్‌రెడ్డి, ఎస్‌కే.బాబు, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, భూమన్, జ్యోతిప్రకాష్, కుసుమ పాల్గొన్నారు.