
ఓపెన్ కోర్టు ముందుకు 346మంది స్మగ్లర్లు
తిరుపతి : ఎర్ర చందనం స్మగ్లర్లను తిరుపతి పోలీసులు మంగళవారం ఓపెన్ కోర్టులో హాజరు పరిచారు. తిరుపతి తారకరామా స్టేడియంలో విచారణ నిమిత్తం 346 మందిని భారీ బందోబస్తు మధ్య బహిరంగ న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. 2013 డిసెంబర్ 15న శేషాచలం అడవుల్లో ఇద్దరు అటవీ శాఖ అధికారులను హతమార్చిన కేసులో వీరు నిందితులు.
నిందితులు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన స్మగ్లర్లు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ ఎస్వీ.రాజశేఖర బాబు మాట్లాడుతూ అటవీ అధికారుల హత్య కేసులో 27రోజుల్లోనే ఛార్జ్షీటు దాఖలు చేసామని, అందువల్ల నిందితులకు ఇప్పటివరకూ బెయిల్ లభించలేదన్నారు. ఈ కేసులో నిందితులు ఇప్పటివరకూ జైల్లోనే ఉన్నారని ఆయన చెప్పారు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం స్మగ్లర్లు లేకుండా చేయటమే తమ లక్ష్యమన్నారు.