శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: తాత్కాలికంగానైనా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను తెలంగాణకు కేటాయిస్తే ఒప్పుకునేదిలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయం ఇలానే ఉంటే విడిపోయాక కూడా కొట్లాటలు తప్పవన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతితో శ్రీనివాస్ గౌడ్, టీఎన్డీవో నేతలు సమావేశమయ్యారు. ఉద్యోగుల పంపకాల్లో అవకతవకలను అరికట్టాలని వారు మహంతికి విజ్ఞప్తి చేశారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ఎవరి కార్యాలయాల్లో వారే పనిచేయాలని డిమాండ్ చేశారు.
విభజన మొదలయ్యాక ఇచ్చిన జీవోలు, భూ కేటాయింపులు, ఉద్యోగుల ప్రమోషన్లను తిరగతోడతామని చెప్పారు. విభజన ముంగిట్లో తెలుగు అకాడమీకి 80 కోట్ల రూపాయల విలువైన పుస్తకాలను ప్రింటింగ్‌కు ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన వార్ రూంపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయన్నారు. ఐఏఎస్‌లు ఒక ప్రాంతానికి కొమ్ముకాయకుండా అఖిల భారత ఉద్యోగులమని గుర్తుంచుకోవాలని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.