TNGO Leaders
-
ఎన్నికల విధులకు పారితోషికం పెంచండి: టీఎన్జీవో
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పారితోషికం పెంచాలని టీఎన్జీవో నేతలు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయలో ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్ నేతృత్వంలోని బృందం కలసి ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. -
గులాబీ మాల ఎవరికో?
* ఆశల పల్లకీలో దేవిప్రసాద్.. కొత్త ప్రభాకర్‌రెడ్డి * టికెట్ కోసం సీఎంను కలిసిన టీఎన్జీవో నేతలు * తాజా జాబితాలో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పేరు * నేడు అభ్యర్థిని ప్రకటించనున్న కేసీఆర్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థి ఎంపిక ఆ పార్టీలో గంటకో మలుపు తిరుగుతోంది. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుందోనని పార్టీవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్వయంగా మెదక్ ఎంపీ అభ్యర్థి పేరును మంగళవారం ప్రకటించనున్నట్టు సమాచారం. ఎంపీ టికెట్ ఆశిస్తున్నవారిలో టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్, టీఆర్ఎస్ నేతలు రాజయ్యయాదవ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రియల్టర్ కె.ప్రవీణ్‌రెడ్డిలు ఉన్నారు. వీరితోపాటు ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పేరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేవిప్రసాద్ మెదక్ ఎంపీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. దేవిప్రసాద్ మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. సకలజనులసమ్మెతోపాటు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి తెలంగాణ సాధన కోసం ఉద్యోగ సంఘాలతో కలిసి కృషి చేశారు. దీనికితోడు దేవిప్రసాద్ మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి కావటంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. టీఎన్జీవో రాష్ట్ర నేతలు సైతం దేవిప్రసాద్‌కు టికెట్ ఇవ్వాలని కేసీఆర్‌పై వత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. అయితే కేసీఆర్ స్పష్టమైన హామీ ఇవ్వనట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్‌రెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలిచారు. దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి గత ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే పోటీ చేయాలని భావించినా టికెట్ దక్కలేదు. దీంతో ఇప్పుడు మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా కేసీఆర్‌ను కోరుతున్నారు. కేసీఆర్ సైతం ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వంవైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందో చెప్పలేమని జిల్లా ముఖ్యనేత ఒకరు తెలిపారు. జహీరాబాద్ ఎంపీగా ఇది వరకే ఒక పారిశ్రామిక వేత్తకు టికెట్ కేటాయించినందున మెదక్ ఎంపీ టికెట్ వ్యాపారవేత్తలకు కేటాయిస్తే సబబుగా ఉండదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ భూపాల్రెడ్డిపేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. అయితే టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. -
విడిపోయినా కొట్లాటలు తప్పవు
హైదరాబాద్: తాత్కాలికంగానైనా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను తెలంగాణకు కేటాయిస్తే ఒప్పుకునేదిలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయం ఇలానే ఉంటే విడిపోయాక కూడా కొట్లాటలు తప్పవన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతితో శ్రీనివాస్ గౌడ్, టీఎన్డీవో నేతలు సమావేశమయ్యారు. ఉద్యోగుల పంపకాల్లో అవకతవకలను అరికట్టాలని వారు మహంతికి విజ్ఞప్తి చేశారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఎవరి కార్యాలయాల్లో వారే పనిచేయాలని డిమాండ్ చేశారు. విభజన మొదలయ్యాక ఇచ్చిన జీవోలు, భూ కేటాయింపులు, ఉద్యోగుల ప్రమోషన్లను తిరగతోడతామని చెప్పారు. విభజన ముంగిట్లో తెలుగు అకాడమీకి 80 కోట్ల రూపాయల విలువైన పుస్తకాలను ప్రింటింగ్‌కు ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన వార్ రూంపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయన్నారు. ఐఏఎస్‌లు ఒక ప్రాంతానికి కొమ్ముకాయకుండా అఖిల భారత ఉద్యోగులమని గుర్తుంచుకోవాలని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. -
ఆంధ్రా ఉద్యోగులను కాపాడుతాం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే ఇతర ప్రాంతాల ఉద్యోగులను కాపాడే బాధ్యతను తాము తీసుకుంటామని, సీమాంధ్ర ఉద్యోగులు విభజనకు సహకరించాలని టీఎన్జీవోస్‌ల అధ్యక్షుడు దేవీప్రసాదరావు కోరారు. సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో సంక్షేమ శాఖల్లో పనిచేస్తోన్న తెలంగాణ ఉద్యోగుల ఆధ్వర్యంలో శాంతి సద్భావనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దేవీప్రసాద్ మాట్లాడుతూ కొందరు రాజకీయ నాయకులు ప్రభుత్వ కార్యాలయాల్లోనికి వచ్చి సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలా వచ్చే రాజకీయ నాయకులు కార్యాలయాల్లో నుంచి వెళ్లిపోయేంత వరకు తెలంగాణ ఉద్యోగులు నిరసన తెలపాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి. విఠల్ మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని అన్నారు. ఆంధ్ర ప్రాంత ంలో తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై దాడులు చేస్తున్నారని, ఎంపీపై దాడి ఏ సమైక్యతకు నిదర్శనమని ప్రశ్నించారు. సీమాంధ్రలో పనిచేసే ఉద్యోగులు గన్మెన్ల రక్షణలో ఉంటున్నారని, అలాంటి పరిస్థితి ఇక్కడ లేదని అన్నారు. సభకు టీఎన్జీవో నగర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, టీఎన్జీవోల ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి సి.హెచ్.బాలరాజు వివిధ తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
ఏపీ ఎన్జీవోలను అడ్డుకున్న టీఎన్జీవోలు
హైదరాబాద్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 12 అర్ధరాత్రి నుంచి ఏపీఎన్జీవో చేపట్టనున్న నిరవధిక సమ్మెకు మద్దతు కూడగట్టడానికి బుధవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఏపీ ఎన్జీవో నగర నేతలను టీఎన్జీవో నాయకులు అడ్డుకుని వెళ్లగొట్టారు. ఏపీ ఎన్జీవో నగర అధ్యక్షుడు జీవీ సత్యానారాయణ ఆధ్వర్యంలో పలువురు సీమాంధ్ర ఉద్యోగులు కార్మిక శాఖలో పనిచేసే సీమాంధ్ర ఉద్యోగులను సమ్మెకు సిద్ధం చేయడానికి వచ్చి వారితో మాట్లాడేందుకు వచ్చారు. సమాచారమందుకున్న అదే శాఖలోని టీఎన్జీవో నాయకులు ‘తెలంగాణ ముద్దు.. సమైకాంధ్ర వద్దు అన్నదమ్ములుగా విడిపోయి కలిసుందాం.. జై తెలంగాణ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. దీంతో ఏపీ ఎన్జీవో నాయకులు వెనుదిరిగారు. 12న సచివాలయం ముట్టడి: ఓయూ విద్యార్థి జేఏసీ పిలుపు ఈ నెల 12న సచివాలయం ముట్టడి, భారీ ర్యాలీ కార్యక్రమానికి ఓయూ విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. బుధవారం విద్యార్థి జేఏసీ ప్రధాన కార్యదర్శి కరాటే రాజు విలేకర్లతో మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయంలో తిష్టవేసి తెలంగాణలోని అన్నిరంగాలను నష్టపరిచి... ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మహానగరంపై అనవసరపు రాద్ధాంతం చేయొద్దని ఏపీఎన్జీవోస్ నేతలను హెచ్చరించారు. సీఎం కిరణ్ ఏపీఎన్జీవోల వెనక ఉండి ఆందోళనలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమన్నారు.