గులాబీ మాల ఎవరికో?
* ఆశల పల్లకీలో దేవిప్రసాద్.. కొత్త ప్రభాకర్‌రెడ్డి
* టికెట్ కోసం సీఎంను కలిసిన టీఎన్జీవో నేతలు
* తాజా జాబితాలో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పేరు
* నేడు అభ్యర్థిని ప్రకటించనున్న కేసీఆర్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థి ఎంపిక ఆ పార్టీలో గంటకో మలుపు తిరుగుతోంది. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుందోనని పార్టీవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్వయంగా మెదక్ ఎంపీ అభ్యర్థి పేరును మంగళవారం ప్రకటించనున్నట్టు సమాచారం. ఎంపీ టికెట్ ఆశిస్తున్నవారిలో టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్, టీఆర్‌ఎస్ నేతలు రాజయ్యయాదవ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రియల్టర్ కె.ప్రవీణ్‌రెడ్డిలు ఉన్నారు. వీరితోపాటు ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పేరును టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేవిప్రసాద్ మెదక్ ఎంపీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
దేవిప్రసాద్ మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. సకలజనులసమ్మెతోపాటు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి తెలంగాణ సాధన కోసం ఉద్యోగ సంఘాలతో కలిసి కృషి చేశారు. దీనికితోడు దేవిప్రసాద్ మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి కావటంతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. టీఎన్జీవో రాష్ట్ర నేతలు సైతం దేవిప్రసాద్‌కు టికెట్ ఇవ్వాలని కేసీఆర్‌పై వత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. అయితే కేసీఆర్ స్పష్టమైన హామీ ఇవ్వనట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్ నేత కొత్త ప్రభాకర్‌రెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌కు వెన్నుదన్నుగా నిలిచారు. దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి గత ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే పోటీ చేయాలని భావించినా టికెట్ దక్కలేదు. దీంతో ఇప్పుడు మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా కేసీఆర్‌ను కోరుతున్నారు. కేసీఆర్ సైతం ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వంవైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందో చెప్పలేమని జిల్లా ముఖ్యనేత ఒకరు తెలిపారు. జహీరాబాద్ ఎంపీగా ఇది వరకే ఒక పారిశ్రామిక వేత్తకు టికెట్ కేటాయించినందున మెదక్ ఎంపీ టికెట్ వ్యాపారవేత్తలకు కేటాయిస్తే సబబుగా ఉండదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిపేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. అయితే టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.