మెదక్/మెదక్ టౌన్, న్యూస్‌లైన్: సింగూరు నీటితో జిల్లాలోని 1.50 లక్షల ఎకరాల భూమిని సస్యశ్యామలం చేస్తానని, మెదక్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేసి నిమ్స్‌లాంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కట్టిస్తానని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గురువారం రాత్రి మెదక్ పట్టణంలో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాకు న్యాయంగా రావాల్సిన సింగూరు నీరు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. దేశానికే ఆదర్శంగా నిరుపేదలకు రూ.3 లక్షల వ్యయంతో పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు.
రెండు బెడ్‌రూంలు, ఒక హాలు, బాత్రూం, టాయిలెట్లతో కూడిన ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు. బీడీ కార్మికులకు నెలకు రూ.1,000 భృతి చెల్లిస్తామని చెప్పారు. తండాలను పంచాయతీలుగా మారుస్తామన్నారు. మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. వృద్ధులకు, వితంతువులకు రూ.1,000, వికలాంగులకు రూ.1,500 చెల్లిస్తామన్నారు. రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీలేని రుణాలిస్తామన్నారు. ట్రాక్టర్లకు రవాణా పన్ను మినహాయిస్తామన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ తెలిపారు. రూ.90 వేల కోట్లతో 15 వేల మెగావాట్ల కరెంట్‌ను తయారు చేసుకుని రైతాంగానికి 24 గంటల కరెంట్ అందిస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడేళ్లు పడుతుందన్నారు. నిరుద్యోగులకు 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
మెదక్‌లో ఇద్దరిని ఎమ్మెల్సీలను చేస్తా
దివంగత మంత్రి కరణం రాంచందర్‌రావు కుమారుడు కరణం సోమశేఖర్‌రావును, నిత్యం తనవెంట ఉండే ఈ ప్రాంత వాసి శేరి సుభాష్‌రెడ్డిని ఎమ్మెల్సీలను చేస్తానని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. కాగా అంతకు ముందు మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆమరణ దీక్ష చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ సాధించారన్నారు. దాన్ని కాపాడుకోవాలంటే కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లా వదిలేసిన ఘనత టీఆర్‌ఎస్ వాళ్లదన్నారు. కాని పదవులను పట్టుకొని పాకులాడేది కాంగ్రెస్ వాళ్లన్నారు.
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమణాచారి మాట్లాడుతూ ఆంక్షలతో కూడిన తెలంగాణ వచ్చిందని, కాని సంపూర్ణ తెలంగాణ రావాలంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కరణం ఉమాదేవి, కరణం సోమశేఖర్, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు బాలాగౌడ్, కిషన్‌గౌడ్, మాజీ ఎంపీపీలు పద్మారావు, లావణ్యరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంగాధర్, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు కిష్టాగౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి, ఆశయ్య, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు కరణం వెంకటేశం, విద్యావేత్త సుభాష్ చందర్‌గౌడ్, టీఆర్‌ఎస్ నేతలు కృష్ణారెడ్డి, మల్లికార్జున్‌గౌడ్, సలాం, అనిత తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిర్దేశించిన సమయానికన్నా.. గంట ఆలస్యంగా కేసీఆర్ హెలికాప్టర్‌లో మెదక్‌కు చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఆయనవేదిక వద్దకు చేరుకుని, ప్రజలకు అభివాదం చేస్తూ చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు.
భారీగా తరలివచ్చిన జనం...
టీఆర్‌ఎస్ బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. బ్యాండు మేళాలు, బతుకమ్మ సంబరాలు, డోల్‌దెబ్బలు, గిరిజనుల నృత్యాలతో ఆయా గ్రామాల నుంచి ప్రజలు, పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సింగూరుతో సిరులు కురిపిస్తా
Published Thu, Apr 24 2014 11:38 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement