పూర్తిగా మాఫీ చేయాల్సిందే | To be waived | Sakshi
Sakshi News home page

పూర్తిగా మాఫీ చేయాల్సిందే

Published Tue, Jul 1 2014 1:35 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

To be waived

  •  వ్యవసాయ రుణాలపై రైతు సంఘాల ప్రతినిధుల తీర్మానం
  •  పెట్టుబడితో సమానంగా వరికి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్
  • విజయవాడ :  ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేయాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పలు రైతు సంఘాల ప్రతినిధులు తీర్మానించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో భారతీయ కిసాన్ సంఘ్ - ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ‘రుణమాఫీ - వరి మద్దతు ధర’పై రౌండ్‌టేబుల్ సమావేశం సోమవారం విజయవాడలో నిర్వహించారు.

    ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ బంగారం, వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీచేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. ఓ వైపు బ్యాంకుల నుంచి రైతులపై ఒత్తిడి పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
     
    కొత్త రుణాలివ్వాలి...

    సమావేశంలో పాల్గొన్న రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమై నెలరోజులు గడుస్తోందని, రైతుల రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు. తక్షణమే రైతు సమస్యలపై స్పందించాలని కోరారు.
     
    సాకులు వెతుకుతున్నారు...

    వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు అధికారం చేపట్టాక సాకులు వెతుకుతున్నారన్నారు. ముందుగా ప్రకటించిన విధంగా వ్యవసాయ రుణాలను తక్షణమే మాఫీ చేసి రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్‌లు ఇవ్వాలని కోరారు.

    ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు లక్ష కోట్లయినా సరేబ్యాంకర్లను నయానో..భయానో  ఒప్పించి రుణమాఫీ చేస్తామని ప్రకటించారని, దానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఏ పథకానికీ ఆధార్ కార్డును వినియోగించరాదంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే, మంత్రి మాత్రం వ్యవసాయ రుణమాఫీకి ఆధార్ లింకు పెడుతున్నారన్నారు. ఇవన్నీ.. ఇచ్చిన హామీల నుంచి వైదొలిగేందుకేనని విమర్శించారు. చిత్తశుద్ధితో రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 దాటితే వ్యవసాయ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేందుకు రైతులకు అవకాశం ఉండదన్నారు.
     
    ఉత్పాదక వ్యయం ఎక్కువ.. మద్దతు ధర తక్కువ...
     
    ఉత్పాదక వ్యయానికి సమానంగా వరి మద్దతు ధర ఉండేలా చర్యలు తీసుకోవాలని నాగిరెడ్డి కోరారు. ఓ వైపు ప్రభుత్వమే వరి పెట్టుబడి వ్యయం క్వింటాలుకు రూ.1708గా నిర్ణయించిందన్నారు. మద్దతు ధర మాత్రం అంతకంటే తక్కువ రూ.1360గా నిర్ణయించడం అన్యాయమన్నారు. కనీసం పెట్టుబడి వ్యయానికి తగ్గకుండా మద్దతు ధర నిర్ణయించాలని కోరారు. సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
     
    వ్యవసాయ రుణమాఫీ చేయాలని, రైతులపై ఒత్తిడి పెంచకుండా బ్యాంకర్లకు ఆదేశాలివ్వాలని, రుణమాఫీకి ఆధార్‌తో లింకు పెట్టవద్దని, ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతులకు రుణాలు మంజూరు చేయాలని, వరికి రూ.300 బోనస్ కల్పించాలని, రైతు సమస్యలపై ఎంపీలను కలిసి మెమొరాండం ఇవ్వాలని తీర్మానించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాంకిషోర్, టీడీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు.  నాయకులు విజయరామరాజు, కుమారస్వామి, ఎం.శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement