సహకరించిన మరో ఇద్దరు కూడా..
విజయవాడ సిటీ : అమాయకులను వలలో వేసుకొని నగదు, నగలు దొంగిలించి ఉడాయించే మాయ‘లేడి’తోపాటు ఆమెకు సహకరిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం సీసీఎస్ పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి 14 గ్రాముల బంగారం, రూ.500 నగదు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన వల్లభనేని వెంకట రమణ అలియాస్ రమ్య(28) ఆరేళ్ల కిందట భర్తతో విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమె ఇద్దరు పిల్లలు రామవరప్పాడులోని మిషన్ పాఠశాలలో చదువుతున్నారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు నుంచి విజయవాడ వస్తుండగా తెనాలికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం సాగిస్తోంది. ఈ క్రమంలో అతని వద్ద బంగారం, డబ్బు దోచుకోవాలనే ఉద్దేశంతో తన మేనమామ కుమారుడైన లంకే వెంకట నాగాంజనేయులు(23), దూరపు బంధువైన కొప్పనాతి సుభానీ(20)తో కలిసి పథకం రచించింది. గత నెల 26వ తేదీన తనతో వివాహేతర సంబంధం సాగించే తెనాలికి చెందిన వ్యక్తిని విజయవాడ తీసుకొచ్చింది.
రాత్రికి కృష్ణానది ఇసుకతిన్నెల వద్దకు తీసుకెళ్లింది. పథకం ప్రకారం నాగాంజనేయులు, సుభానీ పోలీసులమంటూ వచ్చి అతడ్ని బెదిరించి బంగారు గొలుసు, నగదు, సెల్‌ఫోన్ తీసుకొని ఉడాయించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు నిందితులను అరెస్ట్‌చేశారు.
మహిళా దొంగ అరెస్టు
నగరంలోని రద్దీ ప్రాంతాల్లో మహిళల బ్యాగులు, పర్సులు దొంగిలించే గుంటూరు జిల్లా సీతానగరానికి చెందిన బొజ్జగాని మరియమ్మను కూడా సీసీఎస్ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆమె నుంచి రూ.19వేల నగదు, కాసు బరువైన బంగారు చెవి దిద్దులను స్వాధీనం చేసుకున్నారు.
మాయ‘లేడీ’ అరెస్టు
Published Sun, Jan 4 2015 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM
Advertisement