వికారాబాద్, న్యూస్‌లైన్: మీరు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా..? మీకు తెలిసిన వారు పెళ్లి చేసుకోబోతున్నారా..? అయితే జరిగే వివాహానికి చట్టబద్ధత కల్పించుకోండి. తెలిసినవారికి మీ మాటగా చెప్పండి. వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించేలా రాష్ట్ర ప్రభుత్వం చ ట్టం తీసుకువచ్చింది. ఈ చట్టంలోని 8వ సెక్షన్ రాష్ట్రంలో జరిగే ప్రతి వివాహం తప్పనిసరిగా నమోదు కావాలని స్పష్టం చేస్తోంది. 2006 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.
చట్టం అమలుకు రాష్ట్ర స్థాయిలో వివాహాల రిజిస్ట్రార్ జనరల్ ఉంటారు. జిల్లాలకు జిల్లా వివాహాల రిజిస్ట్రార్ ఉంటారు. నిర్ణయించిన సంఖ్యలో అదనపు డిప్యూటీ రిజిస్ట్రార్లు ఉంటారు. వివాహాల రిజిస్ట్రేషన్ కోసం ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఉంటుంది. దాని పరిధిలో ప్రాంతాల వారీగా అధికారులు ఉంటారు. గ్రామాల్లో గ్రామ కార్యదర్శి, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో సంబంధిత కమిషనర్లు అధికారులుగా వ్యవహరిస్తారు.
ఇదీ విధానం..
వివాహం జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోపు పెళ్లి కుమారుడు/ కుమార్తె లేదా ఇద్దరిలో ఎవరి తల్లిదండ్రులు, సంరక్షకులైనా నిర్ధేశించిన దరఖాస్తు ఫారం నింపి అధికారికి అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తులో పెళ్లి కుమారుడు/ కుమార్తె వయసు తెలియ జేయాలి. ఇరువురి తరపున ఇద్దరు సాక్షులు వివాహాల అధికారి సమక్షంలో సంతకం చేయాల్సి ఉంటుంది. అధికారి ఈ సమాచారాన్ని వివాహాల రిజిస్టర్‌లో నమోదు చేసి అందరి సంతకాలు తీసుకుంటారు.
పెళ్లి జరిగే చోట, లేదా మన ఇంటి వద్ద కూడా వివాహం నమోదు చేసుకోవచ్చు. అయితే ముందుగా దరఖాస్తు చేసుకుని ఆ ప్రాంతం అధికారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం నిర్ధేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వివాహ నమోదు పత్రంపై వివాహాల అధికారి సంతకం, సీలు వేసి అందజేస్తారు. వివాహం జరిగిన 30 రోజుల తరువాత రిజిస్ట్రేషన్ చేయించాలంటే జరిగిన నాటి నుంచి రెండు నెలల లోపు రూ.100 ఫీజుతో నమోదు చేసుకునే అవకాశం ఉంది.
ఎందుకు నమోదు చేసుకోవాలి?
వివాహాన్ని చట్టబద్ధం చేసుకుంటే ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అర్హులుగా ఉంటారు. కుటుంబానికి సంబంధించిన అన్ని పథకాలు వర్తించేందుకు ఇది దోహదపడుతుంది. భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటే భరణం కోరేందుకు ఉపయోగపడుతుంది. కట్నం వేధింపుల సందర్భంగా నేరం రుజువు కావడానికి ముఖ్య ఆధారంగా పనికి వస్తుంది. హింసకు గురైన మహిళలు విడాకులు పొందడానికి అవసరమవుతుంది. విడాకులు కోరే వారు కూడా వివాహం జరిగిన ఆధారంగా చూపాల్సి ఉంటుంది. రెండో వివాహాలను అడ్డుకోవడానికి, బాల్య వివాహాలను నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
తప్పుడు సమాచారం ఇస్తే?
వివాహ నమోదు పత్రంలో తెలిసి, మోసపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ.వెయ్యి జరిమానా లేదా ఈ రెండూ అమలు చేస్తారు. వివాహం నమోదు చేయని అధికారికి మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా ఈ రెండు అమలు చేస్తారు.
వివాహం.. నమోదు చేసుకోండిలా...
Published Fri, Feb 28 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM
Advertisement