
రాజధాని అంశాలకు చట్టబద్ధత కల్పించాలి
ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం.. తుళ్లూరులో రైతుల సమావేశం
తుళ్లూరు రూరల్: ఐకమత్యంతోనేహక్కులను సాధించుకోగలమని, రాజధానికి సంబంధించిన అంశాలకు చట్టబద్ధత కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని రాజధాని ప్రాంత రైతులు అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరులోని రాయల సుబ్బారావు ప్రాంగణంలో రాజధాని ప్రాంత 29 గ్రామాల రైతులు ఆదివారం సమావేశమయ్యారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు, గ్రామకంఠాల వ్యవహారంపై చర్చించారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు కేటాయించాలని, గ్రామకంఠాల నిర్ధారణలో సమన్యాయం పాటించాలని పలువురు రైతులు ప్రభుత్వానికి సూచించారు.
సర్పంచ్ మేకల రాజేశ్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలోని భూమిలేని నిరుపేదలకు కేవలం 10 ఏళ్లు మాత్రమే రూ. 2,500 పింఛన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఆ తరువాత వారు జీవనం ఎలా సాగించాలని ్రప్రశ్నించారు. భూమిలేని ప్రతి నిరుపేద కుటుంబానికి 200-250 గజాల ఇళ్ల స్థలం ఇస్తే బాగుంటుందని సూచించారు. ప్రభుత్వానికీ, రైతు, రైతుకూలీలకు మధ్య వారధిలా రాజధాని ప్రాంత రైతు కూలీ సంఘం ఏర్పాటు ఉపయుక్తంగా ఉంటుందని పలువురు రైతులు అభిప్రాయపడ్డారు. సంఘం ఏర్పాటుకు గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. సమావేశంలో బెల్లంకొండ నరసింహారావు, పువ్వాడ సుధాకర్, తదితరులు, రైతులు పాల్గొన్నారు.