రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నేతల డిమాండ్
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కళాశాలల యాజమాన్యాలకు చెల్లించాల్సిందేనని వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టినా తాము సహకరిస్తామని, అయితే, పాత బకాయిలను మాత్రం వెంటనే విడుదల చేయాలన్నారు. హైదరాబాద్‌లో శనివారం తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలు, వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాల సంఘం వివిధ పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఇందులో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీసీఐ, సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో ఫీజు బ కాయిలను చెల్లించడంతోపాటు కౌన్సెలింగ్‌ను త్వరగా ప్రారంభించాలని అన్నిపార్టీలు కోరాయి.
మానవతా దృక్పథంలో ఫీజులను చెల్లించాలని, తప్పులకు పాల్పడే కాలేజీలపై చర్యలు తీసుకోవాలని సూచించాయి. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీ రామునాయక్, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు, కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగన్నాథరావు, సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రావారికి ఆపాలనుకునే క్రమంలో పెడుతున్న నిబంధనలు, 1956 స్థానికత వంటి వాటితో తెలంగాణలోని నిరుపేదలకే అన్యాయం జరుగుతుందని నేతలు పేర్కొన్నారు. ఈ సమస్యలపై సీఎం దృష్టిసారించాలన్నారు.
రేపు అడ్మిషన్స్ కమిటీల సమావేశం
హైదరాబాద్: ఇంజనీరింగ్ తదితర వృత్తివిద్యాకోర్సుల్లో ప్రవేశాలకు ఏర్పాటైన సెట్స్ కమిటీల సమావేశం ఈనెల 28న నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులు హాజరుకానున్నారు. ప్రవేశాల ప్రక్రియపై భవిష్యత్తు కార్యాచరణను ఈ సందర్భంగా నిర్ణయించే అవకాశం ఉంది.
ఫీజు బకాయిలు చెల్లించాల్సిందే..
Published Sun, Jul 27 2014 12:44 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
Advertisement
Advertisement