నెల్లూరు, సాక్షి ప్రతినిధి: కోవూరు శాసనసభ టికెట్ ఖరారులో నెలకొన్న వివాదంతో శాసనసభ్యులు ఆదాల ప్రభాకరరెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పచ్చచొక్కా తొడుక్కునే ముహూర్తం వాయిదా పడింది. ఈ నెల 24వ తేదీ జరగాల్సిన కార్యక్రమాన్ని 28న లేదా మార్చి 2వ తేదీగాని నిర్వహించాలని భావిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు బరిలోకి దించేందుకు ఆర్థికంగా బలమైన అభ్యర్థులను ఎంచుకునేందుకు చంద్రబాబు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన పార్టీ కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్న వారందరినీ కాదనుకుని ఆదాల, ముంగమూరు, పోలంరెడ్డిలకు తమ పార్టీ తీర్థం ఇవ్వడానికి పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. ఆదాలను కావలి అసెంబ్లీ నుంచి బరిలోకి దించాలని చంద్రబాబు చేసిన ఆలోచన వివాదమైంది. ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు ససేమిరా అనడంతో చేసేది లేక ఆదాలకు నెల్లూరు లోక్‌సభ టికెట్ ఖరారు చేశారు.
కాంగ్రెస్ నుంచి ఎలాగోలా బయట పడాలనే నిర్ణయానికి వచ్చిన ఆదాలకు మరో ప్రత్యామ్నాయం లేక లోక్‌సభ స్థానానికే పోటీ చేయడానికి మానసికంగా సిద్ధమయ్యారు. ముంగమూరు విషయంలో నెల్లూరు సిటీ నియోజక వర్గ టీడీపీ ముఖ్య నేతల నుంచి అభ్యంతరాలు వస్తున్నా వారందరినీ వదులుకునైనా ముంగమూరుకు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నిర్ణయించారు. దీంతో ఈ టికెట్ విషయంలో కూడా స్పష్టత వచ్చింది. కోవూరు వ్యవహారం తేలిగ్గా తేల్చవచ్చనే ధీమాతో చంద్రబాబు పోలంరెడ్డికి సై అన్నారు. దీంతో ఈనెల 24వ తేదీ నెల్లూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ వేదిక మీద నుంచే ముగ్గురికీ తెలుగుదేశం కండువా కప్పేందుకు చంద్రబాబు సరేనన్నారు.
అయితే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తాను మద్దతు ఇస్తున్న పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికే కోవూరు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. టీడీపీలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సైతం ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాను కోవూరు నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని, లేదంటే ఎక్కడి నుంచీ పోటీనే చేయబోనని బహిరంగంగానే చెబుతున్నారు. ‘నెల్లూరు రూరల్ నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికా నేను టీడీపీలో చేరుతోంది?’ అని ఆయన తన నిర్ణయాన్ని గట్టిగానే వివరిస్తున్నారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు కూడా ఈ టికెట్ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలంరెడ్డికే ఖరారు చేయాలని చంద్రబాబు మీద ఒత్తిడి పెంచారు. ఈ విషయం వివాదంగా మారడంతో ముగ్గురి చేరికను వాయిదా వే యాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.ఈలోగానే సోమిరెడ్డి, బీద సోదరులు, పోలంరెడ్డి, పెళ్లకూరులను కూర్చోబెట్టి వివాదం పరిష్కరించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ కారణంగానే ఈ ముగ్గురి చేరిక వాయిదా పడినట్టు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. కోవూరు పంచాయతీ తెగితే ఈనెల 28న గానీ, మార్చి 2వ తేదీ గానీ సాయంత్రం 5 గంటలకు వీఆర్‌సీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ ముఖ్య నాయకుడొకరు చెప్పారు.
సైకిలెక్కిన ముంగమూరు
తాను తెలుగుదేశంలో చేరడం, నెల్లూరు సిటీ నియోజక వర్గం నుంచే పోటీ చేయడం ఖాయమని శాసనసభ్యుడు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి చెప్పకనే చెప్పారు. గురువారం ఆయన నగరంలో సైకిల్ తొక్కుతూ కార్యక్రమాలకు హాజరయ్యారు. సైకిల్ తొక్కడం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మన గుర్తు ఇదే కదా అనే విధంగా సమాధానం ఇచ్చారు.
ఆ ముగ్గురి చేరిక వాయిదా
Published Fri, Feb 21 2014 2:33 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement