నేడు బంద్
- కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన
- గిరిజనులను ముంచే చర్య సరికాదు
- బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలి
- టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు
వరంగల్, న్యూస్‌లైన్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో తెలంగాణలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడాన్ని నిరసిస్తూ గురువారం బంద్ నిర్వహిస్తున్నట్టు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోడీ, చంద్రబాబు, సమైక్య కోటరీ కలిసి తెలంగాణ ప్రజల గుండెల్లో బాకులు దించుతున్నారని మండిపడ్డారు. బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు.
మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్ మాట్లాడుతూ జాతీయ గిరిజన విధానానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వ్యతిరేకమన్నారు. 1/70 చట్టం, మీసా, అటవీ హక్కుల చట్టం, గిరిజన సలహా మండలి నిబంధనలను తుంగలో తొక్కి.. ఏడు మండలాలను ముంచేందుకు చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తున్నామన్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
రాజ్యంగ హక్కులు కోల్పోతుంటే రక్షించాల్సిన గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రకృతి పూజారులను పశువుల మాదిరిగా భావించడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగులు ఆప్షన్‌లు కోరుతున్నారని.. కానీ, వందేండ్లు కలిసి ఉన్న గిరిజనులను అక్కడి నుంచి వెళ్లగొడుతుంటే స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.
ఈ సమస్యపై భద్రాచలంలో ఉద్యమిస్తామన్నారు. ఆంధ్రా పాల కుల కుట్రలను వ్యతిరేకిస్తున్నామని టీఆర్‌ఎస్ నగర కమిటీ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్ చెప్పారు. తెలంగాణ హక్కులను కాపాడుకుంటామన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఇండ్ల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఇంత హడావుడిగా ఆర్డినెన్స్‌ను తేవాల్సిన అవసరం ఏముందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లలితాయాదవ్, చింతం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ బంద్‌కు జేఏసీ మద్దతు
వరంగల్ : పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపేందుకు తెచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ గురువారం జరిగే తెలంగాణ బంద్‌కు సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నట్లు టీజేఏసీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. గిరిజనులను ముంపునకు గురిచేసే ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, ఏడు మండలాలను కలిపే చర్యలను వెంట నే ఉపసంహరించుకోవాలని కోరారు. బంద్‌లో జేఏసీలు భాగస్వామ్యం కావాలని కోరారు.
బంద్‌లో పాల్గొనాలి: వినయ్
నేటి బంద్‌లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ కోరారు. గిరిజనులను నిరాశ్రయులను చేస్తున్న వైఖరిని వ్యతిరేకించారు. తెలంగాణ టీడీపీ, బీజేపీ నా యకులు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. రాజ్యం గబద్ధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్డినెన్స్‌పేరుతో కొత్త విధానాలు అవలంభిస్తున్నారని మండిపడ్డారు.
బంద్ కు సీపీఎం మద్దతు
హన్మకొండ సిటీ : గురువారం జరగనున్న తెలంగాణ బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని సీపీఎం జిల్లా కార్యాదర్శి జి.నాగయ్య తెలిపారు. బుధవారం హన్మకొండ రాంనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జి.నాగయ్య పాల్గొని మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని ఖండించారు. రాష్ట్ర సరిహద్దులను మార్చేముందు ఆ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకురావడం సరికాదన్నారు. కార్యదర్శివర్గ స భ్యులు సూడి కృష్ణారెడ్డి, కె .వెంకటయ్య, ఎస్.వాసుదేవరెడ్డి, సీహెచ్.రంగయ్య, ఎం.చుక్క య్య, జి.ప్రభాకర్‌రెడ్డి, సాదుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీపీఐ కూడా..
హన్మకొండ చౌరస్తా : పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలుపుతు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం జరిగే బంద్‌కు సీపీఐ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జిల్లా సమితి కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. 205 గ్రామాలను ఆంధ్రాలో కలపడం దారుణమని పేర్కొన్నారు. పోలవరం డిజైన్ మార్చాలని డిమాండ్ చేశారు.