నేడు డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 33వ స్నాతకోత్సవం శనివారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభామందిరంలో బాబా మహా సమాధి చెంత ఘనంగా నిర్వహించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విశ్రాంత చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఉదయం 10.35 గంటలకు స్నాతకోత్సవం ప్రారంభమవుతుంది.
10.48కి వర్సిటీ వైస్ ఛాన్సలర్ శశిధర్ ప్రసాద్ స్నాతకోత్సవాన్ని డిక్లేర్ చేయాలని సత్యసాయిని ప్రార్థిస్తారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. 10.55కు ఛాన్సలర్ జస్టిస్ వెంకటాచలయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చేతుల మీదుగా విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేస్తారు.10.57కు విద్యార్థులు ప్రతిజ్ఞ చేస్తారు. 11 గంటలకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను బహూకరిస్తారు.
11.20కి ముఖ్యఅతిథి కస్తూరి రంగన్ విద్యార్థులకు స్నాతకోత్సవ సందేశాన్ని వినిపిస్తారు. 11.40కి ఉదయపు సెషన్ ముగుస్తుంది. సాయంత్రం 4.30 గంటలకు విద్యార్థుల వేదమంత్రోచ్ఛారణతో తిరిగి వేడుకలు ప్రారంభమవుతాయి. ఐదు గంటలకు విద్యాబోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సాయికృష్ణ అవార్డులను ప్రదానం చేస్తారు. 5.15కు విద్యార్థులు స్నాతకోత్సవ నాటిక ప్రదర్శిస్తారు.
విద్యా పరిమళాలు : విద్యావ్యాప్తికి సత్యసాయి విశేష కృషి చేశారు.
ఇందులో భాగంగా 1981 అక్టోబర్ 10న సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ లర్నింగ్(సత్యసాయి డీమ్డ్ టు బీ యునివర్సిటీ)ను స్థాపించారు. దీని ఆధ్వర్యంలో అనంతపురం మహిళా క్యాంపస్, ప్రశాంతి నిలయం, ముద్దనహళ్లి, బృందావన్ క్యాంపస్‌లను నెలకొల్పారు. దేశీయంగా మరో ఆరు సత్యసాయి కళాశాలలతో పాటు 99 పాఠశాలలు నిర్వహిస్తున్నారు. విదేశాలలో సైతం 30 పాఠశాలలు, మరో 30 కళాశాలలు నడుపుతున్నారు.