
అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
హైదరాబాద్ : శాసనసభలో విపక్షాలు మంగళవారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. విభజన బిల్లుపై సభ్యలు అభిప్రాయాలను కోరుతూ ఓటింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ సీపీ, తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వెల్లడించాలని టీడీపీ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.
కాగా రాష్ట్ర విభజన బిల్లుకు సంబంధించి అసెంబ్లీ వేదికగా రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతూ ఉత్కంఠను పెంచుతున్నాయి. బిల్లుపై చర్చకు రాష్ట్రపతి పొడిగించిన గడువు కూడా మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ మూడు రోజుల్లో విభజన బిల్లు పరిస్థితి ఏమవుతుంది? బిల్లును తిప్పి పంపుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ 77వ నిబంధన కింద ముఖ్యమంత్రి కిరణ్ ఇచ్చిన నోటీసు తీవ్ర దుమారం రేపుతున్న దృష్ట్యా దానిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? అదే నిబంధన కింద అంతకుముందే వైఎస్సార్‌సీపీ తదితరులిచ్చిన నోటీసులపై ఆయన వైఖరి ఎలా ఉండనుంది? పార్టీలకు అతీతంగా రాజకీయ వర్గాల్లో అంతటా ఇలాంటి పలు సందేహాలపైనే ఎడతెగని చర్చ జరుగుతోంది.