ఎండలే అసలు పరీక్ష
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
* 74,756 మంది విద్యార్థుల హాజరు
* ఉదయం 9 నుంచే సూర్యప్రతాపం
* ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎండల భయం పట్టుకుంది. ఉదయం 9 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడం ఇందుకు కారణం. దీనికితోడు గాలి, వెలుతురు రాని గదులను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేయడం, అందులో ఫ్యాన్లు, లైట్లు, మంచినీరు, ఇతర సౌకర్యాలు సరిగా లేకపోవడంపై కూడా విద్యార్థిలోకంలో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలను ఎదుర్కోవడం విద్యార్థులకు అగ్ని పరీక్షగా మారింది.
నాలుగు డిగ్రీల సెల్షియస్ ఎక్సెస్..
గత ఏడాది ఇంటర్ పరీక్షల సమయంలో భానుడి ప్రతాపం 36 డిగ్రీల సెల్షియస్‌కు పరిమితం కాగా ఈ ఏడాది ఆ తీవ్రత 39-40 డిగ్రీల మధ్య ఉంది. ఈ కారణంగా ఉదయం 9 గంటలకే జనాలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఉదయం 9నుంచి 12 గంటల మధ్య ఇంటర్ పరీక్షల నిర్వహణ సమయంలో ఇటు ఉక్కపోత, అటు ఎండ వేడిమితో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి నెలకొంది.
101 కేంద్రాలు, 74,576 మంది విద్యార్థులు
మర్చి 2 నుంచి 19 వరకు మొదటి సంవత్సరం, 3 నుంచి 21 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. 74,576 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 36,094 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 38,662 మంది ఉన్నారు. వీరికోసం జిల్లావ్యాప్తంగా 101 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వీటిలో ప్రభుత్వ/ఎయిడెడ్ కాలేజీల పరిస్థితి పర్వలేదనిపిస్తుండగా ప్రయివేట్ జూనియర్ కళాశాలల కేంద్రాల్లో మాత్రం వసతులు సరిగా లేనట్లు తెలుస్తోంది. గాలి, వెలుతురు సక్రమంగా రానివి, ఫ్యాన్లు, లైట్లు లేని గదులున్నట్లు సమాచారం. మరికొ న్ని కేంద్రాల్లో బెంచీలు లేని కారణంగా నేలబారు రాతలు తప్పని పరిస్థితి నెలకొంది.
13 స్క్వాడ్ బృందాలతో పర్యవేక్షణ
పరీక్షల నిర్వహణను 13 స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించనున్నాయి. ఇందులో నాలుగు ఫ్లైయింగ్ స్వ్కాడ్స్, హైపవర్ కమిటీ, ఆర్‌ఐఓ, డీవీఈఓ, డీఈసీ, ఐదు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు విరివిగా పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌ను నివారించేందుకు కృషి చేస్తాయి. సమస్యాత్మకంగా గుర్తించిన ఆలూరు, కౌతాళం, హొళగుంద కేంద్రాల్లో పర్యవేక్షణ అధికంగా ఉంటుంది. ఇక ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులుంటారు.
మూడు సెట్ల ప్రశ్న పత్రాలు..
ప్రతి పరీక్షకు మూడు సెట్ల ప్రశ్న పత్రాలను కేంద్రాల సమీపంలోని పోలీసు స్టేషన్లలో ఉంచారు. ఉదయం 8.30 గంటలకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారుల సెల్‌ఫోన్‌లకు వచ్చే మెసేజ్ ఆధారంగా ఎంపిక చేసిన సెట్ ప్రశ్నపత్రాలను తీసుకెళ్తారు. అన్ని పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
కంట్రోల్ రూం ఏర్పాటు..
పరీక్షలకు సంబంధించిన ఫిర్యాదులు, సూచనలు అందజేయడానికి ఆర్‌ఐఓ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇక్కడ సీనియర్ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో సభ్యులు.. సందేహాలను నివృత్తి చేస్తారు. ఇందుకోసం 040-24603317,0866-2974130, 08518-222407 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.
ఏర్పాట్లు పూర్తి
ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవు. - పరమేశ్వరెడ్డి, ఆర్‌ఐఓ