కర్నూలు(అగ్రికల్చర్): నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి వేడుక స్వాతంత్య్ర దినోత్సవాన్ని కర్నూలు నగరంలో నిర్వహిస్తున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కొండారెడ్డి బురుజు, గోల్ గుమ్మజ్‌తో పాటు ఇతర చారిత్రక కట్టడాలు, 1956కు కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో వినియోగించుకున్న భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కలెక్టర్ కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ లైట్లతో కొత్త అందాలను తీసుకువచ్చారు.
కర్నూలు నగరంలోని ప్రధాన కూడళ్లలో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న జాతీయ నాయకుల కటౌట్లను ఉంచారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని మరింత ప్రత్యేకంగా అలంకరించారు. ఏపీఎస్పీ మైదానంలో రాష్ట్ర స్థాయి వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ శాఖల అధిపతులు హాజరువుతున్నారు. సీఎం సహా ప్రభుత్వ శాఖల అధిపతులు కూడా గురువారం సాయంత్రానికే కర్నూలుకు చేరుకున్నారు.
దీంతో అధికారులు కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు జరిగే స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు సుమారు రూ.5 కోట్లు వ్యయం చేస్తున్నారు. అయితే ఈ వేడుకలు తిలకించేందుకు 5 వేల మందికే అవకాశం ఉంది. జిల్లా అధికార యంత్రాంగం జారీ చేసిన పాస్‌లు ఉన్న వారు మినహా ఇతరులనెవరినీ మైదానంలోకి అనుమతించరు. నగరంలో జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, వివిధ కళారంగాల నిపుణుల ఫ్లెక్సీ, బ్యానర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వేడుకలు జరిగే మైదానంలో వేదికకు ఎదురుగా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న జాతీయ నేతల కటౌట్లను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర వేడుకల్లో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటున్నారు.
తొలి వేడుక
Published Fri, Aug 15 2014 2:18 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement
Advertisement