సమరమే.. | special status battle | Sakshi
Sakshi News home page

సమరమే..

Published Fri, Sep 30 2016 1:01 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సమరమే.. - Sakshi

సమరమే..

ప్రత్యేక హోదా మా హక్కు
– మాట ఇచ్చి తప్పితే ఊరుకునేదిలేదని స్పష్టీకరణ
– వెంకయ్య, చంద్రబాబులు రాజీనామా చేయాలని డిమాండ్‌
– ప్యాకేజీతో నిండేది నాయకుల జేబులేనని విమర్శ
– ‘సాక్షి చైతన్య పథం’లో ముక్తకంఠంతో నినదించిన జిల్లా


సాక్షి ప్రతినిధి, కర్నూలు:
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకూ కలిసి పోరాడతామని కర్నూలు జిల్లా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు నినదించారు. ఎన్నికల ముందు మాట ఇచ్చి తర్వాత తప్పితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సాక్షి మీడియా ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై కర్నూలులో నిర్వహించిన చైతన్యపథం కార్యక్రమంలో వివిధ రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పిన కేంద్ర మంత్రి వెంకయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా ఆశను రగిల్చి, ఇప్పుడు లేదని చెప్పిన బీజేపీ వైఖరిని నిశితంగా విమర్శిస్తూ ఎంపీ బుట్టా రేణుక చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రత్యేక ప్యాకేజీ అంటూ టీడీపీ, బీజేపీలు చెబుతున్న లెక్కలన్నీ కూడా చనిపోతూ ఒక తండ్రి తన కుటుంబ సభ్యులకు పాల వ్యాపారం పంచినట్టుగా ఉందంటూ పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పిన పిట్టకథ అందరినీ ఆకర్షించింది. ప్రత్యేక హోదా వస్తే ఏయే రాయితీలు వస్తాయో బుగ్గన సవివరంగా తెలియజేశారు. గుంతకల్లుకు రైల్వే జోన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక ప్యాకేజీని ఆహ్వానిస్తానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఐజయ్య తూర్పారబట్టారు. గతంలో ప్రత్యేక హోదా ఇస్తామని.. తర్వాత చూస్తామని.. ఇప్పుడు ఇవ్వలేమంటూ టీడీపీ–బీజేపీలు మాట మార్చాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మండిపడ్డారు. ఇక ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఇతర రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థులు కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పంచెకట్టు.. పదనిసలు
వెంకయ్య నాయుడు పంచెకట్టుపై సీపీఐ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీష్‌బాబు మండిపడ్డారు. అయితే, ఈ సందర్భంగా పంచెకట్టును ఎవ్వరూ ఎగతాళి చేయలేదని అది ఆంధ్రులకు ఎంతో ఇష్టమైనదంటూ పంచెకట్టుపై సీపీఐ నాయకుడు రసూల్‌ పాడిన గీతం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బీజేపీ నేతలకు ఇతర పార్టీల నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సాక్షి టీవీ కొమ్మినేని శ్రీనివాసరావు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఎన్నికల ముందు హోదా ఇస్తామని వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని పక్కనపెట్టిన వెంకయ్య, చంద్రబాబు నాయుడులు రాజీనామాలు చేయాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య డిమాండ్‌ చేసిన సందర్భంలో వేడి రాజుకుంది. కర్ణాటక నుంచి నేను గెలిచానని, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కాదంటూ వెంకయ్య నాయుడు తాము ఢిల్లీలో కలిసిన సందర్భంలో వ్యాఖ్యానించారని ఎస్‌డీపీఐ నాయకులు చెప్పగా సభలోని నేతలతో పాటు విద్యార్థులు వెంకయ్య తీరుపై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పీబీవీ సుబ్బయ్య విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక ఉద్యమాలు వస్తాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు హెచ్చరించారు.

ప్రత్యేక హోదా కావాల్సిందే..
ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే కేవలం కొద్ది మంది నేతల జేబుల్లోకి పోతుందని చర్చ సందర్భంగా పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. తమకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా రావాల్సిందేనని నినదించారు. ప్రస్తుతం ప్లేస్‌మెంట్స్‌ లేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. హోదా కోసం జైళ్లకు వెళ్లేందుకైనా సిద్ధమేనని ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు కపిలేశ్వరయ్య, హరీష్‌బాబు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు బుగ్గన, ఐజయ్య, గౌరుచరిత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి హఫీజ్‌ఖాన్, నేతలు తోట కష్ణారెడ్డి, గుండం సూర్యప్రకాష్‌ రెడ్డి, సురేందర్‌ రెడ్డి, రాజా విష్ణువర్దన్‌ రెడ్డి, సీపీఎం నుంచి ప్రభాకర్‌ రెడ్డి, గౌసుదేశాయ్, సీపీఐ నుంచి ఓబులేసు, రసూల్, మునెప్ప, మనోహర్‌ మాణిక్యం, ఎస్‌డీపీఐ– ఖలీల్‌ అహమ్మద్, ఆమ్‌ఆద్మీ– సుబ్బయ్య, కేవీ సుబ్బారెడ్డి సంస్థల నుంచి సుబ్బారెడ్డి, అశోక్‌వర్దన్‌ రెడ్డి, ఐద్వా– అలివేలమ్మ, బీసీ జనసభ–మాతం నాగరాజు, ఏఐఎస్‌ఎఫ్‌ మహేంద్ర.. ఎస్టీ, ఎస్టీ స్టూడెంట్‌ పరిషత్‌– ఓబులేష్, అంబేద్కర్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌– రాజీవ్‌కుమార్, యూటీఎఫ్‌–డి.రామశేషయ్య, న్యాయవాది పద్మజానాయుడు, సీనియర్‌ సిటిజన్స్‌ నుంచి వేణుగోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement