అనంత గర్జన | chaithanya patham live in anantapur | Sakshi
Sakshi News home page

అనంత గర్జన

Published Wed, Sep 28 2016 11:09 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

అనంత గర్జన - Sakshi

అనంత గర్జన

ఉద్యమాల పురిటి గడ్డ ‘అనంత’ గర్జించింది. మన బతుకులు, భవిష్యత్తు ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా కోసం ఒక్కటై నినదించింది. అన్యాయాన్ని ఎదిరించాలి... పిడికిలెత్తి పోరాడాలి... మన హక్కులు సాధించుకోవాలి... అంటూ ప్రజలు ఎలుగెత్తి చాటారు. అనంతపురం నగరంలోని కేటీఆర్‌ కన్వెన్షన్‌ హాలులో ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో బుధవారం సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు నేతత్వంలో ‘చైతన్య పథం’ చర్చావేదిక జరిగింది. టీడీపీ మినహా అన్ని పార్టీలు, ప్రజా, విద్యార్థి, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొని.. ప్రత్యేక హోదా ఆకాంక్షను బలంగా చాటారు. మరో స్వాతంత్య్ర పోరాటంలా హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పలువురి అభిప్రాయాలు వారి మాటల్లోనే...

 
ఒక్కరు గెలిచినా ఉద్యమం విరమిస్తాం
ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోదీ, వెంకయ్యనాయుడు ఎంతో చెప్పారు. ఇప్పుడు మాట మారుస్తున్నారు. సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారు. వీరందరికీ ఒక్కటే చెబుతున్నాం.. ఎన్నికలకు వెళ్దాం..‘హోదా’ నినాదంతో మేము...  ‘ప్యాకేజీ’తో మీరు రండి.. మీలో ఒక్కరు గెలిచినా ప్రత్యేక హోదా ఉద్యమం విరమించుకుంటాం. విభజన తర్వాత ఎంతో నష్టపోయాం. ఇప్పుడు మళ్లీ నష్టపోవడానికి సిద్ధంగా లే ం. ఉద్యమం కొనసాగిస్తాం.
– రామకష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

======

హోదాతో బతుకులు మారుతాయి
14వ ఫైనాన్స్‌ కమిషన్‌ యూపీఏ హయాంలోనే ఉంది. పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.. ఏపీకి హోదా ఇస్తామన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు. మోదీకి ఈ విషయం తెలియదా? అంత అమాయకుడా? ప్రత్యేక హోదా వస్తేనే ఇక్కడి బతుకులు మారుతాయి.  హోదా ఉన్న రాష్ట్రాల్లో ఇక్కడి నాయకులు పరిశ్రమలు పెట్టింది వాస్తవం కాదా?  ఆర్థిక శాఖ.. చట్టబద్ధత అంటూ మోసపు మాటలు చెప్పొద్దు.
– రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి

==========================

‘ఓటుకు నోటే’ ముంచింది
ఏపీకి హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం చేశారు. మరి అర్ధరాత్రి ‘ప్రత్యేక ప్యాకేజీ’ని ఎందుకు స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పే ధైర్యం ఉందా? ‘ఓటుకు నోటు’ కేసుకు భయపడి చంద్రబాబు వ్యక్తిగత స్వార్థంతో హోదాపై కేంద్రానికి సరెండరయ్యారు. హైదరాబాద్‌ వెళ్లిపోయాక ఏపీలో ఎక్కడా పరిశ్రమలు లేవు. పెద్ద చదువులు చదివి ఉద్యోగం కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. సింగపూర్, జపాన్‌ వంటి దేశాలకు వెళ్లొచ్చిన చంద్రబాబు ఒక్క ప్రధాన పరిశ్రమనైనా తీసుకొచ్చారా? ప్రజల మనోభావాలు అర్థం చేసుకుని హోదా ఇవ్వాల్సిందే. పోరాటం ఆగదు.
– విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే

============

ప్రత్యేక హోదాయే సంజీవిని
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాయే సంజీవిని. అనంతపురం వంటి కరువు జిల్లాలో అనేక పరిశ్రమలు, రాయితీలు రావాలి. ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. విభజన చట్టంలో పేర్కొన్నవన్నీ మాకు కావాల్సిందే. హోదా అడిగితే ప్యాకేజీ అంటున్నారు. మోదీ అనుకుంటే హోదా పెద్ద విషయమేమీ కాదు. అందరూ కలిసి కట్టుగా ఉద్యమిద్దాం.. హోదా సాధించుకుందాం
– శంకరనారాయణ, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

===============

రాజకీయాలకు అతీతంగా ఒక్కటవుదాం
రాష్ట్ర విభజనకు ముందు సమైక్య ఉద్యమం అనంతపురం జిల్లా నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు ప్రత్యేక హోదా సాధన విషయంలోనూ ఈ జిల్లా నుంచే  ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ పేరుతో ఉద్యమం మొదలైంది. జిల్లాలో వెనుకబాటుతనం, పేదరికం ఎక్కువ. ఈ 30 ఏళ్లలో ఆరేళ్లు మాత్రమే పంట చేతికందింది. పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే హోదానే గత్యంతరం. రాజకీయాలకు అతీతంగా ఒక్కటవుదాం. బీజేపీ, టీడీపీ మెడలు వంచుదాం.
– జగదీశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి
===

ప్యాకేజీలతో ప్రయోజనం లేదు
ప్యాకేజీ వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అందరూ ఐకమత్యంగా వెళ్దాం. హోదా సాధించుకుందాం. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మానుకుని చిత్తశుద్ధితో పోరాటం చేద్దాం. ప్రత్యేక హోదా మన హక్కు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.
– కోటా సత్యం, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు
=============

హోదా తప్ప మరేమీ వద్దు
ప్యాకేజీ వల్ల మనకు అన్యాయమే జరుగుతుంది. పార్లమెంట్‌ సాక్షిగా చెప్పిన మాటలకే విలువలేకపోతే ఎలా? విభజన బిల్లులో జాతీయ విద్యా సంస్థలు ప్రకటించారు. ఇక్కడకు ఏదీ రాలేదు. మాకు హోదానే కావాలి.. ఇంకేమీ వద్దు.
– రాగే పరశురాం, కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు

============

విద్యార్థులు, యువత కదలిరండి
రాష్ట్ర విభజన తర్వాత మనం ఎంతగానో నష్టపోయాం. పరిశ్రమలు లేవు. ఉపాధి లేక యువత కొట్టుమిట్టాడుతోంది. ఏపీకి హోదాకు మించింది ఏదీ లేదు. జేఏసీలో అందరూ భాగస్వాములవుదాం. హోదా సాధనకు విద్యార్థులు, యువత కదలిరావాలి.
– గురునాథరెడ్డి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే

===============

ప్రజల ఆకాంక్షను తప్పుబట్టను
రాష్ట్ర విభజనకు ముందు ప్రత్యేక హోదా కోసం బీజేపీ మాత్రమే మాట్లాడింది. అది కూడా వెంకయ్య నాయుడు మాత్రమే పదేళ్లు హోదా కావాలని అడిగారు. ప్రత్యేక హోదా అందరి ఆకాంక్ష అనడంలో సందేహం లేదు. దాన్ని తప్పుపట్టడం లేదు.
– ఎంఎస్‌ పార్థసారథి, కదిరి మాజీ ఎమ్మెల్యే

============

ఆ రాష్ట్రాలకు చట్టబద్ధత ఉందా?
ప్రత్యేక హోదా విషయంలో ఎవరికి వారు మాట్లాడుతున్నారు. లోక్‌సభ, రాజ్యసభలో బిల్లు అయ్యాక ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాలని.. చట్టబద్ధత ఉండాలని అంటున్నారు. ఇప్పుడు హోదా ఉన్న అన్ని రాష్ట్రాల్లో చట్టబద్ధత ఉందా? ఇన్నాళ్లూ చేసింది చాలు. మాకు కావాల్సింది ప్రత్యేక హోదా.. దీనికోసం ఎందాకైనా వెళ్తాం. ఇది మా హక్కు.
– కేవీ రమణ, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు  

==========================

యజ్ఞంలా కొనసాగాలి
ప్రత్యేక హోదా ఉద్యమం యజ్ఞంలా కొనసాగాలి. ప్రత్యేక హోదా కల్పించాలని ఎన్నికలకు ముందు పార్లమెంట్‌ సాక్షిగా డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటూ ప్రజలను మోసం చేస్తున్నారు.  ప్రత్యేక సాయం పేరుతో ఇచ్చే భిక్ష అక్కర్లేదు. హోదా వస్తే పీజీ, ఎంబీఏ, పీహెచ్‌డీ పూర్తి చేసిన లక్షలాది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సాధ్యమవుతాయి.
– యుమునా రాణి, నిరుద్యోగి

====================================

ఎస్కేయూ వేదికగా ఉద్యమం
సమైక్యాంధ్ర ఉద్యమ తరహాలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎస్కేయూ వేదికగా ఉధతం చేయనున్నాం. ఉద్యమంలో పాల్గొనే విద్యార్థులపై అక్రమ కేసులు, సస్పెన్షన్‌లు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడం. హోదా సాధించి తీరుతాం.
– సి.నరసింహరెడ్డి, వైఎస్సార్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి
==============================


సమాజ శ్రేయస్సు కోరడం తప్పా ?
సమాజం కడుతున్న పన్నుల నుంచి జీతాలు తీసుకొంటున్నాం. అలాంటి వారి శ్రేయస్సు కోరడం తప్పని బెదిరిస్తున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో నపాల్గొన్నందుకు మెమో ఇచ్చారు.  సస్పెన్షన్‌ చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడనని స్పష్టం చేస్తున్నా. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరో స్వాతంత్య్ర పోరాటం తరహాలో ఉధతం చేస్తాం.
– డాక్టర్‌ ఎన్‌.ఆర్‌.సదాశివారెడ్డి, ఎస్కేయూ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు

==================================

ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు
స్వార్థపూరిత రాజకీయాల కోసం ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ప్యాకేజీ వల్ల రాజకీయ నాయకులకే లాభం. ప్రజలను వంచిస్తున్న వారికి గుణపాఠం చెబుతాం.
–వడిత్య శంకర్‌నాయక్, గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు .


ప్యాకేజీలతో ఒరిగేదేమీ లేదు
ప్యాకేజీలతో ఒరిగేదేమీ ఉండదు. ప్రత్యేక హోదా కల్పిస్తే అందరికీ ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. విద్యార్థులు పోరాడుతుంటే  కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ప్రత్యేక హోదా కల్పించకపోతే మేము బీటెక్‌ పూర్తి చేసినా లాభం ఉండదు.
–స్రవంతి, బీటెక్‌ విద్యార్థిని

=================================

పార్లమెంట్‌లో నిర్ణయాలకు లేదా?
పార్లమెంట్‌ సాక్షిగా ప్రత్యేక హోదా అంశంపై చర్చించి తగిన హామీలు గుప్పించారు. ఆ నిర్ణయాలకే గౌరవం లేకుండా పోయింది. ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ, టీడీపీ మాట మారుస్తున్నాయి
–వెంకట్రాముడు, బలిజ సంఘం రాయలసీమ అధ్యక్షుడు

==============================

ఉమ్మడిగా పోరాడాలి
ప్రత్యేక హోదా సాధనకు అన్ని పార్టీలు ఉమ్మడిగా పోరాడాలి. జాతీయ స్థాయి సంస్థలు ఏర్పాటు చేసినంత మాత్రాన నిరుద్యోగ నిర్మూలన సాధ్యం కాదు. ప్రత్యేక హోదాతోనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన వారు, అందుకు సహకరించిన పార్టీ నాయకులు ఇప్పటికైనా సంఘటితంగా ఉద్యమించాలి.
– చిరంజీవి రెడ్డి, విద్యాసంస్థల అధినేత


అందరి అజెండా ఒక్కటే ఉండాలి
ప్రత్యేక హోదా సాధనకు పార్టీల అజెండా ఒక్కటే ఉండాలి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరిని మార్చుకొని ప్రత్యేక హోదా కల్పనకు సిద్ధపడాలి. హోదా కల్పిస్తే పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సహాకాలు ఉంటాయి.
– కోగటం విజయభాస్కరరెడ్డి , అనంత నగరాభివద్ధి అధ్యక్షుడు


ద్వంద్వ వైఖరి వీడాలి
  బీజేపీ, టీడీపీ ద్వంద వైఖరితో ఏపీ ప్రజలకు తీరని నష్టం జరుగుతోంది. ప్రత్యేక హోదా కల్పించాలని ప్రజల్లో ప్రగాఢమైన ఆకాంక్షగా మారింది. ప్రజల మనోభావాలను కించపరిచిన రాజకీయ పార్టీలకు ఏం గతి పట్టిందో గుర్తించుకోవాలి.
– రాజగోపాల్, ఎస్సీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు .

ప్యాకేజీలతో వారికే లబ్ధి
రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది విద్యార్థులు డిగ్రీ, బీటెక్‌ పూర్తి చేస్తున్నారు. వీరందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే మార్గాలు అన్వేషించాలి. హోదానే ఇందుకు తరుణోపాయం .
– పులిరాజు, ప్రత్యేక హోదా ఎస్కేయూ జేఏసీ నాయకుడు

కమీషన్ల కోసం కక్కూర్తి
కమీషన్ల కోసం కక్కూర్తి పడి ప్యాకేజీని ఆహ్వానిస్తున్నారు. కరువు జిల్లాలో పరిశ్రమల స్థాపనతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధ్యమవుతాయి. రాయితీ ప్రకటిస్తేనే పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. ఇది ప్రత్యేక హోదా ద్వారానే సాధ్యమవుతుంది.
– కాపు రామచంద్రా రెడ్డి, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే

కాంగ్రెస్‌ పట్టించుకోలేదు
పునర్వ్యస్థీకరణ బిల్లులో ఏపీకి ఏమి కావాలనే అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదు. జాతీయ సంస్థల ఏర్పాటును కేవలం రెండేళ్లలోనే బీజేపీ అమలు చేసింది.  ఏపీ శ్రేయస్సు కోసం పరితపిస్తున్న వెంకయ్యనాయుడుపై విమర్శలు చేయడం భావ్యం కాదు.
– డి.వెంకటేశ్వర రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి

పరిశ్రమల ఏర్పాటుతోనే అభివద్ధి
ప్రత్యేక హోదా.. ప్యాకేజీకి తేడా లేదని బుకాయిస్తున్నారు. 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలవుతోంది. ఆ రాష్ట్రాల్లో పారిశ్రామిక పురోగతిని పరిశీలించండి. ఫిజికల్‌ ఇన్సెంటెవీస్‌ వస్తేనే పరిశ్రమల స్థాపన సాధ్యమవుతుంది. పారిశ్రామికీకరణతోనే నిరుద్యోగాన్ని రూపుమాపవచ్చు.
– ఆచార్య కేవీ రమణారెడ్డి, ఎమిరటర్స్‌ ప్రొఫెసర్, ఎస్కేయూ.

ఎంతకైనా తెగిస్తాం
ప్రత్యేక హోదా సాధనకు ఎంతకైనా తెగిస్తాం. పోరాటం చేస్తాం. ఎస్కేయూ వేదికగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధతం చేస్తాం. 5 కోట్ల ప్రజల ఆకాంక్ష సాకారానికి సమష్టిగా కార్యోన్ముఖులవుతాం.
– మచ్చా రామలింగా రెడ్డి, ప్రత్యేక హోదా కార్యనిర్వాహక కార్యదర్శి

టీడీపీ, బీజేపీలు తుడిచిపెట్టుకు పోతాయి
ప్రత్యేక హోదా కల్పనలో విఫలమైన బీజేపీ, టీడీపీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే ప్రత్యేక హోదా అనివార్యం.
–నదీం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి

 బీజేపీ హామీ ఏమైంది
ఎన్నికలకు ముందు రాజ్యసభలో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యాక హోదా అంశాన్ని కేంద్రంలో ఎన్‌డీఏ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు విస్మరించాయి. తాజాగా ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఈ ప్రభుత్వ పెద్దలు బుకాయిస్తున్నారు.
– రామాంజినేయులు, ఏఐఎస్‌ఎఫ్,  ఏపీ వర్సిటీల కో ఆర్డినేటర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement