
స్థానిక ముహూర్తం
- నేడు మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్‌ల ఎన్నిక
- రేపు మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఓటింగ్
- 5న జిల్లా పరిషత్‌కు..
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
విశాఖ రూరల్ : జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక పీఠాలపై ప్రజాప్రతినిధులు కొలువుతీరే సమయం ఆసన్నమైంది. మున్సిపల్, ప్రాదేశిక స్థానాలకు అధికార పగ్గాలు చేపట్టే తరుణం రానేవచ్చింది. గురువారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు జిల్లా, మండల పరిషత్‌లతోపాటు, మునిసిపాలిటీలకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి.
ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ఈ రెండింటా టీడీపీ మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. యల మంచిలిలో 24 వార్డులకు టీడీపీకి 21, వైఎస్‌ఆర్‌సీపీ మూడింట గెలుపొం దింది. ఇక్కడ రెండో వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ అభ్యర్థిని పిల్లా రమాకుమారి పేరు చైర్‌పర్సన్‌గా ఖరారైంది.
నర్సీపట్నంలో 27 వార్డులకు టీడీపీ 19, వైఎస్‌ఆర్‌సీపీ 6, కాంగ్రెస్, సీపీఐ చెరొకటి గెలుచుకున్నాయి. ఇక్కడ 25వ వార్డు నుంచి విజయం సాధించిన చింతకాయల అనితను చైర్మన్ పదవి వరించనుంది. రెండింటా టీడీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో ఎక్స్ ఆఫీషియో సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్లు నామమాత్రం కానున్నాయి. ఉదయం 11 గంటలకు చైర్‌పర్సన్‌లను ఎన్నుకోనున్నారు.
4న ఎంపీపీ, 5న జెడ్పీ
జిల్లాలో 39 జెడ్పీటీసీ, 654 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. టీడీపీ 24,వైఎస్సార్‌సీపీ15 జెడ్పీటీసీలను దక్కించుకున్నాయి. మెజారిటీ స్థానాలు పొందిన టీడీపీ జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. రాంబిల్లి జెడ్పీటీసీగా గెలుపొందిన లాలం భవాని చైర్‌పర్సన్ అభ్యర్థినిగా ఆ పార్టీ ప్రకటించింది. ఎంపీటీసీలకు సంబంధించి టీడీపీ 334 స్థానాలు, వైఎస్‌ఆర్‌సీపీ 254, కాంగ్రెస్ 17, సీపీఎం 5, సీపీఐ 3, బీజేపీ, బీఎస్పీ ఒక్కో స్థానంలో గెలవగా, స్వతంత్రులు 39 స్థానాల్లో విజయం సాధించారు. జిల్లాలో ఉన్న 39 మండల పరిషత్‌ల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు 4వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు.
టీడీపీ 20, వైఎస్‌ఆర్‌సీపీ10 మండలాల్లో పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకునే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. తొమ్మిది మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేదు. హంగ్ పరిస్థితి కొనసాగుతోంది. వీటిల్లో మునగపాక, అరకులోయల్లో టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు చెరి సగం ఎంపీటీసీలు దక్కడంతో ఇక్కడ టాస్ వేయనున్నారు. మిగిలిన ఏడు మండలాల్లో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఇండిపెండెంట్లు, వామపక్ష, కాంగ్రెస్ పార్టీలవారు కీలకం కానున్నారు.
ఏర్పాట్లు పూర్తి
ఈ ఎన్నికలకు హాజరుకావాలంటూ జిల్లా కలెక్టర్ సాల్మన్‌ఆరోఖ్యరాజ్ గెలిచిన అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలకు నోటీసులు జారీ చేశారు. ఎంపీపీ ఎన్నికలు ఆయా మండలాల్లో నిర్వహిస్తారు. ముందుగా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. మండలానికి ఒకరిని ఎన్నుకుం టారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కో- ఆప్షన్ పూర్తయ్యాక 3 గంటలకు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. అలాగే 5న కూడా ముందుగా జెడ్పీకి ఇద్దరు కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ ఎన్నిక అభ్యర్థులు చేతులు ఎత్తే విధానంలో నిర్వహిస్తారు.
ఈ ఎన్నికలకు పార్టీలు విప్‌ను జారీ చేయనున్నాయి. ఎంపీపీలకైతే 3వ తేదీ, జెడ్పీకి 4వ తేదీ ఉదయం 11 గంటల్లోగా ప్రిసైడింగ్ అధికారులకు విప్ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
జెడ్పీ చైర్మన్ చాంబర్ ఆధునికీకరణ
రెండేళ్లుగా జిల్లా పరిషత్‌కు చైర్మన్ లేకపోవడంతో నాటి నుంచి ఆ చాంబర్ మూతపడే ఉంది. ప్రస్తుతం చైర్‌పర్సన్ ఎన్నికలు నేపథ్యంలో ఆ చాంబర్‌ను తిరిగి సిద్ధం చేశారు. రెండేళ్లు నిర్వహణ లేకపోవడంతో ఆ చాంబర్ గోడలు, సీలింగ్ పూర్తి పాడయ్యాయి. దీంతో అధికారులు రూ.2.50 లక్షలు వెచ్చించి బాగు చేయించారు. ఏసీ పెట్టించి హంగులు దిద్దారు.